వారే నిజమైన గొప్పవారు!

చంద్రగిరి రాజ్యానికి రాజు జయసింహుడు. అక్కడ విశ్వనాథుడు అనే పండితుడు ఆస్థాన కవి. జయసింహుడు స్వతహాగా సాహిత్యాభిమాని కావడంతో ఏటా కవులను, పండితులను సన్మానించేవాడు.

Updated : 29 Sep 2023 05:13 IST

చంద్రగిరి రాజ్యానికి రాజు జయసింహుడు. అక్కడ విశ్వనాథుడు అనే పండితుడు ఆస్థాన కవి. జయసింహుడు స్వతహాగా సాహిత్యాభిమాని కావడంతో ఏటా కవులను, పండితులను సన్మానించేవాడు. విశ్వనాథుడు ఒకసారి రాజధానికి దూరంగా ఉన్న గ్రామంలోని బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాడు. అక్కడ గొప్ప పాండిత్యం గల ఒక యువకుడి గురించి విన్నాడు. అతడి పేరు వర్ధనుడు. కోరి అతడి కవిత్వం విని.. ‘ఇంత చిన్న వయసులోనే అంతటి ప్రతిభా?’ అని ఆశ్చర్యపోయాడు విశ్వనాథుడు. ‘నువ్వు ఎప్పుడూ రాజదర్శనం చేసుకోలేదా? నీలాంటి వారు ఇలా మారుమూల గ్రామాల్లో ఉండిపోతే ఎలా? నీకు తెలుసో లేదో మన రాజుగారు గొప్ప సాహితీ ప్రియులు. ఆయన ఏటా కవులను, పండితులను సన్మానిస్తుంటారు. ఈసారి సందర్భం వచ్చినప్పుడు నీ గురించి రాజుగారితో చెప్తాను. ఆయన నుంచి ఆహ్వానం అందగానే నువ్వు రాజధానికి రావాల్సి ఉంటుంది’ అన్నాడు. సంతోషంతో సరేనన్నాడు వర్ధనుడు.

అన్నమాట ప్రకారమే రాజధాని చేరాక, రాజుతో వర్ధనుడి పాండిత్యం గురించి చెప్పడం, ఆయన నుంచి ఆహ్వానం అందటం జరిగింది. వెంటనే వర్ధనుడు ఆనందంగా రాజధానికి బయలుదేరాడు. బాగా పొద్దుపోయేసరికి మధ్యలో ఉండే సీతాపురం అనే ఓ ఊరు చేరాడు. అక్కడున్న సత్రంలోనే ఆరోజుకి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే బయలుదేరదామని అనుకున్నాడు. రాత్రి భోజనం సమయంలో పూటకూళ్లమ్మతో మాటలు కలిశాయి. తాను ఏ పని మీద రాజధానికి వెళ్తున్నాడో చెప్పాడు. ‘బాబ్బాబు.. నీకు పుణ్యం ఉంటుంది. ఈ గ్రామంలో కూడా జయంతుడనే ఒక మహా పండితున్నాడు. ఏమాత్రం గుర్తింపులేక ఇక్కడే మగ్గిపోతున్నాడు. కాస్త పెద్ద మనసుతో అతడి గురించి రాజుగారితో చెప్పు. తగిన గుర్తింపు వచ్చేలా చూడు’ అంది.

ఆమె గొప్ప హృదయానికి ఆశ్చర్యపోతూ.. ‘అలాగే అవ్వా’ అని జయంతుడి చిరునామా తెలుసుకొని, ఇంటికి వెళ్లాడు. కొద్దిసమయంలోనే ఆయనలోని ప్రతిభను గమనించాడు. తిరిగి సత్రానికి చేరాడు. మరుసటి రోజు ఉదయమే వర్ధనుడు రాజధానికి చేరి రాజును కలిశాక.. ‘ప్రభూ.. మీ ఆస్థాన పండితుడి వల్ల నాకు మీ చేతుల మీదుగా సత్కారం అందుకొనే అదృష్టం దక్కింది. అందుకు మీకు కృతజ్ఞుడిని. అయితే, నాదొక మనవి. ప్రయాణం మధ్యలో ఒక కుగ్రామంలో జయంతుడనే పండితుడిని కలిశాను. ఆయన నాకంటే ప్రతిభ ఉన్నవారిగా అనిపించింది. మీకు అభ్యంతరం లేకపోతే, నాకంటే ముందుగా ఆయనకు సన్మానం చేయగలరు’ అని విన్నవించుకున్నాడు.

జయసింహుడు నవ్వి.. భటులను పంపించి, జయంతుడిని ఆస్థానానికి రప్పించాడు. తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఈరోజు నాకు ఆనందంగా ఉంది. ముగ్గురు పండితులను సన్మానించుకోనున్నాం. అందులో ఒకరు మన ఆస్థానకవి విశ్వనాథుడు, రెండో వారు విశ్వనాథుని మెప్పుపొందిన వర్ధనుడు, మూడో వ్యక్తి వర్ధనుడి మెప్పుపొందిన జయంతుడు’ అని రాజు ప్రకటించగానే.. అందరూ చప్పట్లు కొట్టారు. జయసింహుడు ముగ్గురినీ ఘనంగా సన్మానించాడు.

ఆ తర్వాత.. ‘ఈ సన్మాన కార్యక్రమం నాకెంతో సంతృప్తినిచ్చింది. ఎందుకంటే, ఈ ముగ్గురూ సహృదయులు. ఇసుకరేణువంతైనా అసూయ లేనివారు. తోటి కళాకారులను ప్రోత్సహించే గుణం కలవారు. మొదట మన ఆస్థాన కవి వర్ధనుడిలోని ప్రతిభను గుర్తించి, నా దృష్టికి తీసుకొచ్చారు. అలానే వర్ధనుడు కూడా జయంతుడి గురించి తెలుసుకొని, తనకు బదులుగా అతనికి సన్మానం చేయమని అభ్యర్థించాడు. సహజంగా మనుషుల్లో అసూయ ఉంటుంది. వీరు దానికి అతీతంగా అనిపించారు. ఇతరుల్లోని ప్రతిభను గుర్తించి, అంగీకరించగలిగిన వారే నా దృష్టిలో నిజమైన గొప్పవారు. ఈ పండితులు తమ రచనల ద్వారా ప్రజలకు జ్ఞానాన్ని పంచుతున్నారు. ఇకమీదట విశ్వనాథుడితోపాటు వీరిద్దరూ మన ఆస్థానంలోనే ఉంటారు’ అని రాజు అనడంతో.. అందరూ సంతోషించారు.  

గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని