జై.. జై.. గణేశా! జై కొడతా గణేశా!!

చంద్రం మూడోతరగతి చదువుతున్నాడు. వినాయక చవితి పండుగ అంటే చంద్రానికి చాలా ఇష్టం. భక్తిశ్రద్ధలతో వినాయకుడికి పూజ చేసే ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూసేవాడు. చంద్రం ఎదురు చూసే వినాయక చవితి రోజు రానే వచ్చింది.

Published : 18 Sep 2023 00:24 IST

చంద్రం మూడోతరగతి చదువుతున్నాడు. వినాయక చవితి పండుగ అంటే చంద్రానికి చాలా ఇష్టం. భక్తిశ్రద్ధలతో వినాయకుడికి పూజ చేసే ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూసేవాడు. చంద్రం ఎదురు చూసే వినాయక చవితి రోజు రానే వచ్చింది. ఆ ఉదయమే తాతయ్య వినాయకుడి పూజ కోసం అంతా సిద్ధం చేస్తున్నాడు.

చంద్రం తన తాతయ్యకు ఫలాలు, పూలు, మామిడి ఆకులూ అందిస్తున్నాడే కానీ, హుషారుగా మాట్లాడటం లేదు. సాయం చేస్తున్నాడే కానీ, తాతయ్య మాటలకు సరిగా బదులీయడం లేదు. అది గమనించిన తాతయ్యకు చంద్రం విచారంగా ఉన్నాడనిపించింది.

‘చంద్రా! విచారంగా ఉన్నావే?’ అంటూ అనుమానంగా చూస్తూ అడిగాడు తాతయ్య. ‘ఏం లేదు తాతయ్యా!’ అన్నాడు చంద్రం. ‘లేదు... లేదు.. అమ్మ కూడా... నువ్వు ఆనందంగా లేవంటోంది. సంతోషాన్ని తోటి వాళ్లతో పంచుకుంటే పెరుగుతుంది. కానీ బాధ మాత్రం తగ్గుతుంది. చెప్పు చంద్రం’ అన్నాడు తాతయ్య.  

‘తాతయ్యా! నాకు చంద్రం అనే పేరెందుకు పెట్టారు?’ బాధగా అడిగాడు. ‘చంద్రం పేరు చాలా గొప్పది. సూర్యుడి వెలుగు వేడిగా ఉంటుంది. కానీ చందమామ పంచే వెన్నెల వెలుగు చల్లగా ఉంటుంది’ అని తాతయ్య నవ్వుతూ బదులిచ్చాడు. ‘‘లేదు తాతయ్యా! వినాయక చవితి పూజ అంటే నాకు చాలా ఇష్టం. అయితే చవితి నాడు చంద్రుణ్ని చూస్తే నీలాపనిందలు కలుగుతాయని నా స్నేహితులు చెప్పారు. వారిలో కొంతమంది ఆకతాయిలు ‘ఈ చంద్రాన్ని కూడా చూడకూడదు’ అంటూ నన్ను వెక్కిరించారు. నా పేరు చంద్రం అయినందుకే కదా... వాళ్లు అలా అన్నారు’ అని తన బాధకు గల కారణం చెబుతూ అన్నాడు చంద్రం.  

అప్పుడు తాతయ్య... ‘ఎవరో ఏదో గేలి చేశారని బాధపడకూడదు. చంద్రునిపై వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవడం కోసం శాస్త్రజ్ఞులు ఎంతో కాలంగా పరిశోధనలు చేస్తున్నారు.

రష్యా, అమెరికా, చైనా దేశాల తరువాత చంద్రుడి మీదకు రోవర్‌ను పంపి పరిశోధనలు చేసిన దేశం మన భారతదేశం. అంతే కాదు, చంద్రుడి దక్షిణధృవంపై పరిశోధనలు మొదలు పెట్టిన మొట్టమొదటి దేశం కూడా మనదే. ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలితమే చంద్రయాన్‌. త్వరలోనే మనం చంద్రుడి గురించి పూర్తిగా తెలుసుకుని అక్కడ కాలు కూడా పెడతాం! మన మువ్వన్నెల జెండా ఎగుర వేస్తాం. నీకు మరో విషయం తెలుసా... చంద్రయాన్‌ అంతరిక్ష నౌకను చంద్రుని మీదకు పంపే ముందు, పంపిన తరువాత కూడా ఇస్రో శాస్త్రజ్ఞులు వారి ఇష్ట దైవానికి పూజ చేశారు!

అంటే మనిషి చేసే ప్రతీ పనిలోనూ తాను నమ్మకం కలిగి ఉంటాడు. ఆ నమ్మకంతో పాటు ఎటువంటి ఆటంకాలూ కలగకూడదని వినాయకుడికి పూజ చేస్తారు. విఘ్నం అంటే ఆటంకం. ఆ ఆటంకాలను అధిగమించే దైవం కనుక వినాయకునికి.. విఘ్నేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. అందుకే నీలాంటి పిల్లలు తమకు చదువు బాగా రావాలని కోరుకుంటూ.. వారి పుస్తకాలను కూడా పూజలో పెడతారు. పర్యావరణాన్ని పరిరక్షించే మొక్కల ఆకులతో వినాయకునికి పూజ చేస్తారు. రక రకాల పత్రాలతో పూజ చేస్తే ఆరోగ్యం కలుగుతుంది కూడా. నీకు మరో విషయం కూడా చెబుతాను... చంద్రుణ్ని, వినాయకుడి తండ్రి అయిన శివుడు ఏకంగా తన తలపై ధరించాడు. వినాయక చవితినాడు మాత్రమే చంద్రుణ్ని చూడకూడదంటారు. దాని వెనకా ఓ కారణం ఉంది. పూజ తర్వాత అదంతా వివరంగా చెబుతాను సరేనా! అయినా మిగతా రోజుల్లో చంద్రుణ్ని ఎంచక్కా చూడొచ్చు కదా!’ అని వివరంగా చెప్పాడు తాతయ్య.

‘సరే... తాతయ్యా! పదా.. వినాయకుని పూజ చేద్దాం’ అంటూ చంద్రం, తాతయ్యతో కలసి పూజా మందిరంలోకి నడిచాడు. మట్టి వినాయకుణ్ని చూడగానే తనను ఆశీర్వదిస్తున్నట్లుగా చంద్రానికి అనిపించింది. చంద్రం వెంటనే తన రెండు చేతులూ జోడించి, భక్తిగా వినాయకునికి దండం పెట్టాడు.

కె.వి.లక్ష్మణరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని