మీ తోటలు.. మన తోటలు!

పూర్వం ఒక ఊరిలో జగ్గభూపతి అనే పెద్ద రైతు ఉండేవాడు. గుట్టల మధ్యలో ఉన్న వంద ఎకరాల భూమిలో రకరకాల పూల తోటలు సాగు చేసేవాడు.

Published : 01 Oct 2023 00:06 IST

పూర్వం ఒక ఊరిలో జగ్గభూపతి అనే పెద్ద రైతు ఉండేవాడు. గుట్టల మధ్యలో ఉన్న వంద ఎకరాల భూమిలో రకరకాల పూల తోటలు సాగు చేసేవాడు. పూల అమ్మకంతో మంచి లాభాలు వచ్చేవి. అయితే, ఆయనకో కొడుకు ఉన్నాడు. పోషించే స్తోమత ఉండటంతో పేదింటికి చెందిన ఇంకో బాబును దత్తత తీసుకోవాలని అనుకున్నాడు. తెలిసిన వాళ్ల ద్వారా ప్రయత్నాలు కూడా ప్రారంభించాడు.

ఒకరోజు భార్యాభర్తలిద్దరూ పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు. ఓ మధ్య వయసు మహిళ పని కోసం అక్కడికి వచ్చింది. తనతోపాటు ఇద్దరు చిన్న బాబులనూ తీసుకొచ్చింది. వారి పేర్లు హిమాచలం, వెంకటాచలం అని చెప్పింది. పేదరికం వల్ల ఇద్దరు పిల్లలను పోషించలేకపోతున్నానని వాపోయింది. కవల పిల్లలైన వారిలో ఒకరిని దత్తత ఇవ్వడానికి సిద్ధమని తెలిపింది. ఇద్దరిలో నచ్చిన పిల్లవాడిని తీసుకొమ్మని కోరింది.

జగ్గభూపతి దంపతులు.. వారిద్దరినీ అక్కడే పొలం గట్టుపైన కూర్చోబెట్టారు. తోటలోని జామకాయలు కొన్ని కోసిచ్చి తినమన్నారు. సంతోషంగా, గబగబా తినేశారు. ‘మీకు ఏ ఆటలంటే ఇష్టం, ఏ పాటలంటే ఇష్టం?’ అని అడిగి తెలుసుకున్నాడా రైతు. ‘మీకు ఏ కూరలంటే ఇష్టం, ఏ పండ్లంటే ఇష్టం?’ అని అతడి భార్య అడిగింది. వచ్చీరాని మాటలతో ముచ్చటగా సమాధానాలిచ్చిన ఆ పిల్లలను చూశాక.. వాళ్లకు ఇద్దరినీ దత్తత తీసుకోవాలనిపించింది. కానీ, అందుకు వాళ్లమ్మ ఒప్పుకోకపోవడంతో ఒక్కరినే ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. కాస్త బాధపడినా.. తప్పదు కాబట్టి అందుకు అంగీకరించారా రైతు దంపతులు.

మొదటగా హిమాచలాన్ని భుజాల మీదకు ఎక్కించుకున్న జగ్గభూపతి.. పక్కనే ఉన్న చిన్న గుట్ట మీదకు తీసుకెళ్లాడు. దూరం నుంచి చూపిస్తూ.. ‘కనిపిస్తున్న ఆ గులాబీ తోటలెలా ఉన్నాయి?’ అని అడిగాడు. ఆ పిల్లవాడు ఉత్సాహంగా ‘మీ గులాబీ తోటలు భలే ఉన్నాయి’ అన్నాడు. కాసేపు ఆ బాబుతో కబుర్లు చెప్పాక.. కిందికి చేరాడు. ఈసారి వెంకటాచలాన్ని భుజాల మీద ఎక్కించుకుని మరో పక్కన ఉన్న గుట్ట మీదకు తీసుకెళ్లాడు. పైనుంచి చూపిస్తూ ‘ఆ తోటలెలా ఉన్నాయి?’ అని అడిగాడు. ఈ బాబూ ఉత్సాహంగా.. ‘మన తోటలు భలే ఉన్నాయి!’ అని బదులిచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆ పిల్లవాడితో అవీ ఇవీ మాట్లాడుతూ కిందికి చేరాడా రైతు. అక్కడే ఎదురుచూస్తూ ఉన్న వాళ్లమ్మతో.. వెంకటాచలాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాడు. అందుకు ఆమె సరేనంది.

అక్కడే ఉన్న భార్యకు అర్థం కాక.. ‘ఇద్దరు పిల్లలూ బాగున్నా, మీరెందుకు వెంకటాచలాన్నే ఎంపిక చేశారు?’ అని భర్తని అడిగింది. ఆయన నవ్వుతూ.. ‘‘మన తోటల్ని చూసిన హిమాచలం ‘మీ తోటలు’ అన్నాడు. అదే వెంకటాచలం ‘మన తోటలు’ అని అభిమానంగా చెప్పాడు. ‘మీ’ అనే పదానికీ, ‘మన’ అనే పదానికీ చాలా తేడా ఉంది. ‘మీ’ అనే పదంలో వేరు భావం ఉంది. ‘మన’ అనే పదంలో అందరినీ కలుపుకెళ్లే తత్వం, బాధ్యతను తీసుకునే స్వభావం కనిపించాయి. అందుకే.. మనకు, మన కుటుంబానికి వెంకటాచలమే తగిన వాడిగా అనిపించాడు’’ అని వివరించాడు.

భర్త పరిశీలన దృష్టికి ఆమె ఆశ్చర్యపోయింది. కాస్త దూరంగా నిల్చొని చూస్తున్న వెంకటాచలాన్ని దగ్గరికి పిలిచి, తన వద్ద ఉన్న చిలగడదుంపలను తినమని చేతికి అందించింది. అవి తినేశాక.. వెళ్లి ఆడుకోమని చెప్పడంతో, చెంగుచెంగున తోటల వైపు పరుగులు తీశాడా బాబు.

ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని