స్నేహం కోసం..!

సహ్యాద్రి పర్వత శ్రేణుల పక్కనే ఓ చిట్టడవి ఉంది. అందులోని ఒక చిన్న సరస్సులో ఓ మొసలి జీవిస్తోంది. ఆ సరస్సు ఒడ్డునున్న రావి చెట్టు మీద ఒక కాకి దాని కుటుంబంతో కలిసి ఉంటోంది. ఆ రెండింటి మధ్య స్నేహం కుదిరింది.

Updated : 26 Aug 2023 04:50 IST

హ్యాద్రి పర్వత శ్రేణుల పక్కనే ఓ చిట్టడవి ఉంది. అందులోని ఒక చిన్న సరస్సులో ఓ మొసలి జీవిస్తోంది. ఆ సరస్సు ఒడ్డునున్న రావి చెట్టు మీద ఒక కాకి దాని కుటుంబంతో కలిసి ఉంటోంది. ఆ రెండింటి మధ్య స్నేహం కుదిరింది. రోజూ అడవంతా తిరిగి, సాయంత్రానికి గూటికి చేరేదా కాకి. వచ్చీరాగానే మొసలితో కబుర్లు చెప్పేది. ఒకరోజు చెట్టు మీద నివసించే మిగిలిన పక్షులు.. ‘మనది పక్షి జాతి.. మొసలిది మృగజాతి.. పైగా అది జలచరం. దాంతో నీకు స్నేహం ఏంటి?’ అని ప్రశ్నించాయి. ‘మిత్రుత్వానికీ, జాతులకూ సంబంధం ఉంటుందా? మంచి మనసు ఉంటే, ఇక దేనితో నిమిత్తం లేకుండా స్నేహం చేయవచ్చు’ అని బదులిచ్చిందా కాకి. ‘సరే నీ ఇష్టం’ అన్నాయా పక్షులు.

అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు మొసలి దీనంగా కూర్చుని ఉంది. అప్పుడే వచ్చిన కాకి.. ‘ఏంటి మిత్రమా.. దిగులుగా కనిపిస్తున్నావు.. ఏమైనా సమస్యా?’ అని అడిగింది. ‘అవును మిత్రమా.. ఈ సంవత్సరం వర్షాలు అంతగా పడలేదు. ఈ చిన్ని సరస్సు ఏ క్షణమైనా ఎండిపోవచ్చు. ఆ తరువాత నా పరిస్థితి తలచుకుంటేనే దిగులుగా ఉంది. నీటిలో ఉండగా, ఏనుగునైనా పట్టగలిగే మేము.. బయటకు వస్తే కుక్కకి కూడా భయపడతాం’ అందది. ‘నిజమే.. ఇప్పడు దానికి ఏం చేయాలి?’ అని కాకి అడగడంతో.. ‘ఏముంది.. మరొక మంచి సరస్సు చూసుకుని అక్కడికి వెళ్లిపోవాలి. దానికి నీ సహాయం కావాలి’ అని చెప్పింది మొసలి.

‘నేను చేయగలిగిన సహాయం ఏమిటో చెప్పు.. కచ్చితంగా చేస్తాను’ భరోసానిచ్చిందా కాకి. ‘నీకు ఈ అడవంతా తెలుసు కదా.. దగ్గర్లో ఎక్కడైనా ఎండాకాలంలో కూడా ఎండిపోని మంచి సరస్సు ఉందేమో చూడు.. అక్కడ నాకు అపాయం లేకుండా, కాస్త తిండి దొరికేతే చాలు.. అక్కడికి వెళ్లిపోతాను’ అంది మొసలి. వారిద్దరి మాటలను దూరం నుంచి విన్న కుందేలు.. కాకిని పిలిచి ‘అది క్రూర జంతువు. ఇక్కడి నుంచి తీసుకెళ్లి, నువ్వు ఎక్కడ పెట్టినా అక్కడి జంతువులు నిన్ను తిట్టుకుంటాయి’ అంది. నిజమేననుకుంటూ సలహా కోసం.. తెలిసిన ఒక ముసలి పావురం దగ్గరకు వెళ్లింది కాకి. ‘స్నేహాన్ని మించింది లేదు. నువ్వు నీ స్నేహితునికి సహాయం చేయడం మిత్రధర్మం. ఇక అది జంతువులను తినడం అంటావా.. అది మృగధర్మం. సరస్సులోకి వచ్చిన జంతువులనే కదా అది తినేది.. ఒకవేళ అది కాకపోతే సింహం, పులిలాంటివి ఈ అడవిలో లేవా.. అవి జంతువులని తినడం లేదా? మరీ ఎక్కువగా ఆలోచించకుండా నీ స్నేహితునికి మంచి సరస్సు చూపించు.. కాకపోతే పిల్ల ప్రాణుల జోలికి పోవద్దని చెప్పు’ అని సూచించిందా పావురం.

పావురం మాటలతో కాకికి కాస్త ధైర్యం వచ్చింది. అడవి మొత్తం తిరిగి ఓ మంచి సరస్సుని చూసింది. ఓ పున్నమి రోజు రాత్రి అన్ని జంతువులు నిద్రించాక.. అది ముందు ఎగురుతూ మొసలిని ఆ కొత్త సరస్సుకి తీసుకెళ్లింది. పావురం అన్న మాటలు మొసలికి చెప్పి.. పిల్ల జంతువుల జోలికి పోకూడదని మాట తీసుకుంది. స్నేహితుడికి ధన్యవాదాలు చెప్పి, ఆ కొత్త సరస్సులోకి వెళ్లింది మొసలి. కొత్తగా వచ్చిన ఆ మొసలిని చూడగానే అందులోని చేపలు, కప్పలు, తాబేళ్లు భయంతో వణికిపోయాయి. ‘భయపడకండి.. నేను మీ జోలికి రాను’ అని వాటిని భరోసానిచ్చిందా మొసలి.

ఆ రోజు నుంచి దాహం తీర్చుకునేందుకు వచ్చే జంతువులను వేటాడి దాని ఆకలి తీర్చుకోసాగింది. అప్పటి వరకు ఏ భయం లేని అక్కడి జంతువులు, ఇక ఆ సరస్సు దగ్గరకు వెళ్లే సాహసం చేయలేకపోయాయి. ఇంతలో ‘ఎప్పుడూ లేనిది.. ఒక మొసలి ఈ సరస్సులోకి ఎలా వచ్చింది?’ అని జంతువుల మధ్య చర్చ వచ్చింది. కాకే దాన్ని తీసుకొచ్చిందని వాటికి తెలిసింది. ముందే కుందేలు చెప్పినట్టు.. ఆ జంతువులన్నీ కాకిని తిట్టసాగాయి. ఆ మాటలన్నీ నీటిలో ఉన్న మొసలి వరకూ వెళ్లాయి. ‘నా వల్ల మిత్రుడు మాట పడుతున్నాడు’ అని అనుకున్న మొసలి.. రాత్రికి రాత్రే అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకొని బయలుదేరింది. సరస్సు దగ్గరకు వచ్చిన కాకికి.. మొసలి ఎక్కడికో వెళ్లిపోయిందని తెలిసి బాధ పడింది. దాన్ని వెతుక్కుంటూ రివ్వున గాల్లోకి ఎగిరింది. కొంత దూరంలో నెమ్మదిగా పాకుతూ వెళ్తున్న మొసలి కనిపించింది. కానీ, అదే సమయంలో కనుచూపు మేరలో ఓ పులుల మందను చూసింది కాకి. వెంటనే మొసలి ముందు వాలి పులుల విషయం చెప్పింది. దాంతో మొసలి, కాకి వెంటనే పక్కనున్న పొదల చాటుకెళ్లి దాక్కున్నాయి. పులుల గుంపు వెళ్లిపోయాక.. మళ్లీ ప్రయాణం ప్రారంభించింది మొసలి.

‘మిత్రమా ఏమిటిదీ.. కొంచెంలో ఎంత ప్రమాదం తప్పింది.. అయినా ఎక్కడికీ ప్రయాణం?’ అని అడిగింది కాకి. ‘ఇక్కడకు దగ్గర్లో ఓ సరస్సు ఉందని తెలిసింది. నేను అక్కడికి వెళ్లిపోతాను. అప్పుడు నీకు ఏ ఇబ్బందీ ఉండదు’ అంది మొసలి. ‘ఎవరో ఏదో అన్నారని, నాకు చెప్పకుండా వెళ్లడం భావ్యమా? స్నేహం అంటే ఇదేనా?’ అని బాధగా అడిగింది కాకి. ‘మీ ఇద్దరి స్నేహం చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఇక్కడికి కొద్ది దూరంలో ఓ పెద్ద చెరువు ఉంది. అది ఎప్పటికీ ఎండిపోదు. పైగా అందులో మొసళ్లు కూడా ఉన్నాయి’ అని అప్పుడే అక్కడికి వచ్చిన పావురం చెప్పింది. మంచి మాట చెప్పావంటూ మొసలి, కాకి దానికి ధన్యవాదాలు చెప్పాయి.  

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని