శిష్యుడి అబద్ధం.. గురువు పాఠం!

విద్యానగరంలో సురేంద్రుడి ఆశ్రమం ఉంది. ఆయన గురుకులంలో విద్యతో పాటు నైతిక విలువలూ, సంప్రదాయాలూ నేర్పిస్తుంటారు. అందుకే అక్కడ విద్యనభ్యసించిన వారంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు

Published : 08 Oct 2023 01:54 IST

విద్యానగరంలో సురేంద్రుడి ఆశ్రమం ఉంది. ఆయన గురుకులంలో విద్యతో పాటు నైతిక విలువలూ, సంప్రదాయాలూ నేర్పిస్తుంటారు. అందుకే అక్కడ విద్యనభ్యసించిన వారంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. సమీప గ్రామంలో ఉండే వ్యాపారి జీవదత్తుడు, తన కుమారుడు చాణక్యుడిని అక్కడ చేర్పించాడు. తను చదువులు, ఆటల్లో చాలా చురుకైనవాడు.
ఒకరోజు గురువు వద్దకు వెళ్లి ‘మీరు అనుమతిస్తే మా ఇంటికి ఒకసారి వెళ్లివస్తాను’ అని అడిగాడు చాణక్యుడు. ‘ఇప్పుడెందుకు? అయినా, నిన్ను పంపమని మీ నాన్న నాకేం చెప్పలేదే..?’ అంటూ ప్రశ్నించారు గురువు. ‘మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదని, ఊరి నుంచి వచ్చిన రాజశేఖరుడి తండ్రి చెప్పారు. బహుశా నాకు ఆ విషయం తెలిస్తే బాధపడతానని చెప్పి ఉండరు. మీరు అనుమతిస్తే ఇంటికెళ్లి మా అమ్మను చూసి వచ్చేస్తా’ అని అడిగాడు. గురువు అనుమతితో ఇంటికి వెళ్లి, రెండ్రోజుల్లో తిరిగొచ్చాడు.
కొద్దిరోజులు గడిచాయి. ఒకరోజు తరగతులు ముగిసిన తర్వాత గురువు వద్దకు వెళ్లాడు చాణక్యుడు. ‘ఆచార్యా.. మీరు అనుమతిస్తే ఇంటికి వెళ్లి వస్తాను’ అన్నాడు. ‘సాయంత్రం ఒక తరగతి ఉంది.. అది చూసుకొని బయలుదేరొచ్చు’ అన్నారు గురువు. సాయంత్రం విద్యార్థులందరినీ తోటలో సమావేశపరిచారాయన. ‘మీరు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా శ్రద్ధగా కాపాడుకోవాలి. అప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకోగలరు’ అన్నారు గురువు. ‘దానికి మేమేం చేయాలి గురువర్యా?’ అని అడిగాడో విద్యార్థి.
‘ఇప్పుడు మీకు అదే విషయం చెప్పబోతున్నాను. అంతకంటే ముందు నాదొక ప్రశ్న.. నయం చేయలేని అంటువ్యాధి ఏది?’ అని అడిగారు. పిల్లలందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. ‘మనం ఒకటి అడిగితే, గురువు గారు ఇంకో ప్రశ్న అడుగుతున్నారేంటి?’ అని వారంతా ఒకరి ముఖం మరొకరు చూసుకోసాగారు. ఇంతలో ఒక విద్యార్థి.. చర్మవ్యాధి అనీ, మరొకరు జలుబు అనీ, ఇంకొకరు జ్వరం అని జవాబిచ్చారు. అవేవీ కాదన్నారు గురువు. ‘అయితే మీరే చెప్పండి’ అన్నారు విద్యార్థులంతా.
‘ఎవరికైనా కావాల్సింది క్రమశిక్షణ. ముఖ్యంగా విద్యార్థులకు అది చాలా అవసరం. అది అలవడాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకూడదు’ అని వివరించారు గురువు. ‘అయినా.. అది అంటువ్యాధి ఎలా అవుతుంది?’ అని అనుమానంగా అడిగాడో విద్యార్థి. ‘ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తే అది అంటువ్యాధి అవుతుంది. దానికి ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట వేయవచ్చు. కానీ, ఈ అబద్ధాలాడటం అనేది ఒకసారి మొదలు పెడితే, దానికి అంతు అనేదే ఉండదు. మనం చెప్పేది నిజం కాదని తెలిసిన క్షణాన.. ఇంకోసారి మనల్ని ఎవరూ నమ్మరు. ఒక్కసారి నమ్మకం కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం అసాధ్యం’ అంటూ హితబోధ చేశారాయన.
‘మీరు ఇప్పుడు ఇదంతా చెబుతున్నారంటే.. ఆ అంటువ్యాధి మాలో ఎవరికైనా వచ్చిందా?’ అని అడిగాడో శిష్యుడు. అవునన్నట్లు సైగ చేశారాయన. ఎవరో చెప్పమంటూ పిల్లలు బతిమిలాడారు. కానీ, గురువు చెప్పలేదు సరికదా.. ‘అబద్ధం ఆడిన వాళ్లకు ఇప్పటికే విషయం అర్థమై ఉంటుంది’ అన్నారు. తరగతి సమావేశం ముగిశాక, గురువు దగ్గరకు వెళ్లాడు చాణక్యుడు. తనని చూసి ‘నువ్వు ఇంటికి వెళ్లొచ్చు’ అని అనుమతి ఇచ్చారాయన. ‘నన్ను మన్నించండి.. నేను మీకు అలా చెప్పడానికి కారణం..’ అంటూ ఏదో చెప్పబోయాడతను. ‘ఇప్పుడు అవేం వద్దు.. ఇకపై అలా చేయవద్దు. ఈసారికి ఇంటికి వెళ్లిరా. అయినా నాకు నీ గురించి తెలుసు. ఇంటి మీద బెంగ పెట్టుకొని అబద్ధాలు చెప్పొద్దు’ అని సున్నితంగా మందలించారు. జీవితంలో మరోసారి అబద్ధం చెప్పకూడదనుకుంటూ ఆనందంగా ఇంటికి వెళ్లి వచ్చాడు చాణక్యుడు.  
సింగంపల్లి శేష సాయి కుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు