సరైన ఎంపిక..!

ఒకరోజు పార్వతీపురం జమీందారు దగ్గరకు దివాను వచ్చి.. ‘అయ్యా.. ఈసారి పంటల దిగుబడులు బాగా తగ్గాయి.

Updated : 01 Sep 2023 04:02 IST

ఒకరోజు పార్వతీపురం జమీందారు దగ్గరకు దివాను వచ్చి.. ‘అయ్యా.. ఈసారి పంటల దిగుబడులు బాగా తగ్గాయి. దాంతో మన ఖజానాకు రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోయింది’ అన్నాడు. ‘పంట దిగుబడి తగ్గడానికి కారణం ఏంటి?’ అని ఆరా తీసినట్టు అడిగాడు జమీందారు. ‘పంటలకు తెగుళ్లు సోకాయి. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం కోసం మన ప్రాంతంలో రసాయన మందులు వాడొద్దని మీరు ఆదేశించారు. దాంతో పంటల దిగుబడి తగ్గింది’ అంటూ అసలు విషయం చెప్పాడు దివాను.

‘రసాయనాల వాడకం ప్రజారోగ్యానికి ప్రమాదకరం. పంటల్లో తెగుళ్ల నివారణకు పక్షులు కూడా సహకరిస్తాయి. రసాయనాలు వాడకుండా మనం ఆ దిశగా ఆలోచిద్దాం. పక్షుల సంరక్షణ కోసం ప్రజలను చైతన్యపరిస్తే బాగుంటుంది’ అని సూచించాడు జమీందారు. ‘పక్షులతో తెగుళ్ల నివారణ సాధ్యమేనంటారా?’ అని ఆశ్చర్యపోతూ అడిగాడు దివాను. ‘అవును దివాన్‌ జీ.. పక్షులు చిన్న చిన్న పురుగులు తిని కడుపు నింపుకొంటాయన్న విషయం మీకు తెలిసిందే.. ఆ చిన్న చిన్న పురుగులే పంట మొక్కలకు చేరి తెగుళ్లకు కారణమవుతుంటాయి. పక్షుల సహకారంతో ఆ పురుగులు తగ్గించగలిగితే, తెగుళ్ల బాధ ఉండదు. దిగుబడులపై ఎటువంటి ప్రభావమూ ఉండదు’ అని వివరించాడు జమీందారు.

‘అయితే.. ఒక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. పక్షుల సంఖ్య పెరిగేటట్లు చర్యలు తీసుకుందాం’ అని తన ఆలోచనను చెప్పాడు దివాను. ‘మీ నిర్ణయం సరైనదే. పక్షుల విహారం.. పంటకు సౌభాగ్యం’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు జమీందారు. పక్షుల సంరక్షణాధికారిని నియమించే బాధ్యత కూడా ఆయనకే అప్పగించాడు. ఆ మరుసటి రోజే పక్షుల సంరక్షణాధికారి నియామకానికి సంబంధించి దండోరా వేయించాడు దివాను.

తర్వాతి రోజు ముగ్గురు వ్యక్తులు వచ్చి జమీందారును కలిసి, ఆ ఉద్యోగాన్ని తమకు ఇవ్వమని అడిగారు. వారిని దివానుకు అప్పగించి, ఒకరిని ఎంపిక చేయమని కోరాడు. ‘మీ సమక్షంలో ఎంపిక చేయాలనుకుంటున్నాను’ అని సమాధానమిచ్చాడు దివాను. సరేనన్న జమీందారు.. ఒక్కొక్కరిని రమ్మనమని చెప్పి దివానును వెంటబెట్టుకొని తన గదికి వెళ్లిపోయాడు. కాసేపయ్యాక మొదటి వ్యక్తి లోపలికి వచ్చాడు. దివాను అతని వైపు పరిశీలనగా చూసి.. ‘ఒక చెట్టుపైన పది కాకులు ఉన్నాయి. ఓ వేటగాడు తుపాకీతో అందులోని కాకిని కాల్చాడు. అక్కడ ఇంకా ఎన్ని కాకులు ఉంటాయి?’ అని అడిగాడు. ఆ ప్రశ్న జమీందారుకు నవ్వు తెప్పించింది. ‘తొమ్మిది’ అని సమాధానమిచ్చాడా వ్యక్తి. ఇక అతడిని వెళ్లమన్నారు.

ఆ తర్వాత రెండో వ్యక్తిని పిలిచి, అదే ప్రశ్న వేశాడు దివాను. ‘ఏమీ ఉండవు’ అన్నాడతను. అతడి వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు జమీందారు. మూడో వ్యక్తినీ అదే ప్రశ్న అడిగాడు. అతడు తడుముకోకుండా.. ‘పది కన్నా ఎక్కువ కాకులు ఉంటాయి’ అని సమాధానం ఇచ్చాడు. అతడు బయటకు వెళ్లగానే.. జమీందారు నవ్వుతూ.. ‘దివాను గారూ.. ఆలోచన శక్తి కలిగిన రెండో వ్యక్తినే కదా మీరు ఎంపిక చేయబోయేది..!!’ అని అడిగాడు జమీందారు.

‘కాదు.. మూడో వ్యక్తిని..’ అని బదులిచ్చాడు దివాను. ‘ఎలా?’ అని అయోమయంగా చూశాడు జమీందారు. ‘మూడో వ్యక్తికి కాకి సహజ గుణం తెలుసు. ఒక కాకి చనిపోతే, మిగిలిన కాకులు సానుభూతితో దాని చుట్టూ గుంపుగా చేరతాయి. అందుకే అక్కడ పది కంటే ఎక్కువ కాకులు ఉంటాయని చెప్పాడు. పక్షుల సహజ గుణాలు తెలిసినవారే వాటిని బాగా సంరక్షించగలరు. అన్ని విధాలుగా వాటిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోగలరు’ అని వివరించాడు దివాను. నిజమేనంటూ అంగీకరించాడు జమీందారు.

అప్పటి నుంచి మూడో వ్యక్తి ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరుస్తూ.. పక్షుల సంరక్షణకు బాటలు వేశాడు జమీందారు. పంటలకు సహజసిద్ధ ఎరువులను వాడటంతోపాటు పక్షుల సాయంతో క్రమంగా దిగుబడులు పెరిగాయి. రైతుల ఆదాయం కూడా పెరగడంతో వ్యవసాయం పండగలా మారింది.  

 బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు