కోతి తిక్క కుదిరింది!

ధారకొండ అడవిలో అనేక జంతువులు నివాసం ఉంటున్నాయి. వాటిలో కోతి కూడా ఒకటి. దాని పేరు తిమ్మన్న. అది మిగతా కోతుల కంటే చాలా అల్లరిది. చిన్న చిన్న జంతువులను ఏడిపిస్తుండేది. ఒకరోజు జింక పిల్లలన్నీ ఆడుకుంటుండగా, హఠాత్తుగా వచ్చిన తిమ్మన్న.. ‘అమ్మ బాబోయ్‌ పులి!’ అంది. దాంతో జింక పిల్లలన్నీ తలో దిక్కుకి పరుగులు తీశాయి.

Updated : 02 Sep 2023 05:04 IST

ధారకొండ అడవిలో అనేక జంతువులు నివాసం ఉంటున్నాయి. వాటిలో కోతి కూడా ఒకటి. దాని పేరు తిమ్మన్న. అది మిగతా కోతుల కంటే చాలా అల్లరిది. చిన్న చిన్న జంతువులను ఏడిపిస్తుండేది. ఒకరోజు జింక పిల్లలన్నీ ఆడుకుంటుండగా, హఠాత్తుగా వచ్చిన తిమ్మన్న.. ‘అమ్మ బాబోయ్‌ పులి!’ అంది. దాంతో జింక పిల్లలన్నీ తలో దిక్కుకి పరుగులు తీశాయి. ఆ క్రమంలో కొన్ని పక్కనున్న గోతిలో పడిపోయాయి. పెద్ద జింక వచ్చి ‘ఏయ్‌ తిమ్మన్నా.. పిల్లలు ఆడుకుంటుంటే అలా భయపెడతావా?’ అని కోప్పడింది. దానికి తిమ్మన్న.. ‘భలేదానివి.. ఆపద సమయాల్లో ఎలా స్పందించాలో వాటికి తెలియకపోతే ఎలా? ఒకవేళ నిజంగా పులి వస్తే ఏం చేస్తాయి? అందుకే వాటికి ఎలా తప్పించుకోవాలో నేర్పుతున్నా’ అని గడుసుగా జవాబిచ్చింది. కోతి కావాలనే చేసిందని తెలిసినా.. ఏమీ అనలేక వెళ్లిపోయిందా జింక.

ఇంకో రోజు.. దారిలో వెళ్తున్న ఏనుగు పిల్లతో ‘ఓయ్‌ పొట్టి గున్నా.. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? మీవాళ్లంతా ఈ అడవి వదిలి వెళ్లిపోతున్నారు’ అంది. దాంతో అది భయపడిపోయి.. పరుగు పరుగున ఇంటికి చేరుకుంది. ఏనుగులన్నీ అక్కడే ఉండటంతో.. కావాలనే తిమ్మన్న తనను ఆట పట్టించిందని గ్రహించింది. పెద్ద ఏనుగుకు విషయం తెలిసి.. ఆ కోతిని పిలిచి అడిగింది. ‘ఏనుగు మామా.. గున్న అలా నడుచుకుంటూ నక్క, తోడేలు ఉన్న వైపునకు వెళ్తుంది. ఆ విషయం చెబితే అది వినదని నాకు తెలుసు. అందుకే మీరంతా అడవి వదిలి వెళ్లిపోతున్నారని అబద్ధం చెప్పా’ అని సమర్థించుకుంది. సరేనంటూ ఏనుగు మౌనంగా ఉండిపోయింది. దాంతో ‘ఎంత పెద్ద జంతువైనా నా ముందు నోరు మూసుకోవాల్సిందే..’ అని లోలోపలే గర్వపడింది.
ఒకసారి చిన్న జంతువులన్నీ నీళ్ల కోసం సరస్సు దగ్గరకి వెళ్లాయి. అప్పుడే అక్కడికి వచ్చిన తిమ్మన్న.. ‘మిత్రులారా.. నేను రాకపోయి ఉంటే మీరంతా పెద్ద మొసలికి ఆహారమయ్యేవారు. రాత్రే దాన్ని చూశా’ అంది. ఆ మాటతో జంతువులన్నీ ఒక అడుగు వెనక్కి వేశాయి. ‘ఎప్పుడూ లేనిది మొసలి రావడం ఏంటీ?’ అని అవన్నీ అనుకుంటుండగా.. అప్పుడే అక్కడికి వచ్చిన కుందేలు.. ‘ఆ మొసలి ఇందాకే అలా వెళ్లిపోయింది. మరేం భయం లేదు.. మీరు దాహం తీర్చుకోండి’ అంటూ అది కూడా సరస్సులోకి దిగింది. సరేనని అవన్నీ నీళ్లు తాగేశాయి. కుందేలు బయటకు వచ్చాక.. ‘నువ్వు మొసలిని ఎప్పుడు చూశావు?’ అని తిమ్మన్నను అడిగింది. ‘నువ్వు చూసిన తర్వాతే..’ అని తెలివిగా బదులిచ్చిందది. ‘నేనసలు మొసలినే చూడలేదు.. నువ్వు అబద్ధం చెబుతున్నావు’ అంది తిమ్మన్న. ‘అయితే.. నువ్వు చెప్పింది కూడా అబద్ధమని జంతువులకి చెబుతా..!’ అని బెదిరించింది కుందేలు. ‘వద్దు వద్దు.. నేనేదో సరదాకి అన్నాను’ అంటూ అక్కడి నుంచి జారుకుంది తిమ్మన్న.

కోతి అల్లరి పనులు మృగరాజు వరకూ వెళ్లాయి. అది సరైన సమయం కోసం ఎదురుచూడసాగింది. ఒకరోజు జంతువులన్నీ పండుగ చేసుకుంటున్నాయి. తిమ్మన్న మీద కోపం కొద్దీ దాన్ని పిలవలేదు. అన్నీ సరదాగా గడుపుతున్న సమయంలో అక్కడికి వచ్చింది తిమ్మన్న. ‘మీకు మీరు పండుగలు చేసుకుంటే సరిపోతుందా.. మన మృగరాజుని పిలవక్కర్లేదా? అసలే కోపంతో ఉంది. కాసేపట్లో ఇక్కడకు రాబోతుంది. ఎవరు బలి అవుతారో చూడాలి..’ అంది. పండుగ గురించి మృగరాజుకి చెప్పిన విషయం తెలియక.. తిమ్మన్న వాటిని భయపెట్టాలని చూస్తుందని జంతువులన్నీ అనుకున్నాయి.

ఇంతలో ‘ఎప్పుడో ఎందుకు.. ఇప్పుడు నీ వెనకే ఉంది మృగరాజు.. ఒకసారి చూడు..’ అంది కుందేలు. వెనక్కి తిరగ్గానే.. కనిపించిన సింహాన్ని చూసి కోతి గతుక్కుమంది. ‘తిమ్మన్న గురించి ఇదివరకే చాలాసార్లు విన్నాను. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను. కోతి గుండె తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసింది. పండుగ వంటల్లో దీన్ని కూడా చేర్చండి. కానీ, గుండె మాత్రం నాకే కావాలి’ అంది మృగరాజు. ఆ మాటలతో తిమ్మన్నకు పైప్రాణాలు పైనే పోయాయి. మొన్న సరస్సు దగ్గర నీ అల్లరిని స్వయంగా చూశాను. ఇన్నాళ్లూ జంతువులు చెబితే ఏమో అనుకున్నాను కానీ, నీకు మరణ శిక్షే సరైంది’ అంది సింహం. ‘ఈ ఒక్కసారికి మన్నించండి మృగరాజా.. ఇక ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టను’ అని కాళ్ల మీద పడింది. ‘సరే.. ఈసారికి వదిలేస్తున్నా.. పండుగ ముగిసిన తర్వాత, ఇక్కడంతా నువ్వే శుభ్రం చేయాలి. మరోసారి నీ అల్లరి చూశానో.. చెప్పాను కదా.. గుండె కావాలని..’ అంటూ కోపం నటించింది సింహం. సరేనంటూ తలదించుకుంది తిమ్మన్న.

- కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని