ప్రతిభకు గుర్తింపు!

హిమగిరి రాజ్యాన్ని చిత్రకేతు అనే రాజు పాలించేవాడు. అతని మంత్రి ధర్మనందనుడు. రాజుకు చిత్రాలన్నా, చిత్రకారులన్నా చాలా అభిమానం. అద్భుతంగా బొమ్మలు గీసిన వారికి బహుమతులు ఇచ్చేవాడు.

Updated : 08 Sep 2023 05:23 IST

హిమగిరి రాజ్యాన్ని చిత్రకేతు అనే రాజు పాలించేవాడు. అతని మంత్రి ధర్మనందనుడు. రాజుకు చిత్రాలన్నా, చిత్రకారులన్నా చాలా అభిమానం. అద్భుతంగా బొమ్మలు గీసిన వారికి బహుమతులు ఇచ్చేవాడు. ఆ రాజ్యానికి శివారునున్న పల్లెలో సుచేతనుడు అనే చిత్రకారుడు ఉన్నాడు. చాలా పేదవాడు. ప్రతిభావంతుడే అయినా పేదరికం వలన అతనికి సరైన గుర్తింపు రాలేదు. పల్లెకు పక్కనే ఉన్న అడవిలో సహజంగా దొరికే రంగులు తెచ్చుకుని, మంచి మంచి చిత్రాలు గీసేవాడు. అయినా, కనీసం ఊరి వాళ్లు కూడా అతడిలోని కళను గుర్తించేవారు కాదు. పూట గడవడం కష్టం కావడంతో.. ‘ఎందుకయ్యా కూడు పెట్టని ఈ కళపై అభిమానం.. నా మాట విని ఏదైనా పని చూసుకో. కనీసం తిండి గింజలైనా వస్తాయి’ అని భార్య అంటుండేది. ఆ మాటలకు అతను నవ్వి ఊరుకునేవాడు. ఏదో ఒకరోజు తనలోని కళ గుర్తింపు తెస్తుందని అతడు నమ్మేవాడు.

ఒకరోజు రాజధాని నుంచి సత్యం అనే యువకుడు ఆ పల్లెకు వచ్చాడు. తానొక ఆయుర్వేద వైద్యుడినని, ఈ పల్లెని ఆనుకుని ఉన్న అడవిలో అనేక వనమూలికలు ఉన్నాయని తెలిసి వచ్చానని.. తనని తాను పరిచయం చేసుకుంటూ సుచేతనుడి పక్క ఇంటిలోనే అద్దెకు దిగాడు. వచ్చిన మొదటి రోజే అతడి స్థితిగతులతోపాటు ప్రతిభనూ కనిపెట్టాడు సత్యం. తనకు అవసరమైన మూలికలు తెచ్చుకున్న తర్వాత.. ‘అయ్యా.. ఇంత మంచి కళ తెలిసిన మీరు ఇక్కడే ఉండిపోయారెందుకు? మన మహారాజు మంచి కళాపోషకుడనే విషయం మీకు తెలియదా?’ అని అడిగాడాయన. ‘తెలిసినా ఏం లాభం? నా పరిస్థితి చూసి రాజాస్థానంలోనికి రానిస్తారా! ఈ పల్లె ప్రజలే నన్ను గుర్తించడం లేదు. ఇక నగరంలో పట్టించుకుంటారనుకోవడం నా అత్యాశే!’ అన్నాడు సుచేతనుడు. ‘ప్రతికూల ఆలోచనలు మంచివి కాదు. కళని గుర్తించాలంటే దానికి తగిన అర్హత ఉండాలి. అంతేగానీ ఇక్కడెవరూ గుర్తించడం లేదని నిరుత్సాహపడకూడదు. మీరు నాతో వస్తే చేతనైన సహాయం చేస్తా’ అన్నాడు సత్యం.

సరేనంటూ బొమ్మలు గీసేందుకు అవసరమైన సామగ్రిని తీసుకొని అతడి వెంట రాజధానికి వెళ్లాడు సుచేతనుడు. ఆరోజుకు తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు సత్యం. తన పరిచయాలతో మరుసటి రోజు ఉదయమే అతడిని కోటకు తీసుకుని వెళ్లాడు. ‘రాజుని జాగ్రత్తగా చూడండి. ఆయన చిత్రపటం గీయడానికి కావాల్సిన విధంగా గమనించండి’ అని దూరం నుంచే మహారాజుని చూపిస్తూ సుచేతనుడితో చెప్పాడు సత్యం. ‘ఒక్కసారి చూస్తే చాలు.. ఎంతటి క్లిష్టమైన దాన్నైనా ఇట్టే గీసేయగలను’ అని బదులిచ్చాడు సుచేతనుడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లగానే మహారాజు చిత్రాన్ని అద్భుతంగా గీశాడు. సహజమైన రంగులు కావడంతో ఆ చిత్రం మరింత అందంగా వచ్చింది. దానికి పటం కట్టించాడు సత్యం. ఆ మరుసటి రోజే సుచేతనుడితో మంచి దుస్తులు వేయించి, ఆ పటంతో ఇద్దరూ కలిసి రాజ మందిరానికి వెళ్లారు. ‘మహారాజా..! ఈ చిత్రకారుడు మీకు బహుమతిగా ఒక చక్కటి చిత్రం తీసుకొచ్చాడు. దానిని స్వీకరించి మంచి గుర్తింపునివ్వండి’ అని కోరాడు సత్యం.

ఆ చిత్రం చూసిన రాజుతోపాటు మంత్రి, ఆస్థాన చిత్రకారులూ ఆశ్చర్యపోయారు. ‘ఈ చిత్రకారుడెవరో మన ప్రాంతానికి చెందిన వ్యక్తి కానట్టుంది’ అని రాజుతో అన్నాడు మంత్రి. ‘తాను ఈ ప్రాంతం వాడినే అని చెప్పబోతున్న సుచేతనుడిని అడ్డుకొని, ‘అవును మహారాజా.. ఈయనది పశ్చిమ దేశం. మిమ్మల్ని ఒక్కసారి చూసి, ఈ చిత్రం గీశారు’ జవాబిచ్చాడు సత్యం. ‘అవును మాకు అలాగే అనిపించింది’ అంటూ బోలెడు బంగారు నాణేలు ఇచ్చి పంపించాడు రాజు. ‘నా అసలు వివరాలు చెప్పకుండా, అలా చేయడం మంచిది కాదనిపించింది’ అని సత్యంతో అన్నాడు సుచేతనుడు. ‘దూరపు కొండలు నునుపు అంటుంటారు. మీరు ఈ ప్రాంతపు వారే, పైగా పల్లెటూరి నుంచి వచ్చిన పేద వ్యక్తి అని తెలిస్తే మీకు ఆదరణ లభించదు’ అన్నాడు సత్యం. సరేనంటూ మరుసటి రోజే నాణేలతో ఊరికి చేరిన సుచేతనుడిని చూసి అతడి భార్య పొంగిపోయింది. కానీ, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఒకేసారి అంత డబ్బు ఎలా వచ్చిందోనని పల్లెలోని వారందరూ గుసగుసలాడసాగారు.

ఆ విషయం కాస్త రాజ భటులకు చేరింది. మహారాజు సత్కరించిన చిత్రకారుడిని చంపి, ఆ డబ్బు అపహరించాడని అనుకొని సుచేతనుడిని కారాగారంలో పెట్టారా భటులు. విషయం తెలిసి సత్యం చాలా బాధ పడ్డాడు. మరుసటి రోజే మంత్రిని కలిసి విషయం మొత్తం చెప్పాడు. వెంటనే మంత్రికో ఆలోచన వచ్చింది. పశ్చిమ దేశ చిత్రకారుడి మాదిరిగా రాజు చిత్రాన్ని గీసిన వారికి తగిన బహుమతి ఇవ్వనున్నట్లు పోటీ పెట్టాడు. తన అధికారంతో సుచేతనుడు పోటీలో పాల్గొనేలా చేశాడు మంత్రి. చాలా మంది ప్రయత్నించినా రాజు గారి చిత్రం అలా గీయలేకపోయారు. కానీ, సుచేతనుడు మాత్రం అచ్చుగుద్దినట్లు గీసి మెప్పించాడు. అది చూసిన రాజు.. పేద వ్యక్తి అంత బాగా గీయగలడా అని అనుమానం వ్యక్తం చేశాడు. మంత్రి అసలు విషయాన్ని వివరించడంతో ‘అంటే.. మన రాజ్యంలోనూ మంచి చిత్రకారులు ఉన్నారన్నమాట. వేషం చూసి సత్కరిస్తున్న మనలోనే మార్పు రావాలి. ఇక నుంచి ఎవరైనా తమ ప్రతిభను నిరభ్యంతరంగా సభ దృష్టికి తీసుకురావచ్చు’ అంటూ మరోసారి చిత్రం గీసిన సుచేతనుడికి మరికొన్ని బంగారు నాణేలు ఇచ్చి సత్కరించాడు రాజు.

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు