ఉంగరమా.. పుస్తకమా?

సురేష్‌, రంగ తొమ్మిదో తరగతి విద్యార్థులు. ఒకే తరగతితోపాటు పక్కపక్క ఇళ్లే కావడంతో మంచి మిత్రులయ్యారు. రోజూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ బడికి వెళ్లి వచ్చేవారు.

Updated : 03 Sep 2023 06:47 IST

సురేష్‌, రంగ తొమ్మిదో తరగతి విద్యార్థులు. ఒకే తరగతితోపాటు పక్కపక్క ఇళ్లే కావడంతో మంచి మిత్రులయ్యారు. రోజూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ బడికి వెళ్లి వచ్చేవారు. సురేష్‌ వాళ్ల నాన్న వ్యాపారి. రంగ వాళ్ల నాన్న సమీపంలోని పట్టణంలో చిన్న ఉద్యోగం చేసేవారు. ఆ రోజు తన పుట్టినరోజు కావడంతో తలస్నానం చేసి, కొత్త దుస్తులు వేసుకున్నాడు సురేష్‌. మిఠాయిల సంచితో మేడ మీది నుంచి కిందకొచ్చి స్కూల్‌ బ్యాగ్‌ తీసుకొని గుమ్మం దాటాడు.

అప్పుడే వచ్చిన రంగ.. ఆనందంగా మిత్రుడి చేతులు పట్టుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ‘కొత్త దుస్తులు చాలా బాగున్నాయి..’ అన్నాడు. ఇంతలో సురేష్‌ వాళ్లమ్మ, రంగని లోపలికి పిలిచి పాయసం పెట్టి.. సాయంత్రం స్నేహితులను తీసుకుని రమ్మంది. ఇద్దరూ బడికి బయలుదేరుతుంటే.. ‘ఉంగరం జాగ్రత్త’ అందామె. ‘ఉంగరమా.. ఏదీ?’ అని అడిగిన రంగకు తన వేలికున్న, తండ్రి కానుకగా ఇచ్చిన బంగారు ఉంగరాన్ని చూపించాడు సురేష్‌. కుడి చేతి వేలికి ఉన్న మిలమిల మెరిసే వజ్రపు ఉంగరాన్ని చూడగానే రంగ కళ్లు తళుక్కుమన్నాయి. ‘భలే ఉంది..’ అన్నాడు మెచ్చుకోలుగా.

ఇక బడిలో అయితే చెప్పనక్కర్లేదు.. అన్ని తరగతుల పిల్లలూ ఆ ఉంగరాన్ని చూసి మెచ్చుకున్నారు. సురేష్‌ ముఖం ఆనందంతో మతాబులా వెలిగిపోయింది. పాఠాలు వింటూ కూడా మధ్యమధ్యలో ఆ ఉంగరాన్ని మురిపెంగా, అపురూపంగా చూసుకోసాగాడు. మొదట మనస్ఫూర్తిగా ఆనందించినప్పటికీ ఆ వైభవమంతా చూసిన రంగకు.. పుట్టినరోజు కానుకగా నాన్న తనకూ ఉంగరం ఇస్తే బాగుండేదనుకున్నాడు. దాంతో ముందు నెలలో అమ్మానాన్న తన పుట్టినరోజుకు ఇచ్చిన బంతి, పుస్తకం విలువలేనివిగా తోచాయి. వచ్చే పుట్టినరోజుకు ఉంగరం చేయించాల్సిందేనని ఆ రాత్రికే అడుగుదామనుకున్నాడు. కానీ, చిరుద్యోగి అయిన తన తండ్రి అంత ఖరీదైన కానుక ఇవ్వలేడేమోనని సందేహించాడు. అయినా, అడిగి చూడటంలో తప్పు లేదనుకున్నాడు.

చివరి గంట ఆటల సమయం కావడంతో రంగ పిలిచినా, సురేష్‌ మైదానానికి రానన్నాడు. కాసేపు ఉంగరం విషయం మరిచిపోయి, స్నేహితులతో కలిసి చెమటలు పట్టేలా ఆడాడు రంగ. బడి వదిలాక రంగ, సురేష్‌ ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రం మిత్రులంతా సురేష్‌ ఇంటికి వెళ్లినప్పుడు, తన పుట్టినరోజు కానుకగా తండ్రి ఇచ్చిన పుస్తకంలోని మంచి కథలను చెప్పాడు రంగ. అక్కడున్న వారంతా తనను ఎంతో అభినందించారు. ఆ ఆనందంలో ఆ రాత్రి నాన్నను ఉంగరం అడుగుదామనుకున్న విషయం మర్చిపోయాడు. మరుసటి రోజు బడికి వెళ్తుండగా.. సురేష్‌ వేలికి ఉంగరం కనిపించకపోవడంతో ఆశ్చర్యంగా అడిగాడు రంగ.
‘నిన్నంతా ఆ ఉంగరం పెట్టుకోవడం వల్ల పాఠాలు సరిగా వినలేకపోయాను. హోంవర్క్‌ కూడా సరిగ్గా చేయలేకపోయా. మీతో కలిసి హాయిగా ఆటలు ఆడుకుందామంటే ఉంగరానికి మట్టి, దుమ్ము అంటుతాయని ఆగిపోయా. పొరపాటున జారిపడిపోతే.. అమ్మానాన్న తిడతారని భయపడ్డా.. ఎందుకొచ్చిన ఉంగరం? తీసేసిన తర్వాత ప్రశాంతంగా ఉంది. శ్రద్ధగా పాఠాలు వినొచ్చు. హాయిగా మీతో కలిసి ఆడుకోవచ్చు’ అని బదులిచ్చాడు సురేష్‌. మిత్రుడి మాటలు విన్న రంగ మనసు తేలికపడింది. పైగా ముందు రోజే పుస్తకం విలువ కూడా తెలిసింది. సరదాగా చేతులు కలిపి నడుస్తూ, కబుర్లు చెప్పుకొంటూ బడి దిశగా సాగిపోయారిద్దరూ.

గుడిపూడి రాధికారాణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని