ప్రతీకారం వద్దు.. సహకారమే ముద్దు!

వెంకటాపురంలో ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన చలమయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సత్యం. చిన్నవాడు విశ్వం. సత్యం.. నగరంలో ఉద్యోగం చేస్తుండగా, విశ్వం.. దగ్గర్లోని పట్టణంలో వ్యాపారం చేస్తున్నాడు.

Updated : 28 Sep 2023 05:54 IST

వెంకటాపురంలో ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన చలమయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సత్యం. చిన్నవాడు విశ్వం. సత్యం.. నగరంలో ఉద్యోగం చేస్తుండగా, విశ్వం.. దగ్గర్లోని పట్టణంలో వ్యాపారం చేస్తున్నాడు. ఊర్లోనే ఉంటూ వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటూ జీవించేవాడు చలమయ్య. ఒకసారి పెద్దకొడుకు ఇంటికెళ్లి కొన్నాళ్లున్నాడాయన. అక్కడుండగా కొడుకు ముఖంలో విచారం చూశాడు. కారణమడిగితే చెప్పలేదతను.

అప్పుడాయన... ‘పంచుకుంటే పెరిగేది సంతోషం. తరిగేది విచారమన్నారు పెద్దలు. నీ బాధ తగ్గాలంటే నాతో చెప్పు. సలహా చెబుతాను’ అనడంతో నోరు విప్పాడు సత్యం. ‘మా కంపెనీ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డాను. పదోన్నతి పొందాల్సిన సమయంలో.. నాకంటే తక్కువ స్థాయి ఉద్యోగి ఒకరు.. పెద్దల ప్రాపకం సంపాదించి పదోన్నతిని తన్నుకుపోయాడు. అందరి దగ్గరా తలకొట్టేసినట్టయింది. అతని మీద కోపంగా ఉంది. ప్రతీకారం తీర్చుకోడానికి చూస్తున్నాను’ అని చెప్పాడు.

‘ఆ ఆలోచనే తప్పు బాబూ. అలా చేయవద్దు. నీలోని కష్టపడే తత్వం, అంకితభావం నాకు తెలుసు. పదోన్నతి ఇప్పుడు రాకపోతే తరువాత వస్తుంది. మీ కంపెనీ బాగా అభివృద్ధిలోకి వస్తున్నట్టు, మరిన్ని శాఖలు విస్తరిస్తున్నట్టు చదివాను. అలాంటప్పుడు పగ, ప్రతీకారంతో తప్పటడుగులు వేయకు. నువ్వు పగ తీర్చుకోవాలని చూస్తే, అతడు కూడా తిరిగి ప్రతీకారం తీర్చుకుంటాడు. మీ మధ్య విరోధం పెరుగుతుందే కానీ మంచి జరగదు. ఆ ఆలోచన మానేసి ఎప్పటిలాగే పని మీద దృష్టి పెట్టు. ఫలితం కనబడుతుంది’ అన్నాడు చలమయ్య. తండ్రి మీది గౌరవంతో సరేనన్నాడు సత్యం.

అటునుంచి అటే రెండో కొడుకు దగ్గరకు వెళ్లాడాయన. కొడుకు వ్యాపారం, సంపాదన బాగుండడంతో గొప్ప నివాస భవనం కట్టించాడు. భార్యాపిల్లలకు నగలు చేయించాడు. కొడుకు స్థితికి సంతోషించాడు చలమయ్య. కొన్నాళ్ల తరువాత ఒకసారి విశ్వం ఎవరితోనో రహస్య సంప్రదింపులు చేయడం చలమయ్య చూశాడు. వారంతా మంచివారిగా అనిపించలేదు. దాంతో కొడుకును పిలిచి విషయమేంటని అడిగాడు. వ్యాపార రహస్యాలు మాట్లాడుతున్నానని జవాబిచ్చాడు. కానీ నమ్మకం కలగలేదు చలమయ్యకు. ‘నాకు చెప్పకూడని రహస్యాలు ఏముంటాయి? ఏదైనా ఉంటే చెప్పు. తోచిన పరిష్కారం చెబుతాను’ అని రెట్టించి అడిగాడు తండ్రి. విశ్వం.. ‘నేనిక్కడ వ్యాపారం ప్రారంభించినప్పటి నుంచి ఆరు నెలల క్రితం వరకు అంతా అనుకూలంగానే ఉండేది. పెట్టిన డబ్బు పది రెట్లు పెరిగింది. ప్రజల మన్ననలూ పొందాను. అలాంటి సమయంలో భూషణం వచ్చి వ్యాపారం పెట్టాడు. ధరలు తగ్గించి అమ్మడమే కాకుండా, నాకు వ్యతిరేక ప్రచారం చేశాడు. ఏదో మాయ చేసి, నా దగ్గరున్న పెద్ద ఖాతాలన్నీ లాగేసుకున్నాడు. ఇప్పుడు నా వ్యాపారం సగానికి పడిపోయింది. కొన్నాళ్లాగితే మూసేయాలి. సాటి వ్యాపారి కదా అని సహించాను. కానీ పక్కలో బల్లెమయ్యాడు. నా దారికి అడ్డు నిలిచిన శత్రువు భూషణం బెడద వదిలించుకోడానికే వాళ్లతో మాట్లాడాను’ అన్నాడు.  

అది విన్న చలమయ్య.. ‘నీ ఆలోచన తప్పు. ఊరు అన్న తర్వాత వ్యాపారులు ఎందరో ఉంటారు. వాళ్లూ బతకాలి కదా. వాళ్ల వ్యాపారం పెరగాలని రకరకాలుగా ఆలోచిస్తారు... ఆకర్షిస్తారు. అంతమాత్రాన వాళ్లు నీ శత్రువులు కారు. అది వృత్తి ధర్మం కూడా! అతడి మీద ప్రతీకారమనే ఆలోచన చేయవద్దు. ఈ రోజు భూషణం అడ్డు తొలగించుకుంటే రేపు మరొకరు వస్తారు’ అని చెప్పాడు. ఏం చెయ్యాలో తోచడం లేదని బాధపడ్డాడు విశ్వం.

అప్పుడు చలమయ్య... ‘వృత్తి, వ్యాపారంలో శత్రువులు ఉండకూడదు. ప్రత్యర్థులే ఉండాలి. ఉదాహరణకు కుస్తీ పోటీలు, వీధి గొడవలను తీసుకో... వాటి మధ్య చాలా తేడా ఉంటుంది. రెండింట్లోనూ ఇద్దరు పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ కుస్తీ పోటీలకు నియమాలు, పద్ధతులు ఉంటాయి. వాటిలో పాల్గొనేవారు ఒకరినొకరు ప్రత్యర్థులుగానే భావిస్తారు. ఒకరిని చూస్తే మరొకరు శత్రువుల్లా ప్రవర్తించరు. ఎవరు గెలిచినా రెండోవారు ఆమోదిస్తారు. వీధి గొడవల విషయం అలా కాదు. పగ, ద్వేషం, శత్రుత్వ భావం పెంచుకుంటారు. నువ్విప్పుడు ఆటగాడిలా ఆలోచించి వ్యాపార స్ఫూర్తితో ప్రవర్తించు. పరీక్షల్లోనైనా, ఉద్యోగ ప్రయత్నంలోనైనా వ్యతిరేక ఫలితం కలిగితే బాధపడనక్కర్లేదు. సామరస్య ధోరణితో ప్రవర్తించి సానుకూల పరచుకోవాలి. భూషణంతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందాం. ఉమ్మడి వ్యాపారం పెడదామని ఆహ్వానిద్దాం. లాభాలు వస్తాయంటే వదులుకోడు’ అని చెప్పాడు. తండ్రి చెప్పింది నచ్చడంతో సంతోషంతో అంగీకరించాడు విశ్వం. చలమయ్య ఆలోచన తప్పు కాలేదు. కొద్దిరోజుల్లోనే సత్యానికి పదోన్నతి వచ్చింది. విశ్వంతో కలసి వ్యాపారం చేయడానికి భూషణం ఒప్పుకున్నాడు. కొడుకులకు ఉపయోగపడే సలహాలు, సూచనలు, పరిష్కారాలు చేసిన సంతోషంతో ఊరికి బయల్దేరాడు చలమయ్య. అప్పటి నుంచి సత్యం, విశ్వం తమ పోటీదారులను శత్రువులుగా కాకుండా ప్రత్యర్థులుగా పరిగణించడం మొదలు పెట్టారు.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు