బద్ధకమే అసలు శత్రువు!

భీమవరంలో ఉండే వెంకన్న వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన కొడుకు పేరు సోము. అతడికి బద్ధకం ఎక్కువ. ఒకసారి బంధువులు తీర్థయాత్రలకు వెళ్తూ వెంకన్ననూ రమ్మని పిలిచారు.

Updated : 15 Sep 2023 04:39 IST

భీమవరంలో ఉండే వెంకన్న వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన కొడుకు పేరు సోము. అతడికి బద్ధకం ఎక్కువ. ఒకసారి బంధువులు తీర్థయాత్రలకు వెళ్తూ వెంకన్ననూ రమ్మని పిలిచారు. కానీ, ‘నెల రోజులు అంటున్నారు. నాకేమో ఇక్కడ పొలంలో పని ఉంది. కోతలు కోయించి కుప్పలు పెట్టాలి’ అని, రానని చెప్పాడు. దానికి వాళ్లు.. ‘పొలం పనిని మీ అబ్బాయి సోముకు అప్పజెప్పు. తనకూ పని నేర్పినట్టవుతుంది. మాతో వచ్చారంటే మీ భార్యాభర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఒంటరిగా వెళ్లి రావాలంటే కష్టం. ఇంకోసారి ఆలోచించుకో’ అన్నారు బంధువులు. వాళ్లు చెప్పిందీ నిజమేననుకొని, కొడుకు వైపు చూశాడాయన. పొలం పనులు చేయిస్తానని సోము ముందుకు రావడంతో, ధైర్యంగా యాత్రలకు బయలుదేరాడు వెంకన్న.

తండ్రి చెప్పినట్టు ఒకటి, రెండుసార్లు పొలానికి వెళ్లాడు సోము. చేనును చూశాక.. ‘వరి కంకులింకా పక్వానికి రాలేదు.. పది రోజులాగాలి’ అనుకున్నాడు. కొన్ని రోజులాగి కోతలు కోయించవచ్చని ఊరుకున్నాడు. ఆ తరువాత పొలానికి వెళ్లడమే మానేశాడు. కొన్ని రోజులకు చేను కోయించలేదేమని పక్క పొలం వాళ్లు అడగడంతో.. గబగబా పొలానికి పరుగు తీశాడు సోము. ఒక్కడితో అయ్యే పని కాకపోవడంతో, కోత కోసం కూలీలను వెతికాడు. ఎక్కడా దొరకలేదు. అయిదు రోజుల తర్వాత వేరే ఊరి నుంచి కూలీలను తీసుకొచ్చాడు. వాళ్లు కోత మొదలెట్టేసరికి పైరు బాగా ఎండిపోవడంతో ధాన్యపు గింజలన్నీ చేనులోనే రాలిపోసాగాయి. ఈలోగా వెంకన్న దంపతులు యాత్రల నుంచి తిరిగొచ్చారు. వచ్చీరాగానే నేరుగా పొలానికి వెళ్లాడాయన. అక్కడి పరిస్థితి చూసి గుండెలు బాదుకున్నాడు. ‘అనుకున్నంతా అయ్యింది. కొడుకు బద్ధకస్తుడని తెలిసినా, తనను నమ్మి తప్పు చేశాను’ అనుకుంటూ బాధపడ్డాడు.
మరోసారి అక్క కూతురు పెళ్లి పనుల సాయానికి వెళ్లాడు వెంకన్న. వెళ్లే ముందు సోముతో.. ‘పొలంలో శనగకాయల పంట ఉంది. రోజూ వెళ్లి, పశువులు మేయకుండా కాపలాగా ఉండు. చేను కోతలకు ఇంకా సమయం ఉంది’ అని జాగ్రత్తలు చెప్పాడు. వరి పంట విషయంలో జరిగిన తప్పు మళ్లీ జరగకూడదని, వరసగా వారం రోజులపాటు పొలానికి వెళ్లాడు కొడుకు. ఈసారి ముందుగానే కూలీలను పిలిచాడు. శనగ పంటను కోయించి, కుప్పలు వేయించాడు. పెళ్లి పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన వెంకన్న, సరాసరి పొలానికి వెళ్లాడు. ఇంకేముంది.. అక్కడ శనగ కుప్పలు కనిపించాయి. కొన్ని కాయలు తీసి చూశాడు. ఇంకా వాటిలో గింజలు గట్టిపడలేదు. మరో పది రోజులు ఆగి ఉంటే బాగుండుననీ, ఇప్పుడు వాటికి ధర పలకదనుకొని బాధగా ఇంటికి చేరాడు. కొడుకును పిలిచి.. ‘ఏ పనీ సరిగ్గా చేయరాదు. ఇంకెప్పుడు నేర్చుకుంటావు. నీవల్ల అంతా నష్టమే..’ అన్నాడు కోపంగా. ‘నేనే పని చేసినా తిడతారు.. చేయకపోయినా తిడతారు. ఇలా అయితే నేనిక ఏమీ చేయను’ అని బదులిచ్చాడు సోము.

తండ్రీకొడుకుల మధ్య జరుగుతున్న వాదనను అటుగా వెళ్తున్న ఉపాధ్యాయుడు ఈశ్వరయ్య విన్నారు. ఇంటి లోపలికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకున్నారు. సోముని పక్కన కూర్చోబెట్టుకొని ‘ఎవరికైనా బద్ధకమే అసలు శత్రువు. దాని వల్ల మనం అనుకున్నదేదీ సాధించలేము’ అన్నారు. ‘నాకు కూడా ఇలా ఉండటం ఇష్టం లేదు మాస్టారూ.. బద్ధకాన్ని వదిలించుకోవాలనే అనుకుంటున్నా.. కానీ, నా వల్ల కావడం లేదు.. ఏం చేయమంటారు?’ దిగాలుగా అన్నాడు సోము. ‘దానికి నీకో ఉదాహరణ చెబుతాను విను.. అప్పుడు నీకు పని విషయంలో మనం ఎంత శ్రద్ధగా ఉండాలో తెలుస్తుంది.. ఆ తర్వాత బద్ధకం దానంతటదే పోతుంది’ అన్నారు మాస్టారు. అలాగేనంటూ తలూపాడు సోము.

‘మీరు కోళ్లను పెంచుతారు కదా..! నువ్వెప్పుడైనా గుడ్లను కోడి ఎలా పొదుగుతుందో చూశావా?’ అని అడిగారాయన. ‘లేదు మాస్టారు.. మీరే చెప్పండి’ అన్నాడు సోము. ‘తల్లి కోడి గుడ్డును చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటుంది. గుడ్డు లోపలి పదార్థం కోడి రూపం సంతరించుకొని, అది ముక్కుతో చేసే శబ్దం కోసం ఓపిగ్గా ఎదురు చూస్తుంటుంది. ఆ తర్వాతే గుడ్డు పెంకుల్ని పగలగొట్టి, అందులోని బిడ్డ బయటకు వచ్చేలా చేస్తుంది. కోడి పిల్ల రూపం దాల్చేంత వరకు ఎదురు చూడకుండా.. ముందుగానే బయటి నుంచి పెంకును పగలగొడితే అది చనిపోతుంది. శనగ పంట విషయంలో జరిగిందదే. గింజ ఏర్పడక ముందే నువ్వు కోయించావు’ అని మాస్టారు చెప్పగానే.. ఆలోచనలో పడ్డాడు సోము.

‘బిడ్డ సరైన రూపానికి వచ్చిన తర్వాత, తల్లి కోడి ఏమాత్రం ఆలస్యం చేయదు. వరి చేను విషయంలో నువ్వు చేసిందదే. ఆలస్యంగా కోత కోయడంతో గింజలు చేనులోనే రాలిపోయాయి’ అని వివరించారాయన. ‘నిజమే మాస్టారూ.. నా తప్పేంటో తెలిసొచ్చింది’ అన్నాడు సోము. ‘పిల్లని బతికించుకోవడం కోసం తల్లి కోడి ఎంత శ్రద్ధగా, ఓపికతో ఎదురు చూస్తుందో.. మనం ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయమైనా, వ్యాపారమైనా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే, ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. మంచి ఫలితాలు సాధించవచ్చు’ అన్నారు మాస్టారు. సరేనంటూ తలూపాడు సోము. తర్వాత కొద్దిరోజుల్లోనే కొడుకులో మార్పు కనిపించినందుకు వెంకన్న ఆనందించాడు.
నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని