చిత్తశుద్ధితో పనిచేస్తేనే విజయం!

వసంతుడు, వినయుడు.. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు. సమీప పట్టణంలోని గురుకులంలో చదువుకున్నారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఇద్దరూ ఊరికి తిరిగొచ్చారు.

Updated : 12 Sep 2023 01:19 IST

సంతుడు, వినయుడు.. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు. సమీప పట్టణంలోని గురుకులంలో చదువుకున్నారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఇద్దరూ ఊరికి తిరిగొచ్చారు. తరతరాల నుంచి వారికున్న భూములను వసంతుడికి అప్పజెప్పాడు తండ్రి. దాంతో వసంతుడు ఉత్సాహంగా వ్యవసాయం చేసుకోసాగాడు. వినయుడికి గ్రామంలో ఆస్తులేమీ లేకపోవడంతో, రాజధానికి వెళ్లి ఏదైనా బతుకుదెరువు చూసుకోమన్నాడు తండ్రి. సరేనంటూ వినయుడు బయలుదేరి రాజధానికి చేరుకున్నాడు. తెలిసిన వారి ద్వారా మంత్రిని కలిశాడు. తన తెలివితేటలతో ఆయన్ను మెప్పించి, కోటలో కొలువు సంపాదించాడు. ఆ తర్వాత తల్లిదండ్రులనూ రాజధానికి తీసుకెళ్లాడు.

అలా కొంతకాలం గడిచింది. ఏదైనా పని మీద రాజధానికి వెళ్లి, వినయుడిని కలిసిన గ్రామస్థులు.. తిరిగొచ్చాక, అతడి గురించి గొప్పగా చెప్పసాగారు. ఆ మాటలు విని వసంతుడికి ఒక పక్క ఆనందం, మరోవైపు తాను తప్పు నిర్ణయం తీసుకున్నానేమోనని అనిపించేది. పల్లెలోనే ఉండిపోయి, భవిష్యత్తును పాడు చేసుకున్నానని బాధపడుతుండేవాడు. అతివృష్టి, అనావృష్టులతో నష్టపోతూ.. ఏటా పెరుగుతున్న పన్నులు కట్టలేక సతమతమవుతుండేవాడు. తాను కూడా రాజధానికి వెళ్లి, ఏదో ఒక ఉద్యోగం వెతుక్కొని హాయిగా గడిపేయాలనే ఆలోచనతో రోజులు గడపసాగాడు.

ఒకసారి వసంతుడికి అనుకోకుండా రాజధానిలో పని పడింది. వెంటనే బయలుదేరి వెళ్లాడు. అక్కడ పని ముగించుకొని, బాల్యమిత్రుడైన వినయుడి ఇంటికి వెళ్లాడు. వసంతుడిని సాదరంగా ఆహ్వానించిన అతడు, అతిథి మర్యాదలు చేశాడు. రాత్రి భోజనాలయ్యాక మిత్రులిద్దరూ కబుర్లలో మునిగిపోయారు. పాత సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు.

ఇంతలో వినయుడు.. ‘‘ఏదేమైనా నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావురా. నేను ఉన్న ఊరు వదిలిపెట్టి, ఈ జనారణ్యంలో పరుగు పందెంలాంటి జీవితం గడుపుతున్నాను. ఎంత జీతం వచ్చినా ఇక్కడ ఖర్చులకే చాలడం లేదు. ప్రతి ఒక్కటీ కొనాల్సిందే. ధరలేమో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఎంత పొదుపుగా జీవితాన్ని గడుపుతున్నా, ఎంతో కొంత అప్పు చేయాల్సి వస్తుంది. అదీగాక రాజకొలువులో ఉద్యోగం అంటే మాటలు కాదు.. రాజుకి అనుగ్రహం వచ్చినా, ఆగ్రహం వచ్చినా పట్టలేం. ‘దినదినగండం నూరేళ్ల ఆయుష్షు’లా ఉంది నా పరిస్థితి. సొంతూరిలో కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ, నువ్వింత తిని పదిమందికీ పెట్టగలగుతున్నావు’’ అంటూ తన అసంతృప్తిని వెలిబుచ్చాడు. ‘అదేంటి? నేను అనుకున్నది వేరు. వినయుడు చెబుతున్నది వేరు. వ్యవసాయం చేయడంలోనే కష్టం ఉందనుకున్నాను. ఉద్యోగంలోనూ ఇబ్బందులు ఉన్నాయన్నమాట’ అని మనసులోనే అనుకున్నాడు వసంతుడు. ఇంతలో ‘ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు?’ అని వినయుడు అడగడంతో.. ‘మరేం లేదు మిత్రమా.. నువ్వేదో సుఖంగా ఉన్నావని అనుకున్నాను. నేను ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయంలో సరైన దిగుబడులు లేక బాధ పడుతున్నాను’ అంటూ తన మనసులోని బాధను బయటపెట్టాడు వసంతుడు.

మిత్రులిద్దరి సంభాషణను పక్క గదిలోనే ఉన్న వినయుడి తండ్రి విని వారి దగ్గరికెళ్లాడు. ‘‘అనుకోకుండా మీ ఇద్దరి మాటలు విన్నాను. ఏమీ అనుకోకండి. విన్నాక నాకు తోచిన హితవు చెప్పకుండా ఉండలేక పోతున్నాను. ప్రతి వృత్తిలోనూ కష్టసుఖాలుంటాయి. అది తెలియక ఎవరికి వారు తాము మాత్రమే కష్టపడుతున్నామని, ఎదుటి వాళ్లు సుఖంగా ఉన్నారని భ్రమపడుతుంటారు. ‘దూరపు కొండలు నునుపు’, ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్లు ఎవరి బాధలు వారికుంటాయి. పదిమందికింత పెట్టగలిగే వృత్తి వ్యవసాయం. అందులో ఇబ్బందులున్నాయని అందరూ మానేస్తే లోకమంతా తిండి లేక అల్లాడుతుంది. అలానే రాజోద్యోగం పరిపాలనకు సంబంధించింది. పరిపాలన అనేది జాతి అభివృద్ధికి తోడ్పడుతుంది. అందుకే, ప్రతి వృత్తీ గొప్పదే.. సాధకబాధకాలను అధిగమిస్తూ ముందడుగు వేయాలే తప్ప దిగులు పడకూడదు. మన పనిని ప్రయత్న లోపం లేకుండా చిత్తశుద్ధితో చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడు విజయాలు వాటంతటవే వస్తాయి’’ అంటూ ఆయన హితవు చెప్పాడు.

ఆ మాటలు.. ఇద్దరి మిత్రుల్లో మార్పు తీసుకురావడంతోపాటు ధైర్యాన్నీ నింపాయి. మరుసటి రోజు ఉదయమే ఇల్లు చేరిన వసంతుడు, మరింత ఉత్సాహంతో వ్యవసాయం చేస్తూ, పెద్ద రైతుగా ఎదిగాడు. వినయుడూ అంకితభావంతో పని చేసి, రాజుగారి మన్ననలు పొంది ఉన్నత పదవులు చేపట్టాడు.  

గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు