మనుషులంత చెట్లు.. చెట్లంత మనుషులు!

పదేళ్ల కావ్య ఒక ఆదివారం స్నేహితులతో కలిసి పెరట్లోని జామ చెట్టు కింద ఆడుకుంటోంది. దోర మగ్గిన వాటితోపాటు చిలుక కొట్టిన జామకాయలు.. చెట్టు కొమ్మల్లోంచి కనబడుతూ నోరూరించసాగాయి.

Updated : 30 Aug 2023 05:01 IST

దేళ్ల కావ్య ఒక ఆదివారం స్నేహితులతో కలిసి పెరట్లోని జామ చెట్టు కింద ఆడుకుంటోంది. దోర మగ్గిన వాటితోపాటు చిలుక కొట్టిన జామకాయలు.. చెట్టు కొమ్మల్లోంచి కనబడుతూ నోరూరించసాగాయి. వాటిని కోసుకొని తిందామంటే.. కావ్యకు చెట్టెక్కడం రాదు. ఎలాగోలా ఎక్కుదామని అనుకున్నా.. కిందపడిపోతానేమోనని భయపడింది. ఎంత ప్రయత్నించినా.. కొమ్మలేమో అందడం లేదు.. కర్రతో కొడదామంటే అంత పెద్దవి దొరకలేదు. గురి చూసి రాయి విసిరే నైపుణ్యమూ లేదు. కళ్ల ముందు నోరూరించేలా ఉన్న జామకాయలను కోసుకుని తినలేకపోతున్నందుకు తను చాలా బాధపడింది. అమ్మనో, నాన్ననో అడిగితే కానీ కాయలు దక్కేలా లేవు. లేకపోతే బాగా పండిపోయి, కింద రాలినవే గతి అనుకుంటున్న కావ్యకు.. ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది.

‘మనుషులు చెట్లంతగా, చెట్లు మనుషులంతగా మారిపోతే, ఇలా అందకపోవడం అనే ఇబ్బంది ఉండదు కదా.. హాయిగా వంగి సులభంగా కోసుకొని కడుపారా తృప్తిగా తినవచ్చు’ అనుకుంది. ఆటలు ముగిసి స్నేహితులంతా వెళ్లిపోయాక, తన కోరిక తీరేలా చేయమని కళ్లు మూసుకుని చాలాసేపు దేవుడిని ప్రార్థించింది. ‘ఆశ్చర్యం.. ఇంకేముంది? వాళ్ల ఇల్లు చిన్నగా తనకి భుజాల ఎత్తులో కనబడసాగింది. జామచెట్టేమో చిన్న గులాబీ మొక్కంత అయిపోయింది. ఆ బాలిక తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అంటే.. తన కోరిక ఫలించిందనుకొని సంబరపడింది.

పట్టరాని సంతోషంతో పొట్టలో పట్టినన్ని జామకాయలను ఆత్రంగా, ఆనందంగా కోసుకొని గబగబా తినసాగింది. కానీ, ఆమె ఆకలి తీరకముందే జామ చెట్టు ఖాళీ అయిపోయింది. కాసేపు ఆలోచించి.. తన శరీరం భారీగా పెరగడం, చెట్టు చిన్నగా మారిపోవడమే దీనికి కారణమని గ్రహించింది. ‘ఆ లెక్కన మనుషులందరి పొట్ట నిండాలంటే భూమి మీద పంట చాలదన్నమాట’ అనుకొని.. ఆ ఊహకే కావ్య భయపడిపోయింది. ఆకాశాల్ని అంటే భవనాల్లా మనుషులు ఆహారం కోసం అటూ ఇటూ తిరగసాగారు.

వారు వదులుతున్న గాలి కంటే, చెట్లు ఇచ్చే ఆక్సిజన్‌ తగ్గిపోవడంతో ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. చిన్నారికి చెమటలు పోసి నీరసం వచ్చినట్లయింది. కాసేపు నిద్రపోదామనుకుంది. కానీ, ఇల్లు ఇప్పుడు చిన్నగా, తను వెళ్లలేనంత బుజ్జిగా ఉంది. లోపలకు వెళ్లేదెలా? ఇక మంచం సంగతి చెప్పనక్కర్లేదు. తన వేలంత ఉంటుందేమో.. ఇక చేసేదేం లేక, ఇంట్లోకి వెళ్లలేక ఆరుబయటే పడుకుంది. మనుషులందరూ ఇలాగే నిద్రపోతే, అడ్డదిడ్డంగా ఒకరిపై ఒకరు కాళ్లూ చేతులూ వేసుకోవాల్సిందేననుకుని ఉసూరుమంది. చెట్లు మేడలంత ఉన్నా పడుకోవు కదా! నిలువునా నిలబడే ఉంటాయి. అందుకే తనకు వచ్చిన ఈ ఇబ్బంది వాటికి ఉండదనుకుంది.

నిద్రపోదామనుకున్న కావ్యను చీమలు కుట్టసాగాయి. నేల మీది రాళ్లు, ముళ్లు గుచ్చుకుంటున్నాయి. పక్క నుంచి ఒక పాము పాకుతూ వెళుతుండటంతో... కెవ్వుమని అరుస్తూ కళ్లు తెరిచింది. అదంతా తన కల అని, నిజం కాదనీ తెలుసుకొని కుదుటపడింది. జామచెట్టుకు ఆనుకుని కూర్చున్నప్పుడు, కళ్లు మూసుకుని ప్రార్థిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నానని తెలుసుకుంది. చాలాసేపు ఆటలు ఆడి అలిసిపోవడంతో తెలియకుండానే నిద్రపోయింది. తనది కల మాత్రమేనని తెలిసి ఊపిరి పీల్చుకుంది. చుట్టూ చూస్తే.. పచ్చని చెట్లు చిరుగాలులకు మెల్లగా ఊగుతూ కనిపించాయి. చకచకా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లి, ప్రాణవాయువునిచ్చే చెట్లకు కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మను గారంగా చుట్టుకుంది కావ్య.

గుడిపూడి రాధికారాణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు