నక్క ఆట కట్టించిన కుందేలు!

ఉదయాన్నే నిద్ర లేచింది నక్క. ఆహారం కోసం అడవిలోకి బయలుదేరింది. దానికి ఎక్కడా తిండి దొరక్కపోవడంతో నీరసంగా ఒక చెట్టు కిందకు చేరింది.

Updated : 04 Oct 2023 04:08 IST

ఉదయాన్నే నిద్ర లేచింది నక్క. ఆహారం కోసం అడవిలోకి బయలుదేరింది. దానికి ఎక్కడా తిండి దొరక్కపోవడంతో నీరసంగా ఒక చెట్టు కిందకు చేరింది.

‘నిన్నటిదాకా మృగరాజు నీడలో ఆహారానికి ఏ లోటూ లేదు. చిన్నజీవులు నన్ను చూస్తేనే భయపడేవి. మృగరాజు తర్వాత నేనే అనేంత స్థాయిలో బతికాను. సింహం పక్కన నిలబడితే ఆ దర్జా, గౌరవం వేరు. అదంతా గతం. ఇప్పుడు ఏ జంతువూ నన్ను లెక్క చేయటం లేదు. ఆహారం కోసం చెట్టూ పుట్టా అనే తేడా లేకుండా తిరగాల్సి వస్తోంది. అత్యాశకు పోయి మా జాతి జిత్తులను సింహం మీద ప్రయోగించాను. దాంతో అది నన్ను దూరం పెట్టింది. మృగరాజుతో ఉండగా, నన్ను ప్రసన్నం చేసుకునేందుకు జంతువులన్నీ ఆరాటపడేవి. ఇప్పుడు చిన్న జీవులు సైతం నా ముందు ధైర్యంగా తిరుగుతున్నాయి. పైగా నన్ను చూసి నవ్వుకుంటున్నాయి. సింహాన్ని కలిసి క్షమాపణలు కోరదామంటే, నా మీద ఆగ్రహంతో ఉంది. ఇదే అడవిలో పోయిన పరువును తిరిగి సంపాదించాలి. మళ్లీ సింహానికి దగ్గరై.. అడవిలో పూర్వవైభవాన్ని తిరిగి పొందాలి’ అని మనసులోనే అనుకుంది నక్క.  
అనుకున్నదే తడవుగా చెట్టు కింద నుంచి లేచి, నడక సాగించింది. కాస్త దూరం వెళ్లగానే ఓ పక్క నుంచి చిన్నజీవుల మాటలు వినపడసాగాయి. చెట్ల చాటునే ఉండి వాటి మాటలు వినసాగింది నక్క. అవన్నీ తన కోసమే సమావేశం అయ్యాయని దానికి అర్థమైంది. వాటి బిడ్డల చావుకు కారణమైన నక్కను అడవి నుంచి తరిమేయాలని తీర్మానించాయవి. అది చూసిన నక్కకు వాటి మీద పట్టరాని కోపం వచ్చింది. కానీ, దాని పరిస్థితి బాగోలేకపోవడంతో ఊరుకుంది. అక్కడి నుంచి బయటపడి, ‘ఎలాగైనా చిన్నజీవుల మీద ప్రతీకారం తీర్చుకోవాలి’ అని అనుకుంటూ అడవిని ఆనుకొనే ఉన్న గ్రామానికి చేరుకుంది.

ఒకచోట కొత్తగా కట్టిన ఇంటికి రంగులు వేస్తున్నారు. పనివాళ్ల చేతుల్లో ఆ రంగులున్న డబ్బాలు దానికి కనిపించాయి. మధ్యాహ్నం వేళ కావటంతో కూలీలు పని ఆపేసి, డబ్బాలను పక్కనపెట్టి భోజనాల కోసం చెట్టు కిందకు చేరారు. తిన్నాక కాసేపు కునుకు తీశారు. ఇంతలో నక్కకు ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. రంగులు పూసుకుని కొత్త అవతారం ఎత్తి, చిన్నజీవులకు తగిన బుద్ధి చెప్పొచ్చనుకుంది. అడుగులో అడుగు వేసుకుంటూ రంగు డబ్బాల దగ్గరకు వెళ్లింది. బలాన్నంతా ఉపయోగించి డబ్బాల్లోని రంగులను కింద పారబోసి, అందులో పొర్లాడింది. అక్కడే ఉన్న అద్దంలో చూసుకుంది. రూపురేఖలు మారిపోవడంతో, ఇక దాన్నెవరూ గుర్తించరనుకొని అడవికి చేరింది.

దాన్ని చూసిన జీవులన్నీ భయపడ్డాయి. దాని శరీరంపైన రంగులు విచిత్రంగా కనిపించాయి. ఒక్కో రంగు ఒక్కో జంతువును పోలి ఉంది. అది ఏ జంతువో, దాని పేరేంటో.. అడుగుదామంటే వాటికి ధైర్యం సరిపోలేదు. అడవిలోకి కొత్తగా మరో జంతువు వచ్చిందని ఆ నోటా ఈ నోటా సింహం చెవిన పడింది. అది వెంటనే నక్క ఉన్న ప్రదేశానికి చేరుకుంది. ఒక్క క్షణం దాన్ని ఎగాదిగా చూసింది. సింహానికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కానీ, నక్క మాత్రం సింహాన్ని చూసి లోలోపల భయపడసాగింది. తన అసలు రంగు బయటపడితే ఎలాంటి శిక్ష విధిస్తుందోనని ఆందోళన చెందింది. ఇంతలో కుందేలు అక్కడకు వచ్చింది. ‘మృగరాజా.. మీరేంటి ఇలా వచ్చారు?’ అని అడిగింది. అడవిలోకి వచ్చిన వింత జంతువును చూసేందుకు వచ్చానని సమాధానమిచ్చిందది.

కుందేలు కూడా దగ్గరగా వెళ్లి నక్కను పరిశీలించింది. దాని చుట్టూ ఒకసారి తిరిగింది. తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని నక్క లోలోపలే భయపడసాగింది. కుందేలు తెలివితేటలు దానికి తెలియనివి కావు. ఇంతలో కుందేలు ‘మృగరాజా..!’ అని గట్టిగా అరిచింది. ఏంటని ప్రశ్నించిందది. దానికి కుందేలు.. ‘ఇది మీరు తన్ని తరిమేసిన నక్కే’ అంది. ‘మరి ఆ రంగులేంటి?’ అని అమాయకంగా ప్రశ్నించింది సింహం. ‘మృగరాజా.. మనల్ని భయపెట్టాలని అదే ఏదో చేసి ఉంటుంది’ అని కుందేలు అనగానే.. ‘ఇది నక్కేనని నిరూపించగలవా?’ అంది మృగరాజు. ‘చేస్తాను ప్రభూ.. నక్క ఒళ్లంతా రంగు పూసుకుంది. కానీ తోకను మాత్రం మర్చిపోయింది. ఆ తోకను చూడండి. ఇది నక్కదే’ అనడంతో.. పరిశీలనగా చూసి సింహం కూడా జిత్తులమారేనని నిర్ధారించుకుంది.

తన బండారం బయట పడటంతో రెప్పపాటులో సింహం కాళ్లపైన పడి క్షమించమని వేడుకుంది. ‘మృగరాజా.. ఆకలికి తట్టుకోలేక తప్పు చేశాను. అడవిలో పోయిన పరువు, మర్యాదలను మళ్లీ పొందాలనుకున్నాను. మరెప్పుడూ మీ మాట జవదాటను. మీకు దూరం కావటంతో అష్టకష్టాలు పడుతున్నాను’ అని వాపోయింది నక్క. అయినా, దాని మాటలను సింహం పట్టించుకోలేదు. ‘ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే తిరిగి పొందలేం. ఇంకోసారి ఈ అడవిలో కనపడితే నా పంజా దెబ్బ రుచి చూడాల్సి వస్తుంది. తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని ఆదేశించింది. ఇక చేసేది లేక నిట్టూరుస్తూ అడవిని వీడిందా నక్క.

తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని