ఆరోగ్యమే మహాభాగ్యం!

రెండో తరగతి గదిలో పిల్లలకు పాఠం చెబుతున్నారు టీచర్‌. ఇంతలో ఒక నోటీసు తీసుకుని అటెండర్‌ వచ్చాడు. అతని చేతిలోని కాగితాన్ని తీసుకొని, చదివి సంతకం పెట్టి తిరిగిచ్చేశారు టీచర్‌.

Updated : 11 Oct 2023 04:30 IST

రెండో తరగతి గదిలో పిల్లలకు పాఠం చెబుతున్నారు టీచర్‌. ఇంతలో ఒక నోటీసు తీసుకుని అటెండర్‌ వచ్చాడు. అతని చేతిలోని కాగితాన్ని తీసుకొని, చదివి సంతకం పెట్టి తిరిగిచ్చేశారు టీచర్‌. ‘పిల్లలూ! మీకు సంతోషం కలిగించే ఒక విషయం చెప్పబోతున్నాను. పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో వచ్చే నెల మీకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఈ 30 రోజుల సమయాన్ని మీరంతా చక్కగా వినియోగించుకోవాలి. ఆటల పోటీల్లో పాల్గొనాలంటే మంచి శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. అందుకోసం మీరు రోజూ వ్యాయామం చేయడంతోపాటు తాజా పండ్లు, ఆకుకూరలు బాగా తినాలి. సరేనా?’ అని అన్నారు టీచర్‌.

‘మేడం! నాకు ఫ్రూట్స్‌ అంటే అస్సలు ఇష్టం ఉండదు’ లేచి నిలబడి అన్నాడు బన్నీ. ‘ఆ విషయం నాకు తెలుసు.. రోజూ స్నాక్స్‌ బాక్స్‌లో ఫ్రూట్స్‌ తెచ్చుకోమని చెప్పినా నువ్వు వినవు కదా.. బిస్కెట్లు, కేకులే తెచ్చుకుంటున్నావు. అది మంచి అలవాటు కాదు’ అని మరోసారి హెచ్చరించారు టీచర్‌. మారు మాట్లాడకుండా తల దించుకున్నాడు బన్నీ. తనకు ఫాస్ట్‌ఫుడ్‌ అంటేనే ఇష్టం. ఇంటి దగ్గర కూడా వాళ్ల నాన్నతో నూడుల్స్‌, మంచూరియా, ఫ్రైడ్‌ రైస్‌లాంటివి తెప్పించుకుంటాడు. అలాంటివి తినకూడదని పెద్దవాళ్లు ఎంత చెప్పినా మార్పు రాలేదు. తరగతులు ముగిసిన తర్వాత.. ఇంటికి వెళ్లేముందు, టీచర్‌ దగ్గరకు వెళ్లాడు బన్నీ. ‘మేడం! నాకు చాలా బలం ఉంది. నేను అన్ని ఆటల పోటీల్లో పాల్గొంటాను. బోలెడన్ని బహుమతులు గెలుచుకుంటాను’ చెప్పాడు బన్నీ. ‘వెరీ గుడ్‌ బన్నీ.. ఆ నమ్మకమే కావాల్సింది’ అని ప్రోత్సహించారామె. ఆ మాటలకు బన్నీ ముఖం వెలిగిపోయింది. ‘ఇంకో మాట.. మీ అందరి ఎత్తు, బరువు కూడా చూస్తాను. మీతో రేపటి నుంచి ఆటల పోటీల కోసం ప్రాక్టీస్‌ చేయిస్తాను’ అన్నారు టీచర్‌.

అన్నట్లుగానే మరుసటి రోజు సాయంత్రం స్కూల్‌ ఆవరణలోని మైదానంలో పరుగు పందెం పెట్టారు టీచర్‌. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా కేటాయించిన గడుల్లో నిల్చున్నారు. టీచర్‌ రెడీ... వన్‌, టు, త్రీ... అనగానే పిల్లలు పరుగు మొదలు పెట్టారు. గెలుపు నాదే అనుకున్న బన్నీ.. సగం దూరం పరిగెత్తగానే ఆయాసపడుతూ ఆగిపోయాడు. ఇక ముందుకెళ్లలేక అలసటతో అక్కడే ఉన్న బెంచీ మీద దిగులుగా కూర్చుండిపోయాడు. పరుగు పందెం అయ్యాక.. మరో ఆట ఆడించారు. అందులోనూ బన్నీ కొద్దిసేపటికే అలిసిపోయాడు. వెంటనే టీచర్‌ అతడి దగ్గరికెళ్లి.. ‘బన్నీ.. ఏమైంది? ఏమైనా సమస్యా?’ అని అడిగారు. ‘టీచర్‌! నేను బలంగానే ఉంటాను కదా.. పరుగు పందెంలో మొదటి స్థానంలో ఉంటాననుకున్నాను. కానీ, అలసటతో పరిగెత్తలేకపోయాను’ బాధగా అన్నాడు బన్నీ.

‘బన్నీ.. బలంగా ఉండటమంటే ఆరోగ్యంగా ఉన్నామన్నట్లు కాదు. ఆహారంలో పండ్లు, కూరగాయల్లాంటి వాటికి స్థానం ఇవ్వకపోవడమే నీ అలసటకు కారణం.. రోజూ ఏదో ఒక పండు తినాలని చెప్పినా, నువ్వు నా మాట వినడం లేదు. అలాగే జంక్‌ ఫుడ్‌ కూడా పూర్తిగా మానేయాలి. అప్పుడు నువ్వు కూడా బాగా పరిగెత్తగలుగుతావు. తిండి మీద ఎంత శ్రద్ధ చూపుతామో, నిద్రకూ తగిన సమయం కేటాయించాలి’ అన్నారు టీచర్‌. ‘సరే టీచర్‌.. ఈ రోజు నుంచి నేను పండ్లు తినడం ప్రారంభిస్తాను’ అన్నాడు బన్నీ. సాయంత్రం ఇంటికి వెళ్లాక.. ‘అమ్మా! నాకు ఈ రోజు నుంచి పండ్లు, తాజా కూరగాయలు పెట్టు’ అని అడిగాడు. ‘చాలా సంతోషం బన్నీ.. ఇప్పటికైనా నీకు వాటి విలువ తెలిసింది’ అందామె.  

అప్పటి నుంచి బన్నీ స్నాక్స్‌ బాక్సులో రోజూ ఏదో ఒకరకం పండు తీసుకెళ్లేవాడు. బయటికెళ్లినప్పుడు ఫాస్ట్‌ఫుడ్‌ తినడం చాలావరకు తగ్గించేశాడు. కొత్తగా ఉదయాన్నే అరగంట ముందుగా నిద్రలేచి వ్యాయామం చేయడం కూడా ప్రారంభించాడు. నెల రోజుల తర్వాత స్కూళ్లో నిర్వహించిన పరుగు పందెంలో మూడో స్థానంలో నిలిచాడు.

టీచర్‌ బహుమతులు అందిస్తూ.. ‘వెరీగుడ్‌ బన్నీ.. ఇకనుంచి ఇవే ఆహార నియమాలు పాటిస్తే, వచ్చే పోటీల్లో ప్రథమ స్థానంలో నిలుస్తావు’ అని ప్రోత్సహించారు. ‘మేడం! ఇకనుంచి పెద్దవాళ్ల మాట కచ్చితంగా వింటాను. రోజూ తప్పకుండా
ఏదో ఒక పండు తింటాను. అమ్మను విసిగించకుండా చెప్పిన పని చేస్తాను’ అన్నాడు బన్నీ. దాంతో అక్కడి మిగతా పిల్లలంతా చప్పట్లు కొట్టారు.

కె.వి.సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని