అమెరికా మావయ్య!

బడి నుంచి వచ్చిన హర్ష, ఎప్పటిలాగే ఆరోజు విశేషాలు చెప్పేందుకు.. బిగ్గరగా తల్లిని పిలిచాడు.

Updated : 13 Oct 2023 04:27 IST

డి నుంచి వచ్చిన హర్ష, ఎప్పటిలాగే ఆరోజు విశేషాలు చెప్పేందుకు.. బిగ్గరగా తల్లిని పిలిచాడు. లోపలి నుంచి వచ్చిన తల్లి ‘ఉష్‌.. గట్టిగా మాట్లాడకు.. అమెరికా నుంచి మావయ్య వచ్చాడు. లోపల గదిలో నిద్రపోతున్నాడు’ అంటూ కొడుకును వారించింది. ‘మావయ్యా..?’ అని ఆశ్చర్యపోతూ అడిగాడు హర్ష. నువ్వు పుట్టిన సంవత్సరమే చదువుకునేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడే ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు సెలవులు కుదిరాయని ఇండియా వచ్చాడు’ అని చెప్పింది తల్లి. ‘అయితే మావయ్యతో ఆడుకుంటాను’ అంటూ బెడ్‌ రూం వైపు వెళ్లబోయాడు.

‘నిద్రలో ఉన్న మావయ్యను ఇబ్బంది పెట్టకూడదని చెప్పాను కదా!!’ అంటూ వారించింది తల్లి. ‘పగటి పూట నిద్ర మంచిది కాదని చెబుతావు కదా.. మరి మావయ్యకు ఆ విషయం తెలియదా?’ అంటూ అమాయకంగా అడిగాడు హర్ష. ‘మావయ్య ఉండేది అమెరికాలో కదా.. మనకు పగలైతే వాళ్లకు రాత్రి అవుతుంది. అక్కడి అలవాటు కొద్దీ ఈ సమయంలో నిద్ర వస్తుంది. రెండు రోజులు మన వాతావరణానికి అలవాటు పడితే.. మామూలు అయిపోతుంది’ అని వివరించింది తల్లి. ‘ఓహో.. అదా సంగతి.. పగటిపూట మా ముద్దుల మామ అమెరికా వెళ్తాడన్నమాట’ అన్నాడు హర్ష.

తల్లికి అర్థం కాలేదు. ‘నాకు తెలియని మామ ఎవరు? ఆ మామ అమెరికా వెళ్లడమేంటి?’ అంటూ అడిగింది. ‘నీకు తెలియకపోవడమేంటి? తెల్లగా ఉంటాడు.. నువ్వే కదా నాకు పరిచయం చేశావు’ అన్నాడు. ‘నేను పరిచయం చేశానా?’ అంటూ అవాక్కయిందామె. ‘నువ్వే పరిచయం చేశావు.. నువ్వే మర్చిపోయావా అమ్మా?’ అడిగాడు హర్ష. ‘హైదరాబాద్‌లో ఉండే ఈ మామ గురించేనా?’ అంటూ ఒక ఫొటో చూపించిందామె. ‘కాదు.. హైదరాబాద్‌ కన్నా దూరంలో ఉంటాడాయన. మన ఇంటి వైపు చూస్తూ వెళ్లిపోతాడు. కనిపించిన వెంటనే, ఇంకొద్దిసేపు చూడాలనిపించేంత అందగాడు’ అంటూ నవ్వాడు హర్ష.

‘ఎవరబ్బా?’ అంటూ తన సోదరుల వరసైన బంధువులందరి పేర్లను చెప్పిందామె. వాళ్లెవరూ కాదమ్మా.. ఆ మామ పగలంతా నిద్రపోతూనే ఉంటాడు’ అని కొడుకు అనగానే.. ‘ఆ మామ కుంభకర్ణుడు చుట్టమా ఏంటి?’ వెటకారంగా అడిగింది తల్లి. ‘మనకు పద్నాలుగు రోజులైతే, ఆయనకు ఒక రోజు అన్నమాట. తను ఉండే చోటకు వెళ్లామంటే బరువు కూడా తగ్గుతుంది. నువ్వు అక్కడికి వెళ్లావనుకో.. నీ బరువు కూడా తగ్గిపోతుంది’ అంటూ హాస్యమాడాడు హర్ష. ‘అమ్మను ఆట పట్టించింది చాలు.. నీ గమ్మత్తు ప్రశ్నలన్నీ లోపలి నుంచి వింటూనే ఉన్నాను’ అంటూ గదిలోంచి బయటకు వచ్చాడు అమెరికా మావయ్య.
అమెరికా మావయ్యను ప్రత్యక్షంగా చూడటం అదే మొదటిసారి కావడంతో.. ఏం చేయాలో అర్థంకాక ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయాడు. ‘హర్షా.. నువ్వు తెలివైనవాడివే.. చంద్రయాన్‌-3 ప్రభావం నీ మీద బాగానే పడింది’ అంటూ తనను దగ్గరకు తీసుకున్నాడు అమెరికా మావయ్య. ‘అక్కా.. ఆ మామ ఎవరో కాదు.. చందమామ’ అంటూ అసలు విషయం చెప్పాడు. హర్ష నవ్వుతూ.. అమెరికా మావయ్య చేతుల్లో ఒదిగిపోయాడు. ‘ఓరి బడవా.. నన్నే ఆట పట్టించావు కదా.. తొందరగా స్నానం చేసి రా.. వేడి వేడి పకోడీలు పెడతాను. మావయ్యతో కలిసి తినొచ్చు’ అంటూ కొడుకును హడావిడి చేసిందామె.

కొద్దిసేపట్లోనే సిద్ధమై వచ్చి, మావయ్య పక్కనే కూర్చున్నాడు. పకోడీలు తింటూ ‘మావయ్యా.. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన రోజు శాస్త్రవేత్తలను కొనియాడుతూ మా స్కూల్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాం. మమ్మల్ని కూడా గొప్ప శాస్త్రవేత్తలుగా మారాలని ఉపాధ్యాయులంతా ప్రోత్సహించారు’ అంటూ గొప్పగా చెప్పాడు హర్ష. ‘అంత దూరంలో ఉన్న చంద్రుడిపైన ప్రయోగాలు చేయడం అవసరమా?’ అంది తల్లి.

‘చాలా అవసరం. ముందు ముందు మానవ అవసరాలను తీర్చేందుకు ఇప్పుడున్న వనరులు సరిపోవు. అప్పటికి ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితులను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచానికి విద్యుత్తు అవసరం బోలెడంత ఉంది. బొగ్గు ద్వారా చేస్తున్న ఉత్పత్తితో కాలుష్యం పెరిగిపోతోంది. ఆ వనరులు కూడా తరిగిపోయే ప్రమాదం ఉంది. అణు విద్యుదుత్పత్తి అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని నిపుణుల మాట. చంద్రుడి ఆవరణలో హీలియం-3 అనే రసాయన మూలకం అధికంగా ఉంది. దాని సహాయంతో కాలుష్యరహిత విద్యుత్తు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. టన్ను బరువున్న హీలియంను మనం తెచ్చుకోగలిగితే, కొన్నేళ్లపాటు భారతదేశ విద్యుత్తు అవసరాలకు లోటు ఉండదు. అందుకే ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు చంద్రుడిని చేరుకోవడానికి చూస్తున్నాయి’ అంటూ వివరించాడు అమెరికా మావయ్య.

‘ఆ ప్రయోగం వెనక ఇంత కథ ఉందా మావయ్యా.. అమ్మో.. అయితే భవిష్యత్తులో నేనూ శాస్త్రవేత్తనవుతా’ ఆనందంతో అన్నాడు హర్ష. ‘వెరీగుడ్‌’ అంటూ భుజం తట్టాడు మావయ్య.

బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు