చెప్పకుండా తీస్తే అది దొంగతనమే!

ఏడుస్తూ ఇంట్లోకి వచ్చింది రాణి. అన్న రవి చెయ్యి పట్టుకుని ఉన్నాడు. అప్పటి వరకు ఎదురు చూస్తున్న వాళ్లమ్మ శాంత.. ‘ఏమైంది?’ అంది రాణి చెయ్యి పట్టుకుంటూ. ‘స్కూల్‌కు వచ్చి మా టీచర్‌ను అడుగు.

Updated : 10 Oct 2023 07:05 IST

ఏడుస్తూ ఇంట్లోకి వచ్చింది రాణి. అన్న రవి చెయ్యి పట్టుకుని ఉన్నాడు. అప్పటి వరకు ఎదురు చూస్తున్న వాళ్లమ్మ శాంత.. ‘ఏమైంది?’ అంది రాణి చెయ్యి పట్టుకుంటూ. ‘స్కూల్‌కు వచ్చి మా టీచర్‌ను అడుగు. అందరి ముందు నన్ను తిట్టారు’ అంది ఏడుస్తూనే రాణి. ‘ఎందుకు తిట్టారు? నువ్వేం చేశావు?’ అంది శాంత. సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉంది రాణి.  
‘ఏమైంది? నువ్వైనా చెప్పు’ అని రవిని అడిగింది శాంత. ‘పక్క అమ్మాయి పెన్సిల్‌ను, రాణి చెప్పకుండా తీసుకుందట. అడిగితే నాదే అందట. ఆ అమ్మాయి టీచర్‌కు ఫిర్యాదు చేసింది. దొంగతనం తప్పు కదా.. అని టీచర్‌ రాణిని కోప్పడింది. అందరి ముందు అలా అనేసరికి రాణి ఏడుస్తోంది.’ అని సమాధానం చెప్పాడు రవి.
‘రాణి దొంగతనం చేసిందా? పెన్సిల్‌్ ఆ అమ్మాయిదేనా?’ అని అడిగింది శాంత. ‘అవును.. ఆ అమ్మాయిదేనట. దాని మీద ఆ అమ్మాయి బ్లేడ్‌తో చిన్నగా తన పేరు చెక్కుకుందట.. టీచర్‌కు చూపించింది’ అని చెప్పాడు రవి. శాంత మొహం కోపంతో ఎర్రబడింది. భయపడిన రాణి ఏడుపు ఆపింది.
‘నేనేమీ దొంగతనం చేయలేదు. నా పెన్సిల్‌ పోయింది. తన దగ్గర రెండున్నాయి. ఒక పెన్సిల్‌ బల్లమీద మర్చిపోయింది. అదే నేను తీసుకున్నాను’ అంది రాణి.
‘కానీ అది ఆ అమ్మాయిది అని నీకు తెలుసుగా! అడిగినప్పుడైనా తనకు ఇవ్వాలి కదా! పైగా అబద్ధం. మళ్లీ మీ టీచర్‌ను అడగమని నాకు చెబుతావా? ఒక తప్పునకు ఎన్ని ఫిర్యాదులో! పైగా నీకు దొంగ అనే పేరు. చెప్పకుండా తీస్తే దాన్ని దొంగతనమనే అంటారు. ఇకపై క్లాసులో నీ పక్కన ఎవరూ కూర్చోరు. నువ్వు కూర్చున్నా... వద్దంటారు. ఇదంతా అవసరమా!’ అని హెచ్చరించింది వాళ్లమ్మ. రాణి వెంటనే తల దించుకుంది.
‘రేపు స్కూలుకు వెళ్లాక ఆ అమ్మాయికి, టీచర్‌కు సారీ చెప్పు. ఇక ముందు ఇలాంటివి జరిగితే మాత్రం ఊరుకోను. తెలిసిందా? నాన్నగారికి కూడా చెబుతాను’ అంది కోపంగా. రాణి భయంగా తలూపింది.
‘చూడమ్మా.. నా స్నేహితుడు రాజు ఎంత పనిచేశాడో. నోట్స్‌ కావాలంటే ఇచ్చాను. కానీ కాగితాలు చించేసి ఇచ్చాడు. రేపు నాకు ఇందులోనే పరీక్ష ఉంది. అడిగితే నన్నే తిడుతున్నాడు’ అన్నాడు రవి ఏడుపు గొంతుకతో.
పుస్తకాన్ని తీసుకుని చూసింది శాంత. రవి చెప్పింది నిజమే. గతంలో ఒకసారి అర్థం కావటం లేదంటే.. తను నోట్స్‌ చెబితేనే రవి రాసుకున్నాడు. వెంటనే రాజు వచ్చి అడిగాడు. ఇప్పుడేమో పుస్తకంలో ఆ కాగితాలు లేవు.
‘రాజు ఎందుకిలా చేస్తున్నాడు?’ అని కొడుకు రవిని అడిగింది శాంత. ‘వాడికి మార్కులు సరిగా రాకుంటే, బాగా చదివే వాళ్ల పుస్తకాలు అడిగి అలాగే చేస్తాడట. ఒకసారి బంటి బుక్‌ను కూడా అలాగే చేస్తే, టీచర్‌ తిట్టారట’ అన్నాడు.
‘రాజును నేను పిలుస్తున్నానని చెప్పి తీసుకు రా’ అంది శాంత గంభీరంగా. ‘రానంటే?!’ అని అనుమానాస్పదంగా అడిగాడు రవి. ‘రేపు వచ్చి మీ హెడ్‌ మాస్టర్‌కు కంప్లైంట్‌ ఇస్తానన్నానని చెప్పు’ అని ఆమె అనడంతో బయటకు పరిగెత్తాడు రవి. కాసేపటికి రాజు, అతని తల్లి ఇద్దరూ వచ్చారు. తల్లి చేతిలో కాగితాలు ఉన్నాయి. మా బాబు తెచ్చిన ఈ పుస్తకాన్ని, మా పాపే తెలియక చించింది. ఏమీ అనుకోకండి. స్కూల్‌లో చెప్పొద్దు’ అని రాజు తల్లి శాంతతో అంది.
‘మీరలా వెనకేసుకు రాకండి. ఒకవేళ పొరపాటున మీ పాప చించినా మీరు ఏం చేస్తున్నారు. తనకు అందేలా ఎందుకుంచారు. వేరే వాళ్ల వస్తువులు తెచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవడం కనీస బాధ్యత కదా! మార్కులు సరిగా రాకుంటే కష్టపడి చదవాలి కానీ, ఇలా వేరే వాళ్లవి పాడు చేస్తే చదువొస్తుందా?’ అంది శాంత చిరాకుగా.
రవి తన తల్లి శాంతకు.. విషయం మొత్తం చెప్పాడని రాజు, అతని తల్లికి అర్థమైంది. అవమాన భారంతో ఇద్దరూ వెళ్లిపోయారు. ఇదంతా చూసిన శాంత అన్న రంగారావుకు ఆనందం వేసింది. ‘చాలా మంది తల్లులు తమ పిల్లల తప్పులను వెనకేసుకొస్తారు. తమ పిల్లలు చేసిన తప్పులు గుర్తించినా, గుర్తించనట్లే ఉంటారు.. సరిదిద్దరు కూడా. దానికి అనేక కారణాలున్నాయి. కానీ తన చెల్లి శాంత అలా కాదు. తన, వేరేవాళ్ల పిల్లలు అనే భావన లేకుండా.. ఎవరి తప్పుంటే వారిని మందలిస్తుంది. అది మంచి అలవాటు. తప్పు చేస్తే అమ్మ ఊరుకోదనే భయంతో పిల్లలు క్రమశిక్షణతో ఉంటారు’ అని తనలో తానే అనుకున్నాడు. మనసులోనే తన చెల్లి శాంతను అభినందించాడు.
ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు