శిష్యుల వైరం... గురువు పరిష్కారం!

ఒక గురువు దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారిద్దరికీ ఎప్పుడూ పడేది కాదు. అందువల్ల ఏదో ఒక నెపం పెట్టుకుని పోట్లాడుకునేవారు.

Updated : 29 Aug 2023 05:38 IST

ఒక గురువు దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారిద్దరికీ ఎప్పుడూ పడేది కాదు. అందువల్ల ఏదో ఒక నెపం పెట్టుకుని పోట్లాడుకునేవారు. ఆ క్రమంలో వారు ఒకరినొకరు మించిపోవడానికి, వీలైతే ఎదుటివారిని అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తుండేవారు. ఇదంతా గురువు గమనిస్తుండేవాడు. కానీ ఏమీ అనేవాడు కాదు. దానికి కారణాలు రెండు. తన బోధనల ప్రభావం వల్ల ఎప్పటికైనా వారి ప్రవర్తనలో మార్పు వస్తుందేమోనని ఎదురు చూడడం మొదటిది. రెండో కారణం వారికి ప్రత్యేకంగా బోధించేందుకు సరైన సమయం, సందర్భం రాకపోవడం.

ఒకరోజు గురువు ఓ సంఘటన చూశాడు. అదేంటంటే.. చెట్టు మీద ఫలాలను ఓ చిలుక తినడం. వాటిని తినడానికి వచ్చిన మరో పక్షితో కొట్లాటకు దిగింది. అది బలమైనది కావడంతో చిలుకను తరిమికొట్టసాగింది. దాని బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ చిలుక గుర్రం దిగుతున్న రాజు భుజం మీద వాలి, తనను రక్షించమని కోరింది.

ఆ చిలుక అందాన్ని చూసిన రాజు, దానికి అభయం ఇచ్చాడు. భటుల్ని పిలిచి.. ‘ఈ చిలుకకు ఏ అపాయం కలగకుండా పంజరంలో బంధించండి. ఈ రోజు నుంచి ఇది నా పెంపకంలో ఉంటుంది’ అని ఆజ్ఞాపించాడు. అంతలోనే సేవకులు తెచ్చిన పాలు తాగి రాజు రాజభవనంలోకి వెళ్లిపోయాడు.

స్వేచ్ఛను కోల్పోయిన ఆ చిలుక పరిస్థితి చూసిన గురువుకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే శిష్యులను పిలిచి.. ‘మీలో మీరు గొడవకపడితే, ఇద్దరికీ నష్టం జరగవచ్చు. కాబట్టి మీ వైరాన్ని విడిచిపెట్టి కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నించండి. దానికి సంబంధించిన ఒక కథ చెబుతాను వినండి’ అంటూ చెప్పడం మొదలు పెట్టాడు.  

‘‘ఒక అడవిలో ఉండే జంతువులు వాటి వాటి పద్ధతుల్లో జీవిస్తుండేవి. ఒకసారి గడ్డి మేస్తున్న గేదె, గుర్రం మధ్య వాదన మొదలైంది. అది పోట్లాటకు దారి తీసింది. ఆ ప్రయత్నంలో గేదె దాని కొమ్ములతో పొడిచి గుర్రాన్ని గాయపరిచింది. అలిసిపోయిన గుర్రానికి, గేదెను కండబలంతో గెలవలేనని అర్థమైంది. కానీ, దానికెలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది.
దానికోసం ఒక వ్యక్తి దగ్గరకెళ్లి సహాయం కోరింది. గుర్రం మాటలు విన్న వ్యక్తి.. ‘గేదెకు పెద్ద కొమ్ములున్నాయి. పైగా అది చాలా బలంగా ఉంది. నేను దాన్ని ఎలా గెలవగలను?’ అని అనుమానం వ్యక్తం చేశాడు. ఆ మాటకు గుర్రం.. ‘ఒక లావుపాటి కర్ర పట్టుకుని నా మీద కూర్చోండి. నేను వేగంగా పరిగెత్తుతూ ఉంటాను. మీరు గేదెను ఆ దుడ్డు కర్రతో బాగా కొట్టి, అది అలిసిపోయాక తాడుతో కట్టండి’ అని సలహా ఇచ్చింది. ‘గేదెను కట్టేస్తే నాకేం ప్రయోజనం?’ అని అడిగాడతను.

ఆ మాటకు గుర్రం.. ‘గేదె పెద్దది. పాలను ఇస్తుంది. వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మీరు తాగవచ్చు. ఇంకా అమ్ముకుని డబ్బు కూడా సంపాదించవచ్చు’ అని సలహా ఇచ్చింది. గుర్రం చెప్పిన సలహా బాగుందనిపించి, అలాగే చేశాడతను. దెబ్బలకు గేదె కింద పడిపోవడంతో.. ఆ వ్యక్తి దాన్ని తాడుతో కట్టేశాడు.

ఆ పని ముగిశాక, ‘ఇక నేను వెళతాను. మేతకు వేళైంది’ అని అతడితో అందా గుర్రం. ఆ మాటలకు అతడు బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు. ‘ఎందుకలా నవ్వుతున్నావు?’ అని గుర్రం అడిగింది. ‘నీ పరుగు చూశాక నువ్వు కూడా నా ప్రయాణానికి ఉపయోగపడతావని అనిపించింది. కాబట్టి నిన్ను కూడా కట్టేస్తాను. గేదె పాలు తాగుతూ నీ మీద తిరుగుతుంటాను’ అని దాన్ని కూడా తాడుతో కట్టేశాడు.

అప్పుడు గుర్రం పశ్చాత్తాపపడి బాగా ఏడ్చింది. గొడవ పడినందుకు ఒకదాని ముఖం మరోటి చూసుకుని.. గేదె, గుర్రం సిగ్గుపడి తలలు దించుకున్నాయి’’ అని గురువు కథ ముగించాడు. శిష్యులతో.. ‘మీరిద్దరూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటుంటే మూడో వ్యక్తి వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. గుర్రం, గేదెలకు జరిగినట్లే మీరు కూడా అదే పరిణామాలను అనుభవించాల్సి వస్తుంది. ఆలోచించుకోండి’ అన్నాడు. ఆ రోజు నుంచి శిష్యులిద్దరూ పోట్లాడుకోవడం మానేసి స్నేహంగా మెలగసాగారు.

ఆదిత్య కార్తికేయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు