చిన్నూ రాయడం నేర్చుకున్నాడోచ్‌!

చిన్నూ ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. చాలా తెలివైనవాడు. టీచర్‌ ఏది చెప్పినా వెంటనే గ్రహిస్తాడు.

Published : 03 Oct 2023 00:07 IST

చిన్నూ ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. చాలా తెలివైనవాడు. టీచర్‌ ఏది చెప్పినా వెంటనే గ్రహిస్తాడు. చెప్పింది చెప్పినట్లుగా అప్పజెప్పేస్తాడు. కానీ వచ్చిన చిక్కల్లా రాయడమంటే అస్సలు ఇష్టం ఉండదు. ‘పిల్లలందరూ రాస్తుంటే నువ్వు చూస్తూ కూర్చుంటున్నావు. అసలు క్లాస్‌ వర్క్‌ చేయడం లేదు’ అని టీచర్‌ అనడంతో బిక్క ముఖం వేశాడు చిన్నూ.

‘చిన్నూ! నువ్వు ఇలాగే ఉంటే... మీ అమ్మానాన్నకు నీ గురించి చెబుతాను’ అని మందలించారు టీచర్‌. ఏం సమాధానం చెప్పాలో తెలియక అలాగే ఉండిపోయాడా బాబు. ఇంతలో హోమ్‌వర్క్‌ బుక్స్‌లో చేతిరాత చిన్నూది కాదని గుర్తించారు టీచర్‌. అమ్మానాన్న రాసుంటారని భావించి, ఎలాగైనా సరే తనలో మార్పు తీసుకువచ్చి.. రాయడంపై ఆసక్తి పెంచాలనుకున్నారామె.

‘పిల్లలూ! ఈ రోజు మనం ఒక ఆట ఆడుకుందామా?’ అన్నారు టీచర్‌. ‘ఓ...! ఆడుకుందాం మేడం’ అని అందరూ ఒక్కసారిగా అన్నారు. ‘బాబీ! ఇలా రా’ అని పిలిచారు టీచర్‌. బాబీ టీచర్‌ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ‘శ్వేతా.. నువ్వు బాబీ వీపు మీద వేలితో ఏ, బీ, సీ, డీ... లు రాయాలి. అది ఏ అక్షరమో తను చెప్పాలన్నమాట’ అన్నారు టీచర్‌. శ్వేత ఒక్కో అక్షరం రాస్తుంటే.. చేతి కదలికలను బట్టి వాటిని గుర్తించసాగాడు. పిల్లలందరికీ ఆ ఆట బాగా నచ్చింది. ఇప్పుడు చిన్నూ వంతు వచ్చింది. అతని వీపు మీద బాబీ అక్షరాలు రాస్తున్నాడు కానీ, చిన్నూ వాటిని గుర్తించలేకపోతున్నాడు. అది అవమానంగా అనిపించి ఏడుపు ముఖం పెట్టడాన్ని టీచర్‌ గమనించారు.

‘చిన్నూ! నీకు ఈ ఆట నచ్చలేదు కదా? నీ కోసం మరో ఆట చెబుతాను. ఇదిగో మీకు కొన్ని రంగులు ఇస్తాను. అందులో మీ వేళ్లు ముంచి రఫ్‌ నోట్స్‌లో, నేను చూపించినట్లు వేలి ముద్రలు వేయండి... సరేనా?’ అన్నారు టీచర్‌. చిన్నూ చకాచకా రంగురంగుల వేలిముద్రలు వేస్తున్నాడు. ‘పిల్లలూ! ఇప్పుడు మీరు ఈ రంగులతో ఒక్కో అక్షరం ఒక్కో కలర్‌తో రాయండి’ అన్నారామె. చేతులకు ఉన్న రంగులు చూసుకుంటూ... చిన్నూ కూడా అక్షరం రాయడానికి ఆసక్తి చూపించాడు. కానీ అందరు పిల్లల్లాగా ఎక్కువ సేపు రాయలేకపోయాడు.

‘చిన్నూ! రాస్తూ రాస్తూ ఉంటే చేతి వేళ్లు గట్టిపడి బలం పుంజుకుంటాయి. వాళ్లందరికీ రోజూ అక్షరాలు రాసే అలవాటుండటం వల్ల వారు అలసిపోవడం లేదు’ అన్నారు టీచర్‌. చిన్నూ ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. ‘సరే! అందరూ చేతులు కడుక్కుని రండి’ అన్నారు టీచర్‌. పిల్లలందరూ తరగతి గది బయటకు వెళ్లి చేతులు కడుక్కుని వచ్చారు. మరుసటి రోజు.. ‘పిల్లలూ.. మీకు ఇష్టమైన పేరు మీరు చెబితే, దాని స్పెల్లింగ్‌ను బోర్డు మీద రాస్తాను. సరేనా?’ అంటూ అందరికీ కొత్త క్రెయాన్స్‌ను ఇచ్చారు టీచర్‌. ఒక్కొక్కరు ఒక్కో పేరు చెబుతుంటే, టీచర్‌ వారికి స్పెల్లింగ్‌ చెబుతూ రాయించారు. పిల్లల ముఖాలు విజయగర్వంతో వెలిగిపోతున్నాయి. చిన్నూ వాళ్ల అమ్మ పేరు రాసి మురిసిపోయాడు. తరువాత రోజు పిల్లలతో టీచర్‌ గాలిలో వేలితో, నీటి తడి అద్ది వేలితో నేల మీద అక్షరాలు రాయించారు. చిన్నూతో సహా అందరూ చాలా సరదాగా రాస్తున్నారు.

‘టీచర్‌! మా అమ్మను అడిగి మీ పేరు నేనే రాశాను. రెండు రోజుల తరువాత రఫ్‌ బుక్‌ చూపిస్తూ అన్నాడు చిన్నూ. అందులో ‘టీచర్‌’ అని రాసి ఉంది. ‘వెరీ గుడ్‌ చిన్నూ! ఇప్పుడు నీకు రాయడం నచ్చుతోందా?’ అన్నారు టీచర్‌. ‘టీచర్‌! రాయడం... ఇంత బాగుంటుందని నాకు తెలియదు. నా హోమ్‌వర్క్‌ మా అమ్మతో రాయించే వాణ్ని. ఇక నుంచి అలా చేయను’ అన్నాడు చిన్నూ. ‘చిన్నూ! రోజూ బడిలో ఇచ్చిన హోమ్‌వర్క్‌ నువ్వు చేయడం లేదు. ఆ రాత నీది కాదని నాకు తెలుసు. ఇప్పుడు నిజాయతీగా చెప్పావంటే నువ్వు మంచి అబ్బాయివి. ఏదైనా రాస్తూ ఉంటేనే అది మన మెదడులో నిలిచిపోతుంది. చదివినదాని కన్నా రాసిందే ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది’ నవ్వుతూ అన్నారు టీచర్‌.
‘టీచర్‌! అయితే నేను బాగా రాస్తాను...’ ఆనందంగా అన్నాడు చిన్నూ. చిన్నూ రాయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు వాళ్లమ్మ ఆనందంతో.. తరగతిలోని పిల్లలందరికీ క్రెయాన్స్‌, డ్రాయింగ్‌ పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. ‘అక్షరాలు రాస్తుంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా!’ అని చిన్నూ అందరితో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆ మాటలు విన్న టీచర్‌ ఎంతో సంతోషించారు.

 కేవీ సుమలత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు