నక్కకు ఆశాభంగం!

హరితమాల అనే అడవికి రాజు.. సింహం. హరిణి అనే జింకను, అది మంత్రిగా నియమించుకుంది. తనను కాదని, దాన్ని మంత్రిగా నియమించుకోవడం నక్కకు అస్సలు నచ్చలేదు.

Published : 02 Oct 2023 00:25 IST

రితమాల అనే అడవికి రాజు.. సింహం. హరిణి అనే జింకను, అది మంత్రిగా నియమించుకుంది. తనను కాదని, దాన్ని మంత్రిగా నియమించుకోవడం నక్కకు అస్సలు నచ్చలేదు. ‘ఎలాగైనా జింకను మంత్రి పదవి నుంచి తప్పించాలి’ అనుకుంది. ఒకరోజు నక్క ఏనుగు నివాసం దగ్గరకు వెళ్లి... ‘ఏనుగు మామా..! ఏనుగు మామా..!’ అని పిలిచింది.

‘ఏంటి అల్లుడూ! ఉదయాన్నే ఇలా వచ్చావు. ఏదైనా అపాయం వచ్చిందా? మన అడవికి ఎవరైనా వేటగాడు వచ్చాడా?’ అని తన తొండాన్ని పైకిలేపి ప్రశ్నల వర్షం కురిపించింది ఏనుగు. ‘చెబుతాను మామా.. చెబుతాను! ఎందుకు అంత తొందర. సరదాగా ఇలా వచ్చాను. నిన్ను కలవక చాలా రోజులు అవుతోంది కదా! చూసి పోదామని వచ్చాను అంతే!’ అని వయ్యారాలు పోతూ బదులిచ్చింది నక్క.

‘ఓహో! అలాగా.. అయితే కూర్చో అల్లుడు’ అని బండరాయిని చూపించింది. ఏనుగుతో మాటలు కలుపుతూ... ‘మామా.. మామా.. మంత్రి హరిణి వేరే అడవి నుంచి వచ్చిన మృగరాజును కలవడం నేను కళ్లారా చూశాను. మన అడవికి ఏదో ప్రమాదం పొంచి ఉందనిపిస్తోంది!’ అంది నక్క. కానీ, ఏనుగు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకొని అక్కడి నుంచి నిరాశగా బయలుదేరింది నక్క.

తేనెతుట్టె కోసం ఎలుగుబంటి చింత చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. దాన్ని చూసింది నక్క. ‘ఎలుగు బావా.. ఎలుగు బావా.. ఇక్కడున్నావా? ఉదయం లేచిన దగ్గర నుంచి, అడవంతా నీకోసం గాలిస్తున్నా’ అంది. ‘ఎందుకు బామ్మర్ది.. ఏంటి పని?’ అని అడిగింది. ‘ఏం లేదు బావా.. నిన్ను చూసి, మాట్లాడి వెళ్దామని వచ్చాను’ అంది. ఎలుగుబంటితో కూడా మాటలు కలుపుతూ.. ‘మొన్న మన మంత్రి హరిణి.. ఒక వేటగాడితో మాట్లాడడం చూశాను. అది మన అడవికి ఏదో ఆపద తెచ్చి పెడుతుందనిపిస్తోంది’ అంది నక్క. ఎలుగుబంటి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తన పాచిక పారనందుకు నిరాశగా.. ‘వస్తాను బావా.. కాస్తంత పని ఉంది’ అని మెల్లగా వెళ్లిపోయింది నక్క.

ఏనుగు, ఎలుగుబంటి పట్టించుకోకపోవడంతో అడవికి రాజైన సింహాన్నే కలవాలని నిశ్చయించుకుంది నక్క. అనుకున్నదే తడవుగా రాజు దగ్గరికి బయలుదేరింది. దూరం నుంచి గమనించిన సింహం. నక్కను ఆహ్వానించింది. పక్కనే మంత్రి హరిణి కూడా ఉంది. ‘మహారాజా! అడవికి ప్రమాదం పొంచి ఉంది’ అంది నక్క. ‘ఈ అడవికి ప్రమాదమా! ఏం జరిగిందో వివరంగా చెప్పు’ అంది సింహం.

‘మీతో ఏకాంతంగా మాట్లాడాలి’ అంది నక్క. మంత్రి హరిణిని కాసేపు బయట ఉండమని చెప్పింది రాజు. ‘రాజా! మన మంత్రి ఒకరోజు పక్క అడవి నుంచి వచ్చిన సింహంతో మాట్లాడడం చూశాను. మన అడవి ప్రాణులన్నీ భయంతో బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నాయి. మరో రోజు వేటగాడితో మాట్లాడడం కూడా చూశాను. అందుకే అడవిలో పక్షుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. విషయం ఏనుగు మామకు, ఎలుగు బావకు కూడా చెప్పాను. అవి ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నాయి. నాకు వాటిపై కూడా అనుమానంగా ఉంది. మీరే అడవిని కాపాడాలి’ అంది నక్క.  సింహం వెంటనే ఏనుగు, ఎలుగు, మంత్రి హరిణిని పిలిపించింది. ‘నాకు పదవి ఖాయం’ అని మనసులోనే అనుకొని సంతోషపడింది నక్క. సమావేశం మొదలైంది. అన్ని జంతువులు ఏమి జరిగిందో తెలియక అయోమయంగా చూస్తున్నాయి. సింహం లేచి మాట్లాడుతూ... ‘నక్కను కారాగారంలో బంధించండి’ అంది. ఆ మాటలు విన్న నక్కకు గుండెలో రాయిపడ్డట్లు అయింది. ‘మహారాజా! అడవి క్షేమం కోరి నేను మీ దగ్గరికి వచ్చి నిజాన్ని చెబితే, నన్ను బంధించమంటారా?’ అని ప్రశ్నించింది నక్క.

‘‘మంత్రి హరిణి నా అనుమతితోనే మరో సింహం, వేటగాడితో తన ప్రాణాలకు తెగించి వెళ్లి మాట్లాడింది. జరిగిన సంగతి అంతా సాయంత్రమే చెప్పింది. సరదా కోసం వేటాడి చిన్ని జీవుల ప్రాణాలను తీయడం క్షమించరాని నేరం అని చెప్పి ఆ మరో సింహం మనసు మార్చింది. ఇప్పుడు ఆ సింహం కేవలం ఆకలైనప్పుడు మాత్రమే వేటాడుతోంది. వేటగాడితోనేమో... ‘పక్షులు, జంతువులను వేటాడటం చట్టరీత్యా నేరం. మీరు ఏదైనా పని చేసుకుని జీవించండి. అడవిలో మరోసారి కనిపిస్తే దండన తప్పదు’ అని నా మాటగా చెప్పి, వేటగాడి బారి నుంచి జంతువులు, పక్షులతో పాటు నిన్ను కూడా కాపాడింది. మంత్రికి ఏనుగు, ఎలుగుబంటి సహాయ సహకారాలు అందించాయి. అలాంటి వాటి మీదనే చాడీలు చెప్పడానికి వచ్చావా? నీ స్వార్థ బుద్ధి నాకు తెలుసు. నీపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. మారుతావేమో అని ఎదురు చూశాను. కానీ మారలేదు. అందుకే నీకు శిక్ష విధిస్తున్నాను’ అని గర్జించింది సింహం.

‘మహారాజా..! నన్ను మన్నించండి. మంత్రి పదవిపై ఆశతో ఇలా చేశాను. ఇక నుంచి బుద్ధిగా ఉంటాను’ అని వేడుకుంది నక్క. మంత్రి, ఏనుగు, ఎలుగు కూడా నక్కను ఈ ఒక్కసారి మన్నించమని కోరాయి. అసలు విషయం తెలుసుకోకుండా నిందలు వేయడం మంచిది కాదు. పదవి అనేది నీతి, నిజాయతీతో సంపాదించుకోవాలి. మన పనులు మనం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేస్తూ వెళితే పదవులు వాటంతట అవే వస్తాయి. ఇకనైనా జాగ్రత్తగా ఉండు’ అంది సింహం. హరిణికి, ఏనుగుకు, ఎలుగుబంటికి క్షమాపణలు చెప్పింది. నక్క మనసు మార్చుకుని అన్ని జంతువులతో కలివిడిగా మెలగసాగింది.            

ముక్కామల జానకీరామ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని