సింహం పాట.. కాకికి పాఠం!

అదో చిట్టడవి. వేటాడి అలసిపోవడంతో నిద్రపోయిన సింహానికి సాయంత్రం మెలకువ వచ్చింది. గుహ బయటకు వచ్చి, ఎదురుగా ఉన్న పెద్ద బండ మీద కూర్చుని.. చుట్టూ చూడసాగింది.

Updated : 27 Aug 2023 05:08 IST

అదో చిట్టడవి. వేటాడి అలసిపోవడంతో నిద్రపోయిన సింహానికి సాయంత్రం మెలకువ వచ్చింది. గుహ బయటకు వచ్చి, ఎదురుగా ఉన్న పెద్ద బండ మీద కూర్చుని.. చుట్టూ చూడసాగింది. తనకెదురుగా చెట్టు పైన ఒక కాకి కనిపించింది. దాన్ని దగ్గరకు పిలిచి.. ‘మధ్యాహ్నం ఆహారం ఎక్కువ తిన్నాను. వేటలోనూ అలసిపోవడంతో నిద్ర బాగా పట్టింది’ అని చెబుతూనే ‘ఆ.. ఆ..!!’ అంటూ కూనిరాగాలు తీయసాగింది.
‘అబ్బో.. ఎన్నడూ లేనిది రాజావారు పాటలు భలేగా పాడుతున్నారే..’ అని ముచ్చటగా అంది కాకి. ‘నిజమే.. నాకు పాటలు నేర్చుకోవాలని ఉంది.. ఎలా?’ అని అడిగింది సింహం. ‘ప్రభూ.. నాకు పాటలు రావు’ అని దీనంగా బదులిచ్చిందా కాకి. ‘తెలుసు.. నాట్యంలో నెమలిని, పాటల్లో కోకిలను మించిన వారు లేరు’ అని చెబుతూనే.. ‘కోకిలా.. కోకిలా..’ అంటూ గట్టిగా పిలిచింది సింహం. కానీ, సమీపంలో అదెక్కడా కనిపించలేదు. ‘కోకిల ఇక్కడ లేనట్టుంది రాజా..’ అంది కాకి.
‘నేను నిద్రపోయే ముందు వరకూ ఇక్కడే ఉందిగా.. నా కళ్లారా చూశాను’ అని ఆశ్చర్యంగా అడిగింది సింహం. ‘మీరు గుహ నుంచి బయటకు వచ్చే ముందే ఎక్కడికో వెళ్లినట్లుంది’ బదులుగా అంది కాకి. ‘వెంటనే వెళ్లి కోకిలను పిలుచుకుని రా.. నాకు పాటలు నేర్చుకోవాలని ఉంది’ అని ఆదేశించింది మృగరాజు. రివ్వున ఎగురుకుంటూ వెళ్లి, క్షణాల్లోనే కోకిలను తీసుకొచ్చిందది. సింహం కోరడంతో పాటలు పాడటం మొదలు పెట్టింది. సింహం కూడా దాన్ని అనుకరించసాగింది.
అయితే, కోకిల పాడుతుంటే.. కాకికి వినసొంపుగా ఉంటే, సింహం పాట మాత్రం కఠోరంగా అనిపించింది. అయినా, తప్పక కాసేపు భరించింది. ఇక లాభం లేదనుకుంది. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని.. ‘మృగరాజా.. కోకిల ఎంత ప్రయత్నించినా మీ బలం దానికి రాదు. అదేవిధంగా మీరు ఎంత ప్రయత్నించినా దానిలా మధురంగా పాడలేరు. ఎవరి గొప్ప వారిదేనని మీకు తెలియంది కాదు..’ అంది కాకి. ఆ మాటలకు సింహం ఒక్కసారిగా గట్టిగా నవ్వింది. ‘తప్పుగా మాట్లాడితే క్షమించండి ప్రభూ..’ అంటూ కాకి కాస్త చిన్నబుచ్చుకుంది.
అప్పుడు సింహం నవ్వుతూ.. ‘ఉదయం ఈ కోకిల తన గుడ్లను నీ గూటిలో పెట్టుకుంటానని దీనంగా అడిగింది. కానీ, నువ్వు వద్దన్నావు. పైగా.. దాని గూడు దాన్నే కట్టుకొమ్మని, ఆ గూటిలోనే గుడ్లను పెట్టుకొమ్మని సలహా కూడా ఇచ్చి తరిమేశావు. ఎంత ప్రయత్నించినా కోకిల నీలా గూడు కట్టలేదు.. గుడ్లను పొదగలేదన్న విషయం నీకూ తెలుసు. ఒకరిని వేలెత్తి చూపిస్తే, మిగతా వేళ్లు మనవైపే చూపిస్తాయని గుర్తుంచుకో.. ఇప్పుడు నువ్వు నాతో అన్న మాటలు నీకూ వర్తిస్తాయని గ్రహించు. తోటి జీవులకు చేతనైన సాయం చేయాలి. అప్పుడే అందరికీ మంచిది. ఆపద సమయాల్లో ఆ మంచితనమే మనల్ని కాపాడుతుంది. నీ తప్పు నీకు తెలిసి రావాలనే, కోకిలను పాటలు నేర్పమని అడిగాను. నేను పాడలేనని నాకూ తెలుసు. ఇప్పుడు అర్థమైందా?’ అంది సింహం.
ఆ మాటలతో కాకికి తన తప్పు తెలిసొచ్చింది. సింహానికి, కోకిలకు క్షమాపణలు చెప్పింది. గుడ్లను తన గూటిలో పెట్టుకోమని కోకిలకు చెప్పడంతో.. అది ఎంతో సంతోషించింది. సింహానికి, కాకికి కృతజ్ఞతలు చెప్పింది.
కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని