తాతయ్య చెప్పిన గణపతి పాఠం!

‘తాతయ్యా.. ఈసారి పెద్ద రంగుల వినాయకుడి విగ్రహాన్ని కొని ఇంటికి తీసుకొద్దాం’ గారంగా అన్నాడు వివేక్‌. ‘రసాయన రంగులతో తయారైన విగ్రహాలు ప్రకృతికి హానికరమనీ, వాటి వల్ల పర్యావరణం కలుషితం అవుతుందని నీకు ఇదివరకే చెప్పాను కదా.

Updated : 16 Sep 2023 07:03 IST

‘తాతయ్యా.. ఈసారి పెద్ద రంగుల వినాయకుడి విగ్రహాన్ని కొని ఇంటికి తీసుకొద్దాం’ గారంగా అన్నాడు వివేక్‌. ‘రసాయన రంగులతో తయారైన విగ్రహాలు ప్రకృతికి హానికరమనీ, వాటి వల్ల పర్యావరణం కలుషితం అవుతుందని నీకు ఇదివరకే చెప్పాను కదా. మనమే చక్కగా బంకమట్టి తెచ్చుకుని, వినాయకుడిని తయారు చేసుకుందాం. ఎంత పెద్ద విగ్రహం పెట్టి పూజించామన్నది ముఖ్యం కాదు.. ఎంత భక్తిగా కొలిచామన్నదే ప్రధానం’ అన్నారాయన. ‘మరి వినాయకుడిని ఎలా తయారు చేయాలో నాకు నేర్పిస్తావా?’ అడిగాడా మనవడు. ‘దానికేం.. తప్పకుండా నేర్పిస్తాను’ అని బదులిచ్చారు తాతయ్య.
మరుసటి రోజు ఆదివారం కావడంతో, ఉదయాన్నే తాతయ్యతోపాటు పొలానికి వెళ్లి బంకమట్టి తీసుకొచ్చాడు వివేక్‌. ఇద్దరూ కలిసి వినాయక ప్రతిమ తయారు చేయడం మొదలుపెట్టారు. ఇంతలో ‘వివేక్‌.. వినాయకుడి ప్రత్యేకత ఏమిటో చెప్పు చూద్దాం’ అడిగారు తాతయ్య. ‘నాకు చాలా బాగా తెలుసు.. ఏనుగు ముఖం ఉండడమే వినాయకుడి ప్రత్యేకత. చిన్ని చిన్ని కళ్లు, పెద్ద పెద్ద చెవులు, పొడవాటి తొండం.. చూడముచ్చటగా ఉంటుందా రూపం’ నవ్వుతూ అన్నాడు వివేక్‌. ‘నువ్వు సరిగ్గానే చెప్పావు కానీ ఆ ప్రత్యేకతల్లో దాగి ఉన్న విషయాన్ని మాత్రం మర్చిపోయావు’ అన్నాడు తాతయ్య. ‘అంటే..? నాకు అంతకుమించి ఏమీ తెలియదు. నువ్వే చెప్పు తాతయ్యా’ అడిగాడా మనవడు.
‘సరే విను. కళ్లు చిన్నవే అయినా సునిశిత దృష్టి ఆయన సొంతం. అంత పెద్ద చెవులు అంటే ఎవరు ఏది చెప్పినా ఏకాగ్రతతో వినడం నేర్చుకోవాలని అర్థం.. అన్నట్లు మహాభారతాన్ని వ్యాసుడు చెబుతుంటే వినాయకుడే రాశాడట. మరి ఎంత ఏకాగ్రతతో ఉంటే అంత పెద్ద కావ్యం వింటూ రాయగలుగుతాడు’ అని ఆయన మాట్లాడుతుండగానే.. ‘నిజమే తాతయ్యా..’ అన్నాడు వివేక్‌. ‘వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి.. అవేమిటో ఊహించగలవా?’ అని మళ్లీ అడిగారాయన. ‘ఉండ్రాళ్లు ఇష్టంగా తింటాడు. నేను సరిగ్గానే చెప్పానా?’ అంటూ ఉత్సాహంగా తాతయ్య వైపు చూశాడు. ఆయన నవ్వి ‘అదీ విశిష్ట గుణమేలే. ఎలా అంటే.. ధనికులైనా, పేదలైనా అందరికీ అందుబాటులో ఉండేవి బియ్యం. ఆ పిండితో చేసేవే ఉండ్రాళ్లు. వాటినే ప్రీతిగా ఆరగిస్తాడు. భక్తితో గరిక సమర్పించినా మురిసిపోతాడు’ అని వివరించారాయన.
‘నీకు తెలిసింది ఇంకేమైనా చెప్పగలవా?’ తొండాన్ని సరిజేస్తూ అడిగారు తాతయ్య. ‘అమ్మ కోసం నాన్ననే ఎదిరించాడు కదా..!’ అని టక్కున అన్నాడు వివేక్‌. ‘శివుడిని అడ్డుకుంది నిజమే అయినా, అమ్మ కోసం నాన్నను ఎదిరించడమని కాదు అర్థం చేసుకోవాల్సింది.. తనకు అప్పజెప్పిన పనిని పూర్తి బాధ్యతతో నెరవేర్చడం. పెద్దవాళ్లు మనకు ఏదైనా పని చెబితే విజయవంతంగా పూర్తి చేయాలన్నమాట’ అని చెప్పారాయన. వినాయకుడి కిరీటాన్ని తీర్చిదిద్దుతూ.. ‘గణపతికి సంబంధించిన మరో విశిష్టత చెప్పు?’ అని అడిగితే, ‘ఇక నాకు తెలియవు తాతయ్యా..’ అంటూ బిక్కముఖం వేశాడు వివేక్‌.
‘సరేలే.. నేనే చెబుతాను. గణాధిపత్యం కథ వినే ఉంటావు. విఘ్నాధిపత్యానికి గణేశుడితోపాటు సోదరుడు కుమారస్వామి కూడా పోటీ పడ్డాడు. దాంతో శివుడు.. ఇద్దరికీ ఓ పరీక్ష పెట్టాడు. ముల్లోకాల్లోని నదుల్లో స్నానాలు పూర్తి చేసి, ఎవరైతే తనను ముందుగా చేరుకుంటారో వారికే ఆధిపత్యం లభిస్తుందన్నాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై వేగంగా బయలుదేరాడు. ఎలుక వాహనంగా గల వినాయకుడు వేగంగా ఆ పని చేయడం అసాధ్యం. దాంతో తండ్రి శివుడి దగ్గరకు వెళ్లి, ‘నా శక్తి తెలిసి కూడా.. ఇటువంటి పరీక్ష పెట్టడం మీకు న్యాయమేనా?’ అని దీనంగా అడిగాడు. అప్పుడు శివుడు.. తన చెవిలో ఒక మంత్రం చెప్పి, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. సప్తసముద్రాలు దాటినంత పుణ్యం వస్తుందని వివరించాడు.
చిత్రంగా.. ముల్లోకాల్లోని ప్రతి నదిలో తనకంటే వినాయకుడు ముందే స్నానం చేసి వస్తున్నట్లుగా కుమారస్వామికి ఎదురుకాసాగాడు. దాంతో అన్న గొప్పతనం అర్థమైన కుమారస్వామి, తన ఓటమిని అంగీకరించి.. గణేశుడికే విఘ్నాధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరాడు. ఆ విధంగా తల్లిదండ్రులను గౌరవిస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో ప్రపంచానికి చాటి చెప్పాడు’ అని ముగించారు తాతయ్య. ‘భలే భలే.. ఉన్న చోటు నుంచి కదలకుండానే పోటీలో వినాయకుడు గెలిచాడు’ అంటూ చప్పట్లు కొట్టాడు వివేక్‌. ఇవన్నీ చెబుతూనే.. విగ్రహం తయారీని పూర్తి చేశారాయన.
‘విగ్రహం ఎలా ఉంది?’ అని పరిశీలనగా చూస్తూ మనవడిని అడిగారు తాతయ్య. చాలా బాగుందన్నాడతను. ‘కళ్లకు నల్లటి పూసలు పెడతాను. నాయనమ్మ దగ్గర చిన్న చిన్న రంగు రాళ్లను తీసుకొని కిరీటానికి అతికిస్తాను. బొట్టు మాత్రం మట్టి కాస్త ఆరాక పెడతాను. నా దగ్గరున్న సహజ రంగులతో పంచె, ఉత్తరీయం తదితరాలన్నీ అలంకరిస్తా’ అన్నారు తాతయ్య. సరేనన్నట్లు తలూపాడు మనవడు. ‘అయితే.. ఒక విషయం గుర్తుపెట్టుకో.. వినాయకుడికి పూజ చేయడంతోనే సరిపోదు. ఆయనలోని విశిష్ట గుణాలను నువ్వు కూడా అలవరచుకోవాలి. నీ స్నేహితులకూ అలవాటు చేయాలి’ అని చెప్పారు తాతయ్య. అలాగేనని.. ‘జై బోలో గణేశ్‌ మహారాజ్‌ కీ..’ అంటూ అలంకరణ వస్తువుల కోసం నాయనమ్మ దగ్గరకు పరిగెత్తాడు వివేక్‌.

జె.శ్యామల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని