సోమరిపోతు నక్క.. తెలివైన కోతి!

అనగనగా ఒక అడవి. అందులో ఒక కోతి ఉండేది. కష్టాల్లో ఉన్న జంతువులకు చేతనైన సాయం చేసేది. ఏదైనా ఆపదొస్తే ఉపాయంతో తప్పించుకునేది.

Updated : 13 Sep 2023 00:49 IST

నగనగా ఒక అడవి. అందులో ఒక కోతి ఉండేది. కష్టాల్లో ఉన్న జంతువులకు చేతనైన సాయం చేసేది. ఏదైనా ఆపదొస్తే ఉపాయంతో తప్పించుకునేది. ఒకసారి పక్క అడవిలో ఉన్న తన బంధువు ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా, దారిలో దాని కాలికి ముల్లు గుచ్చుకుంది. దాంతో అది నడవలేకపోయింది. కుంటుతూ కొంచెం దూరం నడిచేసరికి ఒక చెరువు వచ్చింది. ఈలోగా చీకటి పడటంతో ఆ చెరువు పక్కనే ఉన్న చింతచెట్టు మీదే ఆ రాత్రికి నిద్రపోయింది. ఉదయం మెలకువ రాగానే నక్క ఒకటి బద్ధకంగా నడుస్తూ కనిపించింది. దాని చేతిలో ఒక గుమ్మడి చిప్ప కూడా ఉంది.

ఆ నక్క మొదట ఎలుగుబంటి ఇంటి తలుపు కొడుతూ.. ‘ఎలుగు మామా.. ఎలుగు మామా.. నక్కనొచ్చాను.. కాస్త తేనె, చేపలు ఉంటే పెట్టవా?’ అని అడిగింది. తలుపు తియ్యకుండానే ‘నేనింకా బయటకు వెళ్లలేదు. మళ్లీ రా...’ అని జవాబిచ్చిందది. నక్క ఆవులిస్తూ ముందుకు కదిలింది. అది ఏనుగు ఇంటి తలుపు కొడుతూ.. ‘ఏనుగు మామా.. ఏనుగు మామా.. నేను నక్కను.. కొన్ని పండ్లుంటే పెట్టవా?’ అని అడిగింది. అది కూడా తలుపు తియ్యకుండానే ‘నేనింకా తోటకెళ్లలేదు. మళ్లీ రా..’ అని పంపించేసింది. నక్క ఒళ్లు విరుచుకుంటూ ముందుకు కదిలింది. తర్వాత పులి ఇంటి తలుపు కొడుతూ.. ‘పులిరాజా.. పులిరాజా.. నక్కనొచ్చాను. మీరు తినగా మిగిలిన మాంసం ఉంటే పెట్టరా?’ అంది. అది కూడా తలుపు తియ్యకుండానే ‘నేనింకా వేటకెళ్లలేదు. వెళ్లి వచ్చాక రా.. మిగిలితే చూద్దాం’ అంది.

ఇక చేసేది లేక నక్క పక్కనే ఉన్న చెరువులోకి దిగి, కడుపునిండా నీరు తాగి చింత చెట్టు నీడలో చతికిలబడింది. పొద్దున్నే ఆహారం కోసం అడుక్కుంటున్న నక్కను చూసి ఆశ్చర్యపోయిందా కోతి. చెట్టు మీద నుంచే పరిశీలనగా చూసింది. నక్కకు కాళ్లూ చేతులూ బాగానే ఉన్నాయి. ఆరోగ్యంగానే ఉన్నట్లు దానికి కనిపించింది. ‘నేను నివసించే అడవిలో కష్టించి పనిచేసే జంతువులనే తప్ప, ఇలాంటి సోమరిపోతును ఇంతవరకు చూడనేలేదు’ అని మనసులోనే అనుకుంది కోతి. సరేనంటూ అడుగు వేయబోగా.. దాని కాలినొప్పి ఇంకా తగ్గలేదని గ్రహించింది. చెట్టు మీది నుంచి చూస్తే, అది నివసిస్తున్న అడవి కనిపించింది. ‘బాబోయ్‌.. కాలినొప్పితో అంతదూరం వెళ్లడం నావల్ల కాదు. చెరువులో ఈదుకుంటూ పోతే త్వరగా చేరవచ్చు. కానీ అంతదూరం ఈదడం ఎలా?’ అంటూ ఆలోచించసాగింది. అప్పుడు దానికో ఉపాయం తట్టింది.

కోతి మెల్లగా చెట్టు దిగి, నక్కతో.. ‘ఆహారం సొంతంగా సంపాదించుకోకుండా.. ఎందుకు అడుక్కుంటున్నావు?’ అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. ‘మిత్రమా.. నాకు వేటాడటం చేతకాదు. ఇతర జంతువులు తిని వదిలేసిన ఆహారం సంపాదించే శక్తి కూడా లేదు’ అంటూ ఎక్కడలేని నీరసం ప్రదర్శించింది నక్క. ‘మిత్రమా.. నేను ఈ చెరువు ఆవలి ఒడ్డునున్న అడవిలో ఉంటాను. అక్కడ నిన్న ఉదయం రెండు ఏనుగులు భీకరంగా పోట్లాడుకున్నాయి. ఆ గొడవలో రెండూ ప్రాణాలు విడిచాయి. నీకు నెలరోజులకు సరిపడా మాంసం దొరుకుతుంది. ఇలా శ్రమపడి అడుక్కోనవసరం కూడా లేదు’ అని ఆశపెట్టింది కోతి. మాంసం అనగానే నక్కకు నోట్లో నీళ్లు ఊరాయి. వెంటనే అక్కడకు వెళ్దామంది.

‘మిత్రమా.. నడుస్తూ వెళ్తే, మనం అక్కడికి చేరుకునేసరికి చీకటి పడుతుంది. నువ్వు నన్ను నీ వీపు మీద ఎక్కించుకుని చెరువులో ఈదుతూ వెళ్లావంటే కాస్త సమయంలోనే చేరుకోవచ్చు’ అంటూ దూరంగా కనిపిస్తున్న అడవిని చూపించింది కోతి. నక్క ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. కోతిని వీపు మీద ఎక్కించుకుని చెరువులోకి దిగింది. ఏనుగు మాంసం మీద ఆశతో కష్టపడి ఈది అవతలి ఒడ్డుకు చేరింది. ‘మిత్రమా.. ఏనుగు మాంసం ఎక్కడ?’ అని అడిగింది నక్క. కోతి తాను నివాసముండే చెట్టు దగ్గరకు దాన్ని తీసుకెళ్లింది. నక్కకు మామిడి పండ్లు పెట్టి అతిథి మర్యాదలు చేసింది. అది ఆకలి మీదుండటంతో ఆవురావురుమంటూ మారుమాట్లాడకుండా వాటిని తినేసింది.
కొద్దిసేపయ్యాక కోతి.. నక్కతో ‘మిత్రమా.. బద్ధకం మహాశత్రువు. దాన్ని దరిచేరనీయొద్దు. శ్రమతో సంపాదించుకున్న ఆహారం ఎంతో రుచిగా ఉంటుంది. నిజంగా నీకు ఆహారం సంపాదించుకునే శక్తి లేకపోతే, అంతపెద్ద చెరువును ఎలా ఈదగలిగావు? ఆకలి మీదున్న నీకు ఎన్ని చెప్పినా, అప్పుడు అర్థం కావని ఇప్పుడు చెబుతున్నాను. నా కాలికి ముల్లు గుచ్చుకుని నడవలేకపోవడంతో నీకు ఏనుగు మాంసం ఆశ చూపి, దగ్గర దారైన చెరువు మీదుగా ఇంటికి చేరుకున్నాను’ అని అసలు విషయం చెప్పి, క్షమించమని కోరింది. నక్కకు కోతి మీద కోపం రాకపోగా.. తన తప్పేంటో తెలుసుకుంది. దానిలోని శక్తిని గుర్తించి.. తిరిగి అడవికి బయలుదేరింది. గుమ్మడి చిప్పను చెరువులో పడేసింది. అప్పటి నుంచి సోమరితనాన్ని విడిచిపెట్టి, కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్నే తినసాగింది నక్క.

పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు