హమ్మయ్య.. పెంకి పింకీ మారిందోచ్‌!

అది ఓ పాఠశాల. పింకీ అందులో రెండోతరగతి చదువుతోంది. విపరీతంగా అల్లరి చేస్తుంది. పింకీ వాళ్ల అమ్మ, నాన్న ఎప్పుడూ... ‘ఇంత అల్లరి చేయకూడదమ్మా! బుద్ధిగా ఉండాలి’ అని బుజ్జగిస్తారు. ప్చ్‌... కానీ ఆ మాటలు అస్సలు పట్టించుకోదు పింకీ.

Published : 20 Sep 2023 00:09 IST

ది ఓ పాఠశాల. పింకీ అందులో రెండోతరగతి చదువుతోంది. విపరీతంగా అల్లరి చేస్తుంది. పింకీ వాళ్ల అమ్మ, నాన్న ఎప్పుడూ... ‘ఇంత అల్లరి చేయకూడదమ్మా! బుద్ధిగా ఉండాలి’ అని బుజ్జగిస్తారు. ప్చ్‌... కానీ ఆ మాటలు అస్సలు పట్టించుకోదు పింకీ. బడిలో తోటి పిల్లల దగ్గర పెన్సిళ్లు లాగేసుకుంటుంది. పుస్తకాలు చించేస్తుంది. ఎరేజర్లు దాచేసి ఏడిపిస్తుంది. పిల్లలందరూ మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు తనకు నచ్చిన పదార్థాలు వేరే వాళ్ల డబ్బాలో ఉంటే అడగకుండా తీసేసుకుంటుంది. ‘అలా తీసుకోకూడదు పింకీ! నీకు తినాలనిపిస్తే అడగాలి’ అంది చిన్ని ఓసారి! ‘నేనంతే... అడగకుండానే తీసుకుంటాను’ అని మొండిగా సమాధానం చెప్పింది పింకీ. పాపం చిన్నీ.. అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయింది.

ఒకరోజు పింకీ, మైదానంలో పిల్లలందరూ ఆడుకునేటప్పుడు  బంతితో పక్కన ఉన్న రాజును కొట్టింది. దెబ్బగట్టిగా తగలడంతో రాజు ఏడ్చాడు. ‘పింకీ! రాజుకు సారీ చెప్పు. నువ్వు అలా కొట్టడం తప్పు’ అంది చిన్ని. ‘రాజు నా చేతిలో బంతి తీసుకున్నాడు. అప్పుడు నేను కొట్టకుండా ఊరుకుంటానా’ అని పెంకిగా జవాబిచ్చింది పింకీ. ఇదంతా వాళ్ల టీచర్‌ చూశారు.

చాలా రోజుల నుంచి ఆవిడ పింకీ అల్లరిని గమనిస్తున్నారు. ఎలాగైనా పింకీకి గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు టీచర్‌ స్కూలు గార్డెన్లో ఉన్న పూలగుత్తులు కోసి ఇచ్చారు. వాటిని ఒకరితో ఒకరికి ఇప్పించారు. అప్పుడు ఇచ్చే వారి ముఖంలో ఆనందం, తీసుకునే వారిలో ఉత్సాహం కనిపించింది. పిల్లలంతా  పరస్పరం చేతులు కలుపుకొని.. ‘థాంక్స్‌’ చెప్పుకున్నారు.

ఆఖరున పింకీ వంతు వచ్చింది. ‘పింకీకి పూలు ఇవ్వడానికి ఎవరైనా ముందుకు రండి’ అంది టీచర్‌. ఎవరూ ముందుకు రాలేదు. పింకీ ముఖం మాడిపోయింది. ‘రాజు! ఇలా రా!... మనకు దేవుడు చేతులు ఇచ్చింది ఇతరులకు సహాయపడేందుకు, ప్రేమను చూపించేందుకు, మంచి పనులు చేయడానికి. నువ్వు నీ చేతులతో ఈ పూలగుత్తిని పింకీకి ఇవ్వు. దీంతో మీ ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. పింకీ నిన్ను గాయపరిచిన విషయం వదిలేసి ఇవ్వు’ అన్నారు టీచర్‌. రాజు కూర్చున్న చోటు నుంచి లేచి వచ్చి నవ్వుతూ పూలగుత్తిని పింకీకి ఇచ్చాడు. వెంటనే పింకీ ముఖం వికసించింది.

‘పింకీ! ఇప్పుడు నువ్వు రాజుకు ఇవ్వు’ అన్నారు టీచర్‌. పింకీ పూలగుత్తి ఇస్తున్నప్పుడు తనకు తెలియకుండానే చాలా సంతోషంగా అనిపించింది. తన అల్లరి పనులతో అందరినీ బాధ పెట్టడమే తెలిసిన పింకీకి మొదటిసారి మంచిపని చేసిన భావన కలిగింది. తరువాత రోజు టీచర్‌ పిల్లలకు షేరింగ్‌ డే ఏర్పాటు చేశారు. పిల్లలు వారు తెచ్చుకున్న స్నాక్స్‌ బాక్స్‌లోని ఆహారపదార్థాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. పింకీ కూడా ఉత్సాహంగా ఇందులో పాలు పంచుకుంది. ఇవ్వడంలో ఉన్న ఆనందం, బాధ పెట్టడంలో లేదని అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది.

‘ఈ రోజు ఇంట్లో అమ్మానాన్నలకు సహాయం చేసి, ఏ విధంగా చేశారో కూడా రేపు స్కూలులో వివరంగా చెప్పాలి’ అని మరో రోజు చెప్పారు టీచర్‌. ‘మా అమ్మకు సహాయంగా ఇంట్లో నీళ్ల సీసాలు నింపాను టీచర్‌. మా అమ్మ సంతోషంగా ముద్దు పెట్టుకుంది’ అంది పింకీ.

‘వెరీ గుడ్‌ పింకీ! నువ్వు మంచి పనులు చేస్తుండటం వల్ల ఎంచక్కా ప్రస్తుతం నీకు అభినందనలు వస్తున్నాయి. ఇంతకు ముందు నువ్వు మితిమీరిన అల్లరి చేసేదానివి. అందుకే అప్పుడు నిన్ను చూసి అందరూ చిరాకు పడేవారు’ అన్నారు టీచర్‌.  

‘అవును మేడం! ఇప్పుడు నాతో అందరూ స్నేహంగా ఉంటున్నారు. మీరు చెప్పినట్లుగానే నా తోటివారికి సహాయం చేస్తాను. వారిని ఆటపట్టించను. ఇంకా బోలెడు మంచి పనులు చేస్తాను’ అంది పింకీ. టీచర్‌తోపాటు, క్లాసులోని పిల్లలంతా చప్పట్లతో పింకీని అభినందించారు.  

కేవీ సుమలత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని