నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది!

సిద్ధయ్యది పార్వతీపురం. తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతుంటాడు. అతడికి ఇద్దరు కొడుకులు మురళి, సారథి. ఇద్దరిదీ పొగరుబోతు స్వభావం. ఒకరోజు కొడుకుల్ని పిలిచి.. ‘మనవి పేద బతుకులు. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు భయమేస్తోంది. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి.

Updated : 15 Oct 2023 06:45 IST

సిద్ధయ్యది పార్వతీపురం. తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతుంటాడు. అతడికి ఇద్దరు కొడుకులు మురళి, సారథి. ఇద్దరిదీ పొగరుబోతు స్వభావం. ఒకరోజు కొడుకుల్ని పిలిచి.. ‘మనవి పేద బతుకులు. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు భయమేస్తోంది. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి. మంచితనం అలవర్చుకోవాలి’ అని చెప్పాడు తండ్రి. కానీ, వారు ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు.
ఒకసారి తన కొడుకుల గురించి పొరుగింట్లో ఉండే మాస్టారుకు చెప్పాడు సిద్ధయ్య. వారిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని కోరడంతో, ఓ ఉపాయం చెప్పారా మాస్టారు. దాంతో ఆ మరుసటి రోజు ఉదయం కొడుకులతో ‘ఈ రోజు అమ్మకానికి కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకొచ్చాను కానీ, నాకు ఒంట్లో బాగోలేదు. వాటిని అలాగే ఉంచేస్తే తాజాదనం పోతుంది. మీరిద్దరూ వెళ్లి అమ్ముకొని రండి’ అని చెప్పాడు. ‘మాకు వ్యాపారం తెలియదు. ఎలా అమ్మగలం’ అని ప్రశ్నించారిద్దరూ. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది సామెత. నేను చెప్పే ధరలను గుర్తుపెట్టుకొని, మీ మాటతీరుతో సరకుల్ని అమ్మండి’ అంటూ ఏయే వీధుల్లోకి వెళ్లాలో వివరించాడాయన. సరేనంటూ ఇంటి ముందున్న నాలుగు చక్రాల బండితో కదిలారా సోదరులు.
తండ్రి చెప్పిన కాలనీల్లోకి వెళ్లి.. ‘కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు.. రావాలమ్మా రావాలి’ అని అరవసాగారు. కొందరు మహిళలు బయటకొచ్చి ధరలు అడిగారు. తండ్రి చెప్పిన రేట్లనే వాళ్లకు చెప్పారు. ‘మరీ అంత ఎక్కువ చెబితే ఎలా? కేజీకి ఇరవై చొప్పున తగ్గిస్తే తీసుకుంటాం’ అన్నారు. ‘మీరు కొన్నా కొనకపోయినా మాకు నష్టం లేదు కానీ ధర మాత్రం తగ్గించడం కుదరదు’ అన్నాడు మురళి. ‘ఇవి పెరట్లో కాసినవి కావు. మేమూ కొన్నవే..’ అంటూ కోప్పడ్డాడు సారథి. దాంతో వాళ్లేమీ కొనకుండానే ఇళ్లలోకి వెళ్లిపోయారు.
అలా పక్క వీధిలోకి వెళ్లిందా బండి. అక్కడి వాళ్లు చుట్టూ చేరి.. సరకుల తాజాదనం పరీక్షించారు. ‘బాగానే ఉన్నాయి కానీ, ధర ఎక్కువ చెబుతున్నారు. తూకమైనా సరిగ్గా ఇస్తారా లేదా?’ అని ప్రశ్నించారు. ఆ మాటతో మురళికి కోపం వచ్చింది. ‘నువ్విచ్చేది అసలు నోటేనని నమ్మకమేంటి?’ అన్నాడు టక్కున. అక్కడా వ్యాపారం సాగలేదు. మొత్తానికి ఒక్క సరకూ అమ్మకుండా ఇంటికి తిరిగి వచ్చారు. ఉసూరుమంటూ తిరిగొచ్చిన కొడుకులను చూసిన సిద్ధయ్య.. ‘నోటి దురుసుతో వ్యాపారం పాడు చేసి ఉంటారు. ముందు నుంచీ మొత్తుకుంటూనే ఉన్నాను. మీరు వినిపించుకుంటేగా..!!’ అని కోప్పడ్డాడు. ‘అదేం లేదు నాన్నా.. నువ్వెళ్లినా అమ్మలేవు. వాళ్లెవరూ కొనే రకం కాదు’ అన్నారు కొడుకులిద్దరూ. ‘నేను సరకంతా అమ్మేసి వస్తే, నా మాట వింటారా?’ అనడిగాడు తండ్రి. కొడుకులు అలాగేనన్నారు. తానెలా అమ్ముతాడో చూడడానికి దూరంగా ఉండి వాళ్లని అనుసరించమన్నాడు.
ముందుగా సిద్ధయ్య.. ఒక వీధిలోకెళ్లి ‘కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు..’ అంటూ అరిచాడు. ఒక మహిళ బయటకు వచ్చి.. ‘ఉదయం ఎవరో ఇద్దరు కుర్రాళ్లు వచ్చారు. నీకంటే ధర తక్కువే చెప్పారు. నువ్వు ఆ ధరకు ఇస్తేనే కొంటాం’ అంది. ‘బంగారంలాంటి మీచేత్తో బోణీ కొట్టండమ్మా. ధరదేముంది?’ అని సిద్ధయ్య చెప్పేసరికి మారుమాట్లాడకుండా అడిగిన డబ్బిచ్చి కొనుక్కుందామె. అలా బండి పక్క వీధిలోకి వెళ్లిందో లేదో.. ఓ మహిళ వచ్చి కూరగాయల నాణ్యత చూడసాగింది. ‘మీరు నాదగ్గర కొన్నారంటే వీధిలో వాళ్లంతా కొంటారమ్మా. మీకు తగ్గిస్తే వాళ్లకీ తగ్గించాలి. దయచేసి ధర తగ్గించమని అడగకండమ్మా’ అన్నాడు సిద్ధయ్య. దాంతో ఆమె మారు మాట్లాడకుండా సరకులు కొనుక్కొని వెళ్లింది.
అలా ఒక్కొక్కరితో ఒక్కోలా మాట్లాడుతూ.. సరకు మొత్తాన్నీ అమ్మేసిన తండ్రిని చూసి కొడుకులు ఆశ్చర్యపోయారు. ‘అన్నింటికీ మన మాటతీరే ముఖ్యమని ఇప్పటికైనా ఒప్పుకొంటారా?’ అని సిద్ధయ్య అడగ్గానే.. అయిష్టంగానే తలాడించారారిద్దరూ. ‘మనం మాట్లాడే స్నేహపూర్వకమైన మాట.. మిత్రుల్ని, ద్వేషపూరితమైన మాట.. శత్రువుల్ని ఇస్తుంది. పొగరుబోతు మాటలు మనుషుల్ని దూరం చేస్తాయి’ అని హితబోధ చేశాడు తండ్రి. అప్పటి నుంచి మురళి, సారథిల మాటతీరు, ప్రవర్తనలో మార్పు వచ్చింది. అది చూసి.. మాస్టారికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు సిద్ధయ్య.  
నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని