తాతయ్య మాట.. బడికి బాట!

సుందరం తాతయ్య ఒకప్పుడు సైన్యంలో పనిచేసి, ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. ఎప్పుడూ ఎవరికైనా మంచి చేయాలని ఆలోచించే వ్యక్తి. ఒకరోజు ఉదయం ఇంటికి సరకులు కొనడానికి వెళుతుండగా చాలా మంది బడి పిల్లలు నడుస్తూ ఎదురయ్యారు.

Published : 28 Aug 2023 00:32 IST

సుందరం తాతయ్య ఒకప్పుడు సైన్యంలో పనిచేసి, ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. ఎప్పుడూ ఎవరికైనా మంచి చేయాలని ఆలోచించే వ్యక్తి. ఒకరోజు ఉదయం ఇంటికి సరకులు కొనడానికి వెళుతుండగా చాలా మంది బడి పిల్లలు నడుస్తూ ఎదురయ్యారు. తాతయ్య ఇంటి వెనకనే పెద్ద బడి ఉంది. పుస్తకాల సంచి, టిఫిన్‌ బాక్స్‌తో యూనిఫారాల్లో వస్తున్న పిల్లల్ని చూసి ముచ్చటపడ్డాడు తాతయ్య.

వాళ్లనే చూస్తూ నడుస్తుంటే, ఎవరో పిల్లాడి ఏడుపు వినబడింది. అటు చూశాడు తాతయ్య. అయిదేళ్ల పిల్లాడి చెంప మీద ఒక దెబ్బ వేసి.. ‘బడికి వెళ్లనంటే వీపు మీద మరొకటి ఇస్తాను. బడి అనే సరికి ఏడవడం అలవాటైంది నీకు. ముందుకు నడు’ అంటూ ఒక పిల్లాడి కాలర్‌ పట్టుకుని లాగుతున్న తల్లిని చూశాడు తాతయ్య.

ఆమె దగ్గరికి వెళ్లి... ‘ఎందుకలా కొడుతున్నావు? మంచిగా నచ్చజెప్పాలి. అలా భయపెడితే ఎలా?’ అనడిగాడు తాతయ్య. ‘వీడి సంగతి మీకు తెలియదు. అల్లరి పిల్లాడు. ఇల్లు పీకి పందిరి వేస్తాడు. బడి అంటే చాలు ఏడుస్తాడు. వీడితో వేగలేకపోతున్నాను. కొట్టక ఏం చెయ్యమంటారు?’ అని బదులిచ్చింది ఆమె.

కుర్రాడి ముందు వొంగి కూర్చుని వాడి ముఖంలోకి చూసి ‘ఎందుకేడుస్తున్నావు? నవ్వుకుంటూ బడికి వెళ్లాలి. వాళ్లను చూడు ఎలా నవ్వుతూ వెళుతున్నారో. నువ్వు అలా ఏడవకూడదు’ అని ఆ పిల్లాడిని నవ్వించడానికి ప్రయత్నించాడు తాతయ్య. దానికా పిల్లాడు... ‘బడిలో బూచాడు ఉంటాడు. టీచర్లు గట్టిగా కొడతారు. నాకు భయం. నేను వెళ్లను. ఇంటికెళ్లిపోతాను’ అని ఏడుపు మొదలుపెట్టాడు.

‘నీకు అలా ఎవరు చెప్పారు?’ అని అడిగాడు తాత. దానికి జవాబుగా అమ్మ వైపు వేలు చూపించాడా పిల్లాడు. తాతయ్యకు మరీ ఆశ్చర్యమనిపించింది. పిల్లాడి అమ్మ వైపు చూసి ఏదో చెప్పబోతుండగా బడికి వెళుతున్న విద్యార్థి ఒకరు పక్కన ఆగి... ‘‘వాళ్లది మా పక్కిల్లే. వాడు అల్లరి చేసినప్పుడల్లా వాళ్లమ్మ... ‘ఈ అల్లరంతా ఇంట్లో ఉన్నప్పుడే. నిన్ను బడిలో వేస్తాం. అక్కడివన్నీ పనికిరావు. టీచర్లు గట్టిగా కొడతారు. బూచాడు వచ్చి ఎత్తుకుపోతాడు’ అని బెదిరించడం చాలాసార్లు విన్నాను. అందుకే వాడికి బడంటే భయం’’ అని చెప్పాడు.

అంతలో వాళ్లమ్మ చెయ్యి పట్టుకుని నవ్వుతూ వస్తున్న మరో బుజ్జి పాప కనబడింది. ఆ అమ్మాయిని చూపించి... ‘ఆ పాప సంతోషంగా బడికి వెళుతోంది. చూశావా? నువ్వూ భయపడకుండా వెళ్లు’ అని నచ్చజెప్పాడు తాతయ్య. ‘ఊహూ.. వెళ్లను. టీచర్లు కొడతారు’ అని బదులిచ్చాడు పిల్లాడు. సరిగ్గా అప్పుడే అక్కడి నుంచి వెళుతున్న బుజ్జి పాపను ఆపి, ‘నీకు బడి అంటే భయం లేదా?’ అని అడిగాడు తాతయ్య. ‘ఊహూ.. బడికి వెళ్లడానికి భయమెందుకు? బడిలో అక్కలు, అన్నయ్యలు ఉంటారు. గురువు గారు మంచి విషయాలు, కథలూ చెబుతారు. ఆటలు ఆడిస్తారు, పాటలూ పాడిస్తారు. పద్యాలు కూడా నేర్పిస్తారు. బడికి వెళితే ఇలా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అందుకే నేను రోజూ బడికి వెళ్తాను’ అంది నవ్వుతూ బుజ్జి పాప.

‘ఇవన్నీ నీకెవరు చెప్పారు’ అని ఆశ్చర్యంగా అడిగాడు తాతయ్య. ‘మా అమ్మ రోజూ స్నానం చేయించేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు చెప్పింది. బడికి వెళ్లాలని సరదా పడేదాన్ని. మొన్నే బడిలో వేశారు. నేను రోజూ బడికి వెళుతున్నా’ అంది ముద్దుముద్దుగా కళ్లు చక్రాల్లా తిప్పుతూ. బుజ్జి పాప  మాటలన్నీ ఏడుస్తున్న ఈ అబ్బాయి కూడా విన్నాడు. అదే సమయంలో తాతయ్య.. ‘చూశావా.. నీ వయసే ఉన్న బుజ్జి పాపకి లేని భయం నీకెందుకు? నవ్వుతూ బడికి వెళ్లు. అక్కడ మంచి విషయాలు తెలుస్తాయి. కొత్త స్నేహితులు దొరుకుతారు. నీ కంటే పెద్దవాళ్లను అన్నయ్య, అక్కయ్య అని పిలిస్తే చాలా మంది నీతో జట్టు కడతారు. బడిలో ఆటలు ఆడిస్తారు. చదువు చెబుతారు. సరదాగా గడిచి పోతుంది. భయపడకుండా ఆ పాప చెయ్యి  పట్టుకొని నడువు. మీ అమ్మకి బై చెప్పు’ అని బుజ్జగించడంతో ఏడుపు ఆపేసి బడి వైపు నడిచాడు అబ్బాయి.

కొంతదూరం వెళ్లి వెనుతిరిగి చూసి వాళ్లమ్మ, తాతయ్యకు చెయ్యి ఊపి బై చెప్పాడు అబ్బాయి. అబ్బాయి తల్లి తాతయ్య దగ్గరే ఆగిపోయి ధన్యవాదాలు చెప్పబోయింది. ఆమెను ఆగమని వారించి.. ‘పిల్లలు బాల్యంలో అల్లరి చేయడం సహజం. అల్లరి చేయకుండా బుద్ధిగా ఉన్నారంటే ఏదో లోపం ఉన్నట్టే అనుకోవాలి. పిల్లలు కాకుండా పెద్దలు అల్లరి చేస్తే బాగుంటుందా? ఎప్పుడైనా పిల్లలు పేచీ పెడితే, దానికి కారణం కనుక్కుని సరిదిద్దాలి. బడిలో వేస్తామని, హాస్టల్‌లో పడేస్తామని, అక్కడ టీచర్లు కొడతారని, బూచాడు ఎత్తుకుపోతాడని భయపెట్టకూడదు. పిల్లల పసి మనసుల్లో ఆ మాటలు ముద్ర పడిపోతాయి. బడి అంటే అదేదో భూతాలు తిరిగే ప్రదేశంలా భయపడతారు. చాలామంది తల్లులు ఇంట్లో పిల్లల్ని ఇలాగే కసురుతూ, కొడుతూ, మాటలతో భయపెడుతుంటారు. అది తప్పు. ఆ పాపకి బడి మీద ప్రేమ కలిగేలా వాళ్లమ్మ చేసిన ప్రయత్నం నువ్వూ చూశావు కదా. అదే సరైన పెంపకం’ అన్నాడు తాతయ్య.

‘నా వల్ల పొరపాటు జరిగింది తాతయ్య గారూ. మా అబ్బాయిలోని  భయాలన్నీ పోగొట్టి సంతోషంగా రోజూ బడికి వెళ్లేలా చేస్తాను. మీకు  ధన్యవాదాలు’ అని కృతజ్ఞతలు చెప్పింది.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని