ఏం చేద్దాం..ఏం చూద్దాం?

దసరా పండుగ సందర్భంగా పాఠశాలలకు పది రోజులు సెలవులు ఇచ్చారు. రాజు, రవి, కిరణ్‌, రహీమ్‌ నలుగురూ అయిదో తరగతి చదువుతున్నారు. అనుకున్న ప్రకారం ఉదయమే అంతా ఒక దగ్గర కలుసుకున్నారు.

Published : 14 Oct 2023 00:02 IST

దసరా పండుగ సందర్భంగా పాఠశాలలకు పది రోజులు సెలవులు ఇచ్చారు. రాజు, రవి, కిరణ్‌, రహీమ్‌ నలుగురూ అయిదో తరగతి చదువుతున్నారు. అనుకున్న ప్రకారం ఉదయమే అంతా ఒక దగ్గర కలుసుకున్నారు. ‘బడి లేదు కదా. ఈ సెలవుల్లో ఏం చేద్దాం? ఏం చూద్దాం?’ అంటూ రవిని అడిగాడు రాజు. ఇంతలో ‘సినిమాకు వెళ్దామా?’ అన్నాడు కిరణ్‌. ‘రోజూ టీవీలో వస్తూనే ఉంటాయి కదా.. సెలవు రోజుల్లోనూ ప్రత్యేకించి చూడటం ఎందుకు?’ బదులిచ్చాడు రాజు. ‘అయితే ఇంకెక్కడికైనా వెళ్దామా?’ మళ్లీ అడిగాడు కిరణ్‌. ‘పోనీ.. పార్కుకు వెళ్లి ఆడుకుందామా?’ స్నేహితుల వైపు చూస్తూ అన్నాడు రహీమ్‌. ‘ఆదివారాలూ, సెలవు రోజుల్లో వెళ్లి పార్కులో ఆడుకుంటూనే ఉంటాం కదా..’ నవ్వుతూ బదులిచ్చాడు కిరణ్‌.

‘అయితే ఎక్కడికి వెళ్దాం?’ అని ముగ్గురూ రవిని అడిగారు. ‘ఆ.. ఇప్పుడు గుర్తొచ్చింది’ అంటూ ఏదో ఆలోచన వచ్చినట్టుగా చెప్పాడు రవి. ‘ఏంటది?’ అని కుతూహలంతో అడిగారు మిగతావారు. ‘మొన్న మా తాతయ్య నాతో అన్నారు. మన ఊరికి తూర్పు దిక్కులో పెద్ద కొండ ఉంది కదా?’ అని రవి చెబుతుండగానే.. ‘ఆ.. ఉంటే.. అక్కడేం చేద్దాం? ఏం చూద్దాం?’ అంటూ ఆత్రంగా అడిగారు. అప్పుడు రవి.. ‘అదే చెప్పబోతున్నా. ఆ కొండ పైన ఒక వింతలోకం ఉందట’ అన్నాడు. ‘ఆ వింతలోకంలో ఏమేం ఉంటాయట?’ అని మిత్రులు ఆసక్తిగా అడిగారు. స్నేహితుల ఉత్సాహాన్ని గమనించిన రవి.. ‘సాధారణంగా చీమలు కష్టపడి నిర్మించిన పుట్టలను పాములు ఆక్రమించుకుంటాయని మనకు తెలుసు. కానీ, పాములను ఎదిరించే చీమలు ఆ వింతలోకంలో ఉన్నాయట’ అని బదులిచ్చాడు.  

‘ఆ వింత లోకంలో ఇంకేం ఉన్నాయట?’ అంటూ మరింత ఉత్సాహంతో మిత్రులు అడిగారు. ‘పిల్లికి భయపడని ఎలుకలు, పులిని ఎదిరించిన మేకలు, తోడేళ్లకు లొంగని కుందేళ్లు ఉన్నాయట. వాటన్నింటినీ చూద్దామా? అక్కడకు వెళ్దామా?’ అడిగాడు రవి. ‘తప్పకుండా వెళదాం. ఇప్పుడే చూద్దాం’ అన్నారంతా. నలుగురూ కలిసి ఎంచక్కా కబుర్లు చెప్పుకొంటూ, ఉత్సాహంగా ముందుకు నడవసాగారు. అలా కొంత దూరం వెళ్లారు. కొండ కనిపిస్తుండగా.. రవి అక్కడే ఉన్న భవనం వద్ద ఒక్కసారిగా ఆగాడు. ‘ఇక్కడెందుకు ఆగావు?’ అంటూ ఆ భవనాన్ని ఎగాదిగా చూస్తూ మిత్రులు అడిగారు. ‘ఆ వింత లోకాన్ని ఎలా చేరుకోవాలో.. ఈ భవనంలోకి వెళ్తేనే మనకు తెలుస్తుంది. ఆ వింత లోకం చిరునామా ఈ భవనంలో దొరుకుతుంది. నాతో రండి’ అని రవి అనడంతో.. మిగతా ముగ్గురూ ‘సరేనంటూ’ లోపలకు వెళ్లారు.

లోపల గదంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. రవి లోపలకు వెళ్లి, ఒకరిని కలిశాడు. అతను ఏదో పుస్తకం తీసుకొచ్చి ఇచ్చాడు. రవి ఆ పుస్తకాన్ని అందుకొని.. మిత్రులను పిలిచాడు. అందరూ కలిసి ఓ బల్ల మీద కూర్చున్నారు. అప్పుడు రవి.. వింత లోకం అని రాసి, రంగురంగుల బొమ్మలు వేసిన పుస్తకం అట్టను మిత్రులకు చూపిస్తూ, ‘మొన్న ఆదివారం తాతయ్యతో కలిసి ఇక్కడకు వచ్చాను. ఇక్కడ రకరకాల పుస్తకాలు ఉంటాయని, అవి చదివితే ప్రపంచ జ్ఞానం వస్తుందని చెప్పారు. సెలవుల్లో సమయం వృథా చేసుకోకుండా, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు’ అంటూ అసలు విషయం చెప్పాడు.

‘అలాగా..’ అన్నారంతా. ‘అవును. అప్పుడే ఈ వింత లోకం పుస్తకం చదివాను. ఆ విశేషాలే మీకు చెప్పాను. ఒక మంచి అంశాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని తోటి వాళ్లకు చెప్పాలి. ఎందుకంటే.. పంచేకొద్దీ పెరిగేది విద్య మాత్రమేనని మన టీచర్‌ చెప్పారు కదా.. అందుకే మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చాను. కొండ ఎక్కితే దాని గురించి మాత్రమే తెలుస్తుంది. కానీ, పుస్తకాలు చదివితే మరెన్నో వింతలూ, విషయాలూ తెలుస్తాయి. మీకిప్పటికే అర్థమై ఉంటుంది కదా.. ఇది గ్రంథాలయమని..’ అంటూ మిత్రుల వైపు చూశాడు రవి. అప్పుడు ఆ ముగ్గురూ రవితో.. ‘మనం మళ్లీ బడికి వెళ్లాక, సెలవుల్లో ఏం చేశారని టీచర్‌ అడుగుతారు. అప్పుడు గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు చదివామని సమాధానం చెబితే మనల్ని మెచ్చుకుంటారు’ అన్నారు. ‘కొండ ఎక్కితే ఎత్తుగా కనిపిస్తాం. కానీ, ఇక్కడకు వస్తే కొండకన్నా ఎత్తుగా ఎదగగలం. ఒక గొప్ప ప్రదేశానికి తీసుకొచ్చావు. తరచుగా ఇక్కడకు వద్దాం. పుస్తకాలు చదివేద్దాం’ అని రాజు, కిరణ్‌, రహీమ్‌లు ఆనందంగా అన్నారు. వారి వైపు మురిపెంగా చూసి.. నవ్వేశాడు రవి.  

కె.వి.లక్ష్మణరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు