చెత్తకుండీ... ఓ నల్లకుక్క!

అనగనగా ఒక వీధిలో ఒక నల్లకుక్క ఉండేది. ఆ వీధికి అది మహారాజు. చిన్న జంతువులన్నీ తనకు బానిసలుగా ఉండాలనుకునేది. తన అనుమతి లేనిదే ఆ వీధిలోకి అడుగు కూడా పెట్టనిచ్చేదికాదు.

Updated : 12 Oct 2023 04:05 IST

అనగనగా ఒక వీధిలో ఒక నల్లకుక్క ఉండేది. ఆ వీధికి అది మహారాజు. చిన్న జంతువులన్నీ తనకు బానిసలుగా ఉండాలనుకునేది. తన అనుమతి లేనిదే ఆ వీధిలోకి అడుగు కూడా పెట్టనిచ్చేదికాదు. అక్కడే ఒక చింతచెట్టు కింద నివాసం ఏర్పరచుకుంది. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి చెత్త కుండీలోని పదార్థాలను తిని కడుపు నింపుకొనేది. ఆ కుండీ దగ్గరకు ఒక్కోసారి పిల్లులు, ఎలుకలు, ఉడుతలు, తొండలు, కోళ్లు, గాడిదలు, గేదెలు, కోతులు కూడా వచ్చేవి. అక్కడి ఆహారం తినబోయేవి.. కానీ, ఆ నల్లకుక్క గమనించి గంభీరంగా... ‘భౌ భౌ’మంటూ అవి పారిపోయేలా భయపెట్టేది.
దాంతో అవి ఆహారం గురించి మర్చిపోయి, అక్కడి నుంచి పరుగు తీసేవి. నల్లకుక్క ఉదయం నుంచి చీకటి పడేవరకు ఆ వీధిలో ఆ చివరి నుంచి ఈ చివరకు కాపలాగా తిరుగుతూ ఉండేది. చెత్తకుండీలో ఆహారం వేయగానే పరుగున వెళ్లి తినేసేది. ఆ చెత్తకుండీలో మిగిలిపోయిన పదార్థాలను అదొక్కటే తినటంతో బాగా కండపట్టింది. దాంతోపాటు గర్వం కూడా పెరిగి, దానికదే ఆ వీధికి మహారాజునని ప్రకటించుకుంది.
ఒకరోజు ఒక పిల్లి ఆ చెత్తకుండీ దగ్గర చెత్తను కాళ్లతో తోడుతూ ఏదో తింటోంది. ఇంతలో ఆ నల్లకుక్క గంభీరంగా మొరుగుతూ పిల్లి మీదకు దూకింది. కానీ ఆ పిల్లి తేలిగ్గా తప్పించుకుని ఒక్క పరుగుతో దూరంగా ఉన్న చింతచెట్టు ఎక్కింది. అది కొమ్మ మీద కూర్చుని ఆయాసం తీర్చుకుంటోంది. ఇంతలో నల్లకుక్క చెట్టు కింద నుంచి... ‘భౌ భౌ’ అని అరిచి... ‘ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా ఈ వీధిలోకి రావటమే కాకుండా నా చెత్తకుండీలో మూతి పెడతావా. ఎంత ధైర్యం నీకు? నీ అంతు చూస్తా!’ అంది.
భయంతో ఆ పిల్లి గజగజ వణికింది. ‘కుక్క మహారాజా! ఆ చెత్తకుండీ నీదని నాకు తెలీదు. నేను ఈ వీధికి కొత్త. మొదటిసారిగా ఇక్కడకు వచ్చాను. నన్ను వదిలిపెట్టు’ అని వేడుకుంది. కానీ, ఆ నల్లకుక్క కనికరించలేదు. ‘వచ్చేముందు తెలుసుకోకపోవటం నీ తప్పు’ అంది. ‘అవును మహారాజా! ఈ ఒక్కసారికి క్షమించు. నాకు నాలుగు చిట్టి కూనలున్నాయి. అవి ఆకలితో అలమటిస్తాయి. తల్లిలేదని ఏడుస్తాయి. తిండికి కష్టమై.. మా వీధి నుంచి ఈ వీధిలోకి ఆహారం వెతుక్కుంటూ వచ్చాను. దయచేసి నన్ను వదిలేస్తే వెళ్లిపోతాను. ఇంకెప్పుడూ ఇటువైపు రాను’ అంటూ బతిమిలాడిందా పిల్లి.
ఆ కుక్క కాస్త కూడా జాలి చూపలేదు. అక్కడి నుంచి కదలలేదు. కానీ చింత చెట్టు మీదే నివసిస్తున్న ఉడుత, కొంగ, కోతి, కాకి దాని గోడు విని చలించిపోయాయి.  నల్లకుక్కకు ఇంత పొగరు పనికిరాదనుకున్నాయి. ఆ చెట్టు మీద అవి తినటానికి దాచుకున్న ఆహారంలో కొంత పిల్లికి అందించాయి. అది విపరీతమైన ఆకలితో ఉండటంతో గబగబా తినేసింది. ఇంతలో దానికి చిట్టికూనలు గుర్తుకొచ్చి కన్నీరు పెట్టింది.
‘మిత్రులారా! ఎంతో మంచి మనసు ఉన్న మీలాంటివారు నివసించే ఈ చెట్టు కిందే చెడు మనసున్న ఆ నల్లకుక్క కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మీరు నాపై చూపిన ప్రేమలో ఒకవంతు కూడా కుక్కకు లేదు’ అంటూ వాపోయింది పిల్లి. ‘మిత్రమా! బాధపడకు. నీలాంటి మంచివారికి ఏమీకాదు. నీ చిట్టికూనలు క్షేమంగానే ఉంటాయి. ఆ భగవంతుడే నీ బిడ్డలను కాపాడతాడు’ అని కోతి ధైర్యం చెప్పింది. అంతలోనే ఎక్కడి నుంచో ఒక వ్యాను వేగంగా వచ్చి చెత్తకుండీ దగ్గర ఆగింది. అందులోంచి నలుగురు బలమైన మనుషులు.. చేతికర్రలు, వలతో బయటకు దూకారు. ‘అదిగో నల్లకుక్క.. దాన్ని బంధించండి’ అంటూ పరుగున వచ్చి దాని మీద వల వేశారు. అది తప్పించుకోబోతుంటే, దుడ్డు కర్రలతో ఒక్కటి వేశారు. దాంతో అది.. ‘కుయ్యో... మొర్రో!’ అంటూ తోకముడిచింది. ఒకరు దాని మూతికి తాడుకట్టగా, మరొకరు మెడకు గొలుసుకట్టి వ్యాను దగ్గరకు ఈడ్చుకెళ్లారు. ఆ దృశ్యాన్ని చూసి చెట్టు మీద జంతువులు, పక్షులు.. వీధి కుక్కలు పట్టేవారు వచ్చారని గ్రహించాయి. వారు ఆ కుక్కను వ్యాను వెనక భాగంలో ఉన్న బోనులో వేశారు. దాంతో చింతచెట్టు మీది పిల్లి, కోతి, ఉడుత కిందకు దిగి, చెత్తకుండీ దగ్గరకెళ్లాయి. ఆ నల్లకుక్క బోనులోంచే వాటిని గుర్రుగా చూడసాగింది. తన గర్వమే తనకీ శిక్ష వేసిందనుకొని దిగులుపడింది. వ్యాను అక్కడి నుంచి ముందుకు కదిలింది. పిల్లి తన కూనల కోసం పరుగు తీసింది.

పైడిమరి రామ కృష్ణ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు