వన దేవత వరమిచ్చినా..!

కావేరి నదీ తీరాన ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది. దానిపైన చాలా కాకులు గూళ్లు కట్టుకుని నివసిస్తున్నాయి. అందులో పెద్ద కాకులతోపాటు పిల్లవీ ఉన్నాయి.

Updated : 22 Sep 2023 05:14 IST

కావేరి నదీ తీరాన ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది. దానిపైన చాలా కాకులు గూళ్లు కట్టుకుని నివసిస్తున్నాయి. అందులో పెద్ద కాకులతోపాటు పిల్లవీ ఉన్నాయి. ఉదయాన్నే ఆహారానికి వెళ్లడం, మధ్యాహ్నం వరకు తిరిగి రావడం వాటి దినచర్య. గూటికి వచ్చాక.. ఆరోజు చేసిన, చూసిన పనుల గురించి మాట్లాడుకునేవి. ఒకరోజు కాకులన్నీ సరదాగా కబుర్లు చెప్పుకొంటుండగా, ఓ తెల్లని కొంగ వచ్చి ఆ చెట్టుపైన వాలింది. ఓ ముసలి కాకి దాన్ని చూసి దారి తప్పి వచ్చిందేమోననుకుంది. ఒక పిల్ల కాకి మాత్రం.. ‘అమ్మా.. ఏదో దేవతా పక్షి మన చెట్టు మీద వాలింది. దాని ఒళ్లంతా తెల్లగా మెరిసిపోతోంది. ముక్కు పొడవుగా, మెడ సన్నగా చూసేందుకు చాలా బాగుంది. మళ్లీ అది దేవలోకానికి వెళ్లిపోతుందేమో.. ఓసారి చూడటానికి రా..’ అని తల్లిని పిలిచింది.

అప్పుడు తల్లి బయటకు వచ్చి.. ‘అది దేవతా పక్షి కాదమ్మా.. మనలాంటి పక్షే.. కానీ, దాన్ని కొంగ అంటారు. అవి ఎక్కువగా సరస్సులు, చెరువుల దగ్గర ఉంటాయి’ అంది. ‘మరి మనలాంటిదే అయినప్పుడు, దాని ఒళ్లు కూడా నల్లగా ఉండాలి కానీ, అలా తెల్లగా మెరిసిపోతుందే..!’ అని ఆశ్చర్యంగా అడిగిందా పిల్ల కాకి. ‘దేవుడు అందరినీ ఒకేలా పుట్టించడమ్మా.. కొన్నింటికి రంగు, కొన్నింటికి రూపు, కొన్నింటికి గాత్రం, కొన్నింటికి నాట్యం ఇచ్చాడు. అలాగే ఈ కొంగ తెల్లగా ఉంటుంది. ఇది నీటిలో చేపలను బాగా పట్టగలదు’ అందా తల్లి. ‘మనం కూడా అలా తెల్లగా ఉంటే బాగుంటుంది కదమ్మా..’ అని అమాయకంగా అందా పిల్ల కాకి. ‘నిజమే.. బాగుంటుంది. కానీ ఎవరికి ఏది ఇవ్వాలో.. ఆ దేవుడికి బాగా తెలుసు. ఇప్పుడీ రూపంలో మనకే లోటూ లేదు కదా..’ అంది తల్లి. ఆ మాటలు పిల్ల కాకికి రుచించలేదు. ‘అడుగుతా.. ఆ దేవుడినే అడుగుతా.. మనకు ఎందుకు ఈ నల్లని రూపం ఇచ్చావని..?’ అనుకుంటూ తల్లి ఒడిలోకి చేరింది.

మరుసటి రోజు దూరంగా ఉన్న కొండ మీద వాలి తపస్సు చేయసాగిందా పిల్ల కాకి. దాని భక్తికి మెచ్చి వన దేవత ప్రత్యక్షమైంది. ‘ఓ పిల్ల కాకీ.. ఎందుకు నువ్వు కఠోర తపస్సు చేస్తున్నావు? నీకేం కావాలో కోరుకో..’ అంది. వెంటనే అది.. ‘కొంగలా నా శరీరం కూడా తెల్లగా మారిపోవాలి’ అని కోరుకుంది. ‘తథాస్తు’ అని దేవత మాయమైంది. కళ్లు మూసి తెరిచేలోగా కాకి పిల్ల తెల్లగా మారిపోయింది. ఆ రంగును చూసుకుని మురిసిపోయింది. వెంటనే ఎగురుకుంటూ మర్రి చెట్టు దగ్గరకి వచ్చింది. తెలుపు రంగులో ఉన్న కాకి పిల్లని చూసి మిగిలినవి భయపడ్డాయి. ‘నేను చిన్నీని..’ అంటూ దాని అమ్మ దగ్గరకు వెళ్లింది. ‘నువ్వు నా చిన్నివి కాదు.. దాని రంగు వేరు.. నువ్వు వేరు..’ అంటూ దూరం జరిగింది తల్లి. ‘అమ్మా.. నేను చెప్పేది నిజమే.. తపస్సు చేసి కొంగలాంటి రంగును పొందాను’ అని విషయం చెప్పిందా పిల్ల కాకి.

‘మాతో ఒక్క మాటైనా చెప్పొద్దా.. నువ్వొక్కదానివే తెలుపు రంగులో ఉంటే సరిపోతుందా? నిన్ను మాలో కలుపుకోవడం జరగదు’ అని గట్టిగా చెప్పేసిందా గుంపులోని పెద్ద కాకి. దాని మాట అంటే అన్నిటికీ గౌరవం. ‘అది కాదు పెద్దమ్మా..’ అంటూ ఏదో సర్దిచెప్పబోయిందా పిల్ల కాకి. ‘ఇక నువ్వు మాట్లాడేది ఏమీ లేదు.. దేవుడు మనల్ని ఎలా పుట్టించాడో అలాగే ఉండాలి. అంతేగానీ నువ్వు తెల్లగా మారి, మాలో కలుస్తానంటే ఒప్పుకొనేది లేదు’ అందా పెద్ద కాకి. ‘సరే పెద్దమ్మా.. మళ్లీ వస్తా’ అంటూ కొండ మీదుగా వెళ్లిపోయింది. ఈసారి కూడా నిబద్ధతతో తపస్సు చేసింది.

వన దేవత ప్రత్యక్షమై.. ‘నువ్వు కోరుకున్న వరం ఇచ్చాను కదా.. మళ్లీ ఏమైంది?’ అని ప్రశ్నించింది. ‘అమ్మా.. నాకు మాత్రం తెల్ల రంగు ఇస్తే సరిపోదు.. మా జాతి పక్షులన్నింటికీ కావాలి’ అని అడిగింది. ‘నువ్వు తపస్సు చేశావు కాబట్టే నీకు వరం ఇచ్చాను. వాళ్లందరూ రంగు మారాలని ఏమీ కోరలేదు కదా..?’ అని ప్రశ్నించిందా దేవత. ‘తెలుపు రంగులో ఉంటే మిగతా పక్షులు నన్ను గుంపులో కలుపుకోవడం లేదు’ అని బాధగా అసలు విషయం చెప్పిందది. ‘మిగతా వాటికి రంగుతో పని లేదు. భగవంతుడు ఇచ్చిన రంగు మార్చుకోవాలని, అవి అనుకోవడం లేదు. నువ్వు మాత్రమే తెలివితక్కువగా ఆ వరం కోరుకున్నావు. ఇప్పటికైనా అర్థం చేసుకో.. రంగు మారితే నీవాళ్లే నిన్ను దగ్గరకు రానివ్వరు.. అది మీ జాతి లక్షణమని తెలుసుకో..’ అని వనదేవత మాయమైంది.

‘అంతేనంటావా.. అంతేనంటావా?’ అని కలవరిస్తున్న పిల్ల కాకిని తట్టి లేపింది తల్లి. ‘పట్ట పగలే ఏమిటీ పరధ్యానం? పగటి వేళ నిద్రపోవడం మంచిది కాదు.. బయటకు వెళ్లి, ఏదైనా ఆహారం సంపాదించుకుందాం పద..’ అంది. ‘మరి ఆ తెల్ల కొంగ..?’ అని ఆరా తీసిందా పిల్ల కాకి. ‘అది ఎప్పుడో ఎగిరిపోయింది’ అని పిల్లని తీసుకుని ఆహారం కోసం బయలుదేరిందా తల్లి.  

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని