మాస్టారి మాట.. చూపెను సరైన బాట!

ఎనిమిదో తరగతి చదివే శివ రోజూ సైకిలు మీద బడికి వెళ్తాడు. అమ్మానాన్న మంచి బుద్ధులు నేర్పడం వల్ల పెద్దలు, గురువులన్నా భయం, భక్తి రెండూ ఉన్నాయి. ఒక రోజు శివ బడికి వెళ్తుండగా స్కూల్‌గ్రౌండ్‌లో నిలబడి మరెవరితోనో మాట్లాడుతున్న తెలుగు మాస్టారు కనిపించారు.

Published : 09 Oct 2023 00:09 IST

నిమిదో తరగతి చదివే శివ రోజూ సైకిలు మీద బడికి వెళ్తాడు. అమ్మానాన్న మంచి బుద్ధులు నేర్పడం వల్ల పెద్దలు, గురువులన్నా భయం, భక్తి రెండూ ఉన్నాయి. ఒక రోజు శివ బడికి వెళ్తుండగా స్కూల్‌గ్రౌండ్‌లో నిలబడి మరెవరితోనో మాట్లాడుతున్న తెలుగు మాస్టారు కనిపించారు. వెంటనే సైకిల్‌ దిగి నమస్కారం చెయ్యాలనుకున్నాడు శివ. ఆ తొందరలో దారిలో అడ్డంగా ఉన్న పెద్ద రాయిని చూసుకోలేదు. సైకిలు ముందు చక్రం దాని మీదకు ఎక్కడం, శివ కింద పడడం వెనువెంటనే జరిగిపోయాయి.

శివ నోటి నుంచి ‘నమస్కారం మాస్టారూ’ అన్న మాటతోపాటు ‘అమ్మా’ అనే అరుపు సైతం బయటకు వచ్చాయి. పక్కన ఆడుకుంటున్న వాడి స్నేహితుల్లో ఒకరు వచ్చి శివను, మరొకరు సైకిలును ఎత్తి నిలబెట్టారు. ఇదంతా చూసిన మాస్టారు గబగబా... ఆ పిల్లాడి దగ్గరకెళ్లి... ‘అయ్యో! దెబ్బ తగిలిందేమో చూడు. నాకు నమస్కారం పెట్టకపోయినా ఫరవాలేదు. దెబ్బలు తగిలించుకుంటే ఎలా? వెంటనే ఆఫీసు గదికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకో’ అన్నారు.

అలాగే మాస్టారు అంటూ నడవబోయి కుంటినట్టు అడుగు వేశాడు శివ. కిందపడ్డప్పుడు చిన్నచిన్న కంకర రాళ్లు తగిలాయి. దాంతో మోకాళ్ల దగ్గర గీరుకుని చిన్నగా రక్తం బయటకు వచ్చింది. శివ చెయ్యి పట్టుకున్న పిల్లాడు.. ‘దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది. బాధగా ఉందా?’ అనడిగాడు. ఫరవాలేదన్నట్టు తలాడించాడు శివ ముందుకు అడుగేస్తూ.

వాళ్ల మాటలు విన్న మాస్టారు... ‘దెబ్బ తగిలి రక్తం వచ్చినప్పుడు బాధగా ఉందా?.. అనకూడదు. నొప్పిగా ఉందా?... అనాలి’ అని సరిదిద్దారు. ‘సరే.. మాస్టారూ...’ అని వాళ్లు వెళ్లిపోయారు. అప్పుడే ఇద్దరు ఎనిమిదో తరగతి  విద్యార్థినులు, మాస్టారును కలసి.... ‘నిన్న మీరు చెప్పినట్టే మొక్కలు తెచ్చాం. ఇక్కడ నాటుతాం’ అని ఒక చోటు చూపించారు. ప్రార్థనకు ఇంకా సమయం ఉండడంతో సరేనన్నారు మాస్టారు వారిని గమనిస్తూ. గోతులు తవ్వి మొక్కలు నాటారు అమ్మాయిలు. గోతుల్లోని మట్టిని బయటకు తీస్తున్నప్పుడు ఒకరికి చేతికి గాయమై రక్తం కారింది.

రెండో అమ్మాయి... ‘చూసుకోవద్దా?! నీ చేతికి రక్తం వస్తోంది. బాధగా ఉందేమో కదా!’ అనడిగింది. అది విన్నారు మాస్టారు... పని చేసేటప్పుడు గాయాలు కాకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. అంతే కాదు. దెబ్బ తగిలి రక్తం వచ్చినప్పుడు బాధ అనవద్దని, నొప్పి అనాలని సరి చేశారు. అలాగేనంటూ ప్రథమ చికిత్స కోసం వెళ్లారు విద్యార్థినులు ఇద్దరూ.

ఆ రోజు మధ్యాహ్నం.. ఎనిమిదో తరగతిలో పాఠం చెబుతుండగా వెనుక బెంచీలో... మాటలు వినిపించి అటు చూశారు తెలుగు మాస్టారు. నిశ్శబ్దంగా ఉంటూ పాఠం వినాలని మాస్టారు చెప్పినా వాళ్లు మాటలు ఆపలేదు. అంత ఆసక్తిగా ఏమి మాట్లాడుకుంటున్నారో.. తెలుసుకోవాలని వాళ్ల దగ్గరకు  వెళ్లారు మాస్టారు. వాళ్లలో ఒకరు ఉదయం శివకు చెయ్యందించి లేపిన పిల్లాడు. ‘మా తాతయ్య పోయాక చాలా కష్టాలు వచ్చాయి. పెదనాన్న మోసం చేసి ఆస్తి లాగేసుకున్నారు. మా నాన్న ఎన్నో కష్టాలు పడి, మమ్మల్ని చదివిస్తున్నారు. ఆస్తి కోసం కోర్టుకెళ్లారు. కానీ అక్కడా పెదనాన్న మాయ చేశారు. ఆస్తి రాలేదు. వాళ్లకే అనుకూలంగా తీర్పు వచ్చింది’ అన్నాడు విచారంగా.  

మాస్టారుతోపాటు పిల్లలు కూడా ఆ మాటలు విన్నారు. రెండోవాడి స్పందన కోసం వేచి చూశారు వాళ్లు. ‘అయ్యో?! పెద్ద కష్టమే వచ్చిందిరా మీకు. మీరంతా చాలా బాధ పడి ఉంటారు’ అన్నాడు రెండో వాడు సానుభూతిగా. అప్పటికీ మాస్టారును గమనించలేదు వాళ్లు. ‘బాధ అనకూడదు. నొప్పి అనాలని మాస్టారు చెప్పారు కదా!’ అని సరిదిద్దాడు రెండోవాడు. మొదటి వాడు ఒప్పుకోకుండా... బాధ అనడమే సరైంది అన్నాడు. దాంతో ఒక అమ్మాయి నిలబడి... ‘అప్పుడే మరచిపోయావా? బాధ కాదు నొప్పి అనాలని ఉదయమే మాస్టారు చెప్పారు’ అంది వాళ్లకు వినబడేలా! దాంతో విద్యార్థుల్లో కొందరు నొప్పి అనాలని, మరి కొందరు బాధ అని రెండుగా విడిపోయి వాదనలు మొదలు పెట్టారు.

కాసేటికి మాస్టారు... ‘నిశ్శబ్దం’ అని గట్టిగా బల్ల మీద చరిచారు. పిల్లలంతా మాటలు ఆపేశారు. ‘మీలో మీరు ఎందుకలా వాదించుకుంటారు?’ అనడిగారు కోపంగా ఆయన. ‘మీరే కదండీ బాధ అనకూడదని, నొప్పి అనాలని చెప్పారు’ అంది మొక్కలు నాటిన ఒక అమ్మాయి. ‘ఓ.. అదా సంగతి! మీరు దేనికి ఏది పలకాలో తెలియక మాట్లాడడం విని సరిదిద్దాను. నొప్పి, బాధ రెండూ ఒకటి కాదు. వేర్వేరు సందర్భాల్లో మాట్లాడాల్సిన పదాలవి. చాలా మంది రెండూ ఒకటేనని అనుకుంటారు. తప్పుగా మాట్లాడుతుంటారు’ అన్నారు మాస్టారు.  వాటి మధ్య తేడా ఏమిటో వివరంగా చెప్పాలని పిల్లలందరూ అడిగారు. అప్పుడు మాస్టారు... ‘సరేనర్రా! వినండి. శరీరానికి దెబ్బ తగిలితే కలిగే అసౌకర్యాన్ని నొప్పి అంటాము. సైకిలు మీది నుంచి పడడంతో గాయపడిన శివకు రక్తం కారడం, మొక్కలు నాటిన సమయంలో విద్యార్థిని గాయపడడం లాంటివి. అలాంటి శారీరక అసౌకర్యాలు కలిగినప్పుడు బాధ అనకూడదు. నొప్పి అని మాత్రమే అనాలి’ అని చెప్పారు.

మరి... బాధ అనే పదం ఎప్పుడు వాడాలో చెప్పమని, పిల్లలు మళ్లీ అడిగారు. అప్పుడు మాస్టారు... ‘మనసు, హృదయానికి కష్టం కలిగించే సంఘటనలు జరిగినప్పుడు బాధ కలిగినట్టు చెప్పాలి. మోసం చేసి ఆస్తి కాజేయడం, వ్యాపారంలో నష్టపోవడం, విలువైన వస్తువులు, బంగారం, డబ్బు  పోగొట్టుకోవడం, ప్రముఖులు, దేశనాయకుల మరణం సంభవించడం మొదలైనవి జరిగినప్పుడు మనసుకు కష్టం కలుగుతుంది. అప్పుడు మాత్రమే బాధ కలిగిందని చెప్పాలి. రెంటికీ మధ్య ఉన్న తేడా ఇప్పుడైనా అర్థమైందా?’ అనడిగారు.

‘ఓ.. అర్థమైంది మాస్టారూ. ఆటలు ఆడేటప్పుడు, పనులు చేసేటప్పుడు ఏవైనా గాయాలైతే కలిగే అసౌకర్యం పేరు నొప్పి. పరీక్షల్లో మార్కులు తగ్గడం, పరీక్ష తప్పిపోవడం మొదలైన వాటి వల్ల కలిగే అసౌకర్యం పేరు బాధ’ అంది ఒక విద్యార్థిని. మిగతా పిల్లలు కూడా గొంతు కలిపారు. శభాష్‌... ఇట్టే గ్రహించారు. చదువుల్లో కూడా ఇలాగే తెలివి చూపించండి మరి’ అని నవ్వుతూ మెచ్చుకున్నారు మాస్టారు.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని