పెన్సిళ్లు తీసిందెవరు?

అదొక ప్రాథమిక పాఠశాల. అయిదో తరగతి గదిలో సునంద టీచర్‌ క్లాస్‌ చెబుతున్నారు. కొన్ని లెక్కలను బోర్డు మీద చేసి, పిల్లలందరినీ నోటు పుస్తకాల్లో రాసుకోమని చెప్పారు. అంతలోనే ‘నా పెన్సిల్‌ పోయింది టీచర్‌..’ అంటూ చేతన్‌ కంగారుగా లేచి చెప్పాడు.

Updated : 30 Sep 2023 05:21 IST

దొక ప్రాథమిక పాఠశాల. అయిదో తరగతి గదిలో సునంద టీచర్‌ క్లాస్‌ చెబుతున్నారు. కొన్ని లెక్కలను బోర్డు మీద చేసి, పిల్లలందరినీ నోటు పుస్తకాల్లో రాసుకోమని చెప్పారు. అంతలోనే ‘నా పెన్సిల్‌ పోయింది టీచర్‌..’ అంటూ చేతన్‌ కంగారుగా లేచి చెప్పాడు. తరగతి గదిలోని పిల్లలంతా రాయడం మాని, తన వైపు చూశారు. టీచర్‌ కూడా చేతన్‌ వైపు చూస్తూ.. ‘ఎప్పుడు పోయింది?’ అని అడిగారు. ‘ఉదయం బడికి వచ్చే వరకూ ఉంది టీచర్‌.. ఇప్పుడు రాసుకుందామని బ్యాగ్‌లో చూస్తే కనిపించలేదు. మొన్నొకటి, నిన్నొకటి కూడా పోయాయి. ఈ రోజు ఉదయమే మా నాన్న.. కొత్త పెన్సిల్‌ నా చేతికి ఇస్తూ జాగ్రత్తగా ఉండమని కోప్పడ్డారు. భయంగా ఉంది టీచర్‌..’ ఏడుస్తూ చెప్పాడు చేతన్‌.

‘ఏడిస్తే పోయిన వస్తువు తిరిగి రాదు. వెతికితేనే దొరుకుతుంది. పిల్లలూ.. మీ బ్యాగుల్లో ఒకసారి చూడండి. పొరపాటున కలిసిందేమో! ఒకవేళ ఉంటే.. తిరిగి చేతన్‌కు ఇచ్చేయండి’ అని టీచర్‌ చెప్పడంతో పిల్లలంతా వెతికారు. కానీ, పెన్సిల్‌ కనబడలేదు. తరగతి గది మొత్తం తిరుగుతూ.. చేతన్‌ పక్కనే కూర్చున్న నవీన్‌ వద్ద రెండు పెన్సిళ్లు ఉండటం చూసి, ఒక్కసారిగా ఆగారు టీచర్‌. ‘నవీన్‌.. ఆ రెండు పెన్సిళ్లూ నీవేనా?’ అని అడిగారు. వెంటనే నిలబడి ‘అవును టీచర్‌! ఒకటి పోతే మరొకటి ఉంటుందని ఎప్పుడూ రెండు తెచ్చుకుంటాను. అంతేకాదు.. పోగొట్టుకున్న చేతన్‌ లాంటి వాళ్లకి కూడా ఇవ్వొచ్చని రెండు పెన్సిళ్లు తెస్తాను’ అని జవాబిచ్చాడు.

వెంటనే ఆ రెండో పెన్సిల్‌ను రాసుకోమంటూ.. టీచర్‌ చూస్తుండగానే చేతన్‌కు ఇచ్చాడు. ‘తోటి వారికి సాయం చేసే నీ గుణం గొప్పది. పిల్లలూ.. చప్పట్లు కొట్టి నవీన్‌కు అభినందనలు చెప్పండి’.. అని టీచర్‌ అనగానే పిల్లలంతా చప్పట్లు కొట్టారు. నవీన్‌ ఇచ్చిన పెన్సిల్‌తో రాసుకుంటూ.. ‘టీచర్‌.. ఈ పెన్సిల్‌ నాదే!’ అని చేతన్‌ గట్టిగా అనడంతో తన దగ్గరకు వెళ్లారు టీచర్‌. ‘ఎలా చెబుతున్నావు?’ అని అడగడంతో.. ‘నా పెన్సిల్‌ కూడా ఇలా ఎరుపు, నలుపు చారలతో ఉంటుంది. ఇది నాదే టీచర్‌’ అన్నాడు చేతన్‌. ‘ఇక్కడ చాలామంది పెన్సిళ్లు నువ్వు చెప్పిన రంగుల్లోనే ఉంటాయి. అవన్నీ నీవైపోతాయా?’ అంటూ సున్నితంగా మందలించారామె. దాంతో దీనంగా మొహం పెట్టి, బోర్డు మీదున్న లెక్కలను రాసుకోసాగాడు. కాసేపయ్యాక.. ‘మూడో పెన్సిల్‌ కూడా పోయిందని తెలిస్తే.. మా నాన్న కొడతారు టీచర్‌..’ అంటూ ఏడుపు ముఖం పెట్టాడు. ‘బాధపడకు చేతన్‌.. ప్లే గ్రౌండ్‌లో కూడా వెతుకుదాం’ అంటూ టీచర్‌ ఊరడించారు.

పిల్లలంతా లెక్కలు రాసుకోవడం పూర్తయింది. ‘పెన్సిల్‌ తిరిగి నవీన్‌కు ఇచ్చేశావా?’ అని చేతన్‌ను అడిగారు టీచర్‌. ఇచ్చేశానని అనగానే.. ‘థాంక్స్‌ చెప్పావా మరి?’ మళ్లీ అడిగారామె. ‘చెప్పాను టీచర్‌..’ జవాబిచ్చాడు చేతన్‌. ‘గుడ్‌.. ఇప్పుడు, చేతన్‌ నీకిచ్చిన పెన్సిల్‌ను తిరిగి ఇచ్చెయ్‌’ అని నవీన్‌ను టీచర్‌ అనడంతో.. వారిద్దరితో సహా తరగతిలోని పిల్లలంతా ఆశ్చర్యంగా చూశారు. ‘ఇది నా పెన్సిల్‌ కదా టీచర్‌.. చేతన్‌కు ఎందుకివ్వాలి?’ అని అయోమయంగా అడిగాడు నవీన్‌. టీచర్‌ తన దగ్గరకు వెళ్లి.. ‘నీ అంతట నువ్వే తప్పు ఒప్పుకొంటావని ఇంతసేపు చూశాను. విరామ సమయంలో మీరంతా బయటకు వెళ్లినప్పుడు.. చేతన్‌ బ్యాగ్‌ను తెరిచాను. తన పెన్సిళ్లు ఎవరు తీస్తున్నారో కనిపెట్టేందుకు, తన పెన్సిల్‌ చివరి భాగంలో కొద్దిగా చెక్కి, బ్యాగులోనే పెట్టేశాను. ఆ తర్వాత అదే పెన్సిల్‌ను నీదంటూ.. నువ్వు చేతన్‌కు ఇవ్వడం కూడా గమనించాను. అంటే.. ముందు పోయిన రెండు పెన్సిళ్లు కూడా నువ్వే తీశావు కదా?’ అని టీచర్‌ గట్టిగా అడిగేసరికి.. భయపడుతూనే అవునన్నాడు నవీన్‌.

‘నీ దగ్గర పెన్సిల్‌ ఉండగా.. ఎందుకలా తీస్తున్నావు? అలా చేయడం తప్పు కదా..’ అన్నారు టీచర్‌. ‘సరదాగా ఆట పట్టించాలని తీశాను’ అని జవాబిచ్చాడు నవీన్‌. ‘చిన్నతనంలో ఒకరిని ఆకతాయిగా, అకారణంగా తిట్టడం, వారి వస్తువులు తీసి ఏడిపించడం సరదాగానే అనిపిస్తుంది. కానీ, పెద్దయ్యాక అవే అలవాట్లుగా మారతాయి. జీవితాన్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. అందుకే, మొక్కయి వంగనిది మానై వంగదంటారు. ఇందాక పెన్సిల్‌ ఇచ్చి సాయం చేశావని, అందరితో చప్పట్లు కొట్టించాను. ఇప్పుడు తప్పు చేస్తే ఊరుకుంటానని అనుకోకు. మిగతా రెండు పెన్సిళ్లు కూడా రేపు తీసుకొచ్చి చేతన్‌కు ఇవ్వు.. అర్థమైందా?’ అని టీచర్‌ గట్టిగా చెప్పడంతో ‘అలాగే టీచర్‌.. ఇంకెప్పుడూ ఇలా చేయను’ అని బదులిచ్చాడు నవీన్‌. తన పెన్సిల్‌ దొరికినందుకు ఆనందిస్తూ.. టీచర్‌కు థాంక్స్‌ చెప్పాడు చేతన్‌.

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు