మాటిస్తేనే.. మిఠాయిస్తా...!!

సింహళ రాజ్యానికి రాజు పుళిందుడు.. రాణి భద్రాదేవి. ఏటా రాణి పుట్టిన రోజును ఘనంగా జరిపేవాడు రాజు. ఆ సంవత్సరం కూడా భద్రాదేవి పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Published : 06 Oct 2023 00:05 IST

సింహళ రాజ్యానికి రాజు పుళిందుడు.. రాణి భద్రాదేవి. ఏటా రాణి పుట్టిన రోజును ఘనంగా జరిపేవాడు రాజు. ఆ సంవత్సరం కూడా భద్రాదేవి పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘మహారాజా.. ఏటా నా పుట్టినరోజు ఏదో ఒక వనంలో నిర్వహిస్తున్నారు. ఈసారి మనకు తూర్పు వైపునున్న కంకణ వనంలో జరుపుకోవాలని ఉంది’ అని కోరింది రాణి. ‘మహారాణీ.. కంకణ వనం అంటే అది పూలవనం కాదు. క్రూర మృగాలు ఉండే అడవి. అక్కడికి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదు’ అన్నాడు మంత్రి. ‘మహారాణి ఎప్పుడూ ఏదీ కోరలేదు. అడవి మధ్యలోకి వెళ్లకుండా ముందు భాగంలోనే వేడుకలు నిర్వహిద్దాం. అందుకు తగిన ఏర్పాట్లు చేయండి. సమీప గ్రామాల ప్రజల సహకారం తీసుకోండి’ అని ఆదేశించాడు రాజు.

సరేనంటూ ఆ వనం ప్రవేశ మార్గానికి సమీపంలో పుట్టిన రోజు చేసేందుకు అంతా సిద్ధం చేయించాడు మంత్రి. ఇతర రాజ్యాల నుంచి సైతం రాజులు, ప్రజలు వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ ప్రాంతమంతా కేకలు, అరుపులతో సందడిగా ఉండటంతో.. అడవిలోంచి మరువం అనే కోతి అక్కడికి వచ్చి చెట్టు చాటుగా చూడసాగింది. మధ్యాహ్నం భోజనాలు ముగిసిన తర్వాత.. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కోతి కూడా తిరిగి వెళ్దామనుకునేలోగా, దానికి అక్కడో గంప కనిపించింది. కుతూహలంతో దగ్గరకు వెళ్లి చూసిన కోతికి మిఠాయిలు కనిపించాయి. చటుక్కున ఒకటి నోట్లో వేసుకుంది. ‘అబ్బా.. ఎంత తియ్యగా ఉందో ఈ మిఠాయి. నేనొక్కదాన్నే తినడం కాదు, అందరికీ పంచాలి’ అనుకుంది.

ఆ గంపను నెత్తిన పెట్టుకుని అడవిలోకి బయలుదేరింది. ‘ఊరకనే పంచితే ఏముంటుంది.. ఏదైనా ప్రయోజనం కూడా ఉండాలి’ అనుకుంది. వెంటనే దాని మనసులో ఓ ఆలోచన తట్టింది. ముందుగా మృగరాజుని కలిసి ‘ప్రభూ.. మీరింత వరకూ తినని మిఠాయి తినిపిస్తా కానీ, నాకో మాట ఇవ్వాలి’ అంది మరువం. ‘ఏంటది?’ అంది సింహం. అది తరువాత చెబుతాను కానీ, ముందైతే ఇది తినండంటూ ఓ మిఠాయిని రాజుకు ఇచ్చింది. ‘ఆహా.. నిజంగానే ఇంత వరకు ఇలాంటిది తినలేదు’ అంది సింహం. ‘మరి నేను వెళ్లివస్తాను ప్రభూ.. ఇంకా మిగతా జీవులను కలవాలి’ అంటూ గంప నెత్తిన పెట్టుకుని బయలుదేరింది. దారిలో కనిపించిన కుందేలుకు కూడా ఒకటిచ్చి.. మృగరాజుని అడిగినట్లే, దాని వద్దా మాట తీసుకుంది. ‘కోతి ఏం అడుగుతుందిలే..’ అనుకుంటూ మిఠాయి తీసుకుందది.

అలా ఏనుగు, ఉడుత, కాకి, పావురం, ఎలుగుబంటి, నక్క, తోడేలుకు కూడా మిఠాయిలు ఇచ్చి మాట తీసుకుంది మరువం. ఇంతలో దానికో లేడి ఎదురైంది. ‘ఓ లేడి మామా.. మాటిచ్చి మిఠాయి తీసుకో.!’ అంది. ‘ముందు ఆ మాటేమితో చెప్పు.. అప్పుడు తీసుకుంటా’ అని జవాబిచ్చిందా లేడి. ‘ముందు తీసుకుని, మాటివ్వు. ఆ తర్వాతే చెబుతా’ అంది మరువం. ‘ఉహూ.. ముందు మాటేమిటో చెబితేనే తీసుకుంటా’ అంది లేడి. అలా అలా వాటి మధ్య చర్చ.. మృగరాజు వద్దకు చేరింది. వెంటనే వాటిని తన దగ్గరకు పిలిపించింది సింహం. ఏం జరుగుతుందోనని కుతూహలంతో మిగతా జీవులూ గుహ దగ్గరకు చేరుకున్నాయి. ‘మేమంతా మిఠాయిలు తీసుకున్నాం కదా.. నువ్వు ఎందుకు తీసుకోవడం లేదు?’ అని లేడిని ప్రశ్నించింది సింహం.

‘మృగరాజా.. మాటివ్వడం అంటే ఆషామాషీ కాదు. విషయం తెలియకుండా మాట ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే, ఎంత కష్టమైనా దాని మీదే నిలబడాలి. అంతేకానీ, ఏదో మిఠాయి పెడుతోందని మాట ఇచ్చి, తప్పడం కంటే తప్పు మరొకటి లేదు’ అని సమాధానమిచ్చింది లేడి. ‘శెభాష్‌.. మంచిమాట చెప్పావు. ఇంతకీ నువ్వు మా అందరి దగ్గరా మాట తీసుకున్నావు కదా. అదేంటో ఇప్పటికైనా చెబుతావా?’ అని కోతిని అడిగింది సింహం. ‘రాజా.. ఈ మధ్య మన అడవిలో వేటగాళ్ల అలజడి ఎక్కువైంది. ఆ విషయం కాకి బావకు తెలిసినా ఆహారం కోసం వెళ్లే తొందరలో వేరే జీవులకు చెప్పలేదు. దాంతో మన అందరి స్నేహితుడు అయిన జింక వేటగాళ్ల బారిన పడింది. మొన్నటికి మొన్న వేటగాళ్లు తీసిన గొయ్యిని ముందే కనిపెట్టడంతో ఏనుగు ప్రమాదం నుంచి బయటపడింది. అయినా, ఆ గొయ్యి విషయం ఎవరికీ చెప్పలేదు. దాంతో మనకు వైద్యం చేసే ఎలుగుబంటి అందులో పడిపోయింది. మనమంతా కలిసి చాలా కష్టంగా కాపాడాల్సి వచ్చింది. తెలిసిన విషయాలను మిగతా జీవులకు చెప్పకపోవడమే అసలు సమస్య. అందుకే మిఠాయిలు ఇచ్చి, ఒకరికొకరు సాయం చేసుకోవాలనే మాట తీసుకుందామనుకున్నా’ అని వివరించింది కోతి.

‘నిజంగా నీది మంచి మనసు. ఈరోజు నుంచి ఒకరికి తెలిసిన విషయాలను అందరితో పంచుకుందాం’ అంటూ గంపలో మిగిలిన రెండు మిఠాయిల్లో ఒకదాన్ని కోతి నోట్లో పెట్టి, ఇంకోటి లేడి తినేసింది. మృగరాజుతో సహా జంతువులన్నీ మరువానికి అభినందనలు తెలిపాయి.

కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు