రామయ్య నిజాయతీ!

రామయ్య బ్యాంకులో అడుగు పెట్టేసరికి ఉద్యోగులంతా నిలబడి సవినయంగా అభివాదం చేశారు.

Updated : 16 Oct 2023 03:31 IST

రామయ్య బ్యాంకులో అడుగు పెట్టేసరికి ఉద్యోగులంతా నిలబడి సవినయంగా అభివాదం చేశారు. ఊహించని సంఘటనకు ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొన్ని క్షణాల్లోనే ఆయన తేరుకుని, ప్రతి నమస్కారం చేశారు. అక్కడే ఉన్న బ్యాంకు మేనేజర్‌... ‘సర్‌.. చెప్పండి’ అంటూ వచ్చిన పని అడిగాడు. ‘సేవింగ్స్‌ పాస్‌ బుక్‌ అప్‌డేట్‌ చేసుకుందామని వచ్చాను సర్‌’ అనగానే రామయ్య చేతిలో నుంచి పాస్‌బుక్‌ తీసుకొని గుమస్తాకిచ్చాడు.

‘సర్‌.. రండి’ అంటూ తన ఛాంబర్‌లోకి ఆహ్వానించాడు. ‘ఫరవాలేదు సర్‌.. పని ఉంది వెళ్లాలి’ అన్నారు. ‘సార్‌.. మీ సాహితీ సేవ నన్ను అబ్బురపర్చింది. మీరిచ్చిన పిల్లల కథల పుస్తకాలు చదివాను. పిల్లలు, సమాజానికి సందేశాలివ్వడమే కాకుండా మీరు స్వయంగా పాటిస్తారు. మీలాంటి రచయితలు చాలా అరుదు’ అంటూ ప్రశంసలు కురిపించసాగాడు మేనేజర్‌.  

ఇంతలో పాస్‌బుక్‌ తీసుకు వచ్చి రామయ్యకు అందజేశారు ఓ ఉద్యోగి. అది తీసుకొని మేనేజర్‌కు ధన్యవాదాలు చెప్పాడు రామయ్య. బ్యాంకులో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం సరికాదు. పైగా వారి పనులకు ఆటంకం కలిగించకూడదని, అక్కడి నుంచి రామయ్య వీడ్కోలు తీసుకున్నాడు.

‘తాతయ్యా..’ అని పిలుస్తూ రామయ్య వెనుకాలే మనవడు మనోహర్‌ రావడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ‘మనూ.. బడికి పోలేదా? బ్యాంకుకు ఎప్పుడు వచ్చావు’ అంటూ ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు ఆయన.

‘మాకు ఈరోజు సెలవు తాతయ్యా.. నా ఫ్రెండ్‌తో వచ్చాను’ అంటూ వెనుతిరిగి.. ‘రాజూ..!’ అని పిలిచాడు. రాజు రాగానే రామయ్యను పరిచయం చేశాడు మనోహర్‌. రాజు ఎంతో వినయంగా రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. రామయ్యకు ముచ్చటేసి, ఇద్దరినీ హత్తుకున్నారు.

‘‘మా అమ్మ ఈ బ్యాంకులో పనిచేస్తోంది తాతయ్యా..! ‘బ్యాంకు చూద్దురు రండి’ అంటూ మమ్మల్ని తీసుకొని వచ్చింది. ఇక ఇంటికి వెళ్దామనుకునే సరికి మీరు కనబడ్డారు’’ అంటూ ఎంతో వినమ్రంగా చెప్పాడు రాజు. ‘తాతయ్యా.. మీరు రాగానే బ్యాంకులో పనిచేసే వారంతా లేచి నిలబడి నమస్కారం చేశారు. మీరు ఇదివరకు బ్యాంకులో పెద్ద ఆఫీసరుగా పనిచేశారా?’ అంటూ సందేహాన్ని వెలిబుచ్చాడు రాజు.

‘మా తాతయ్య స్కూల్‌ మాస్టారు. ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా వచ్చింది’ అంటూ మనోహర్‌ చెప్పాడు.

రామయ్య చిరునవ్వు నవ్వుతూ... ‘అవన్నీ మన మంచితనానికి కొలమానాలు కావు మనూ.. రండి అలా కూర్చుందాం!’ అంటూ బ్యాంకు ఆవరణలో ఉన్న సిమెంటు బెంచీ మీద కూర్చున్నారు. ‘ఒక కథ చెబుతాను వింటారా!’ అని రామయ్య అనగానే వారి ముఖాల్లో వేయిదీపాలు వెలిగాయి. ‘‘పూర్వం జాకారం అనే రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించే వాడు. అతనికి కవులు అంటే చాలా ఇష్టం.  ప్రతీమాసం అతనికి ఇష్టమైన అంశాల పైన కవిత్వం రాయించే వాడు. కవులందరినీ సత్కరించేవాడు. కానీ మహామంత్రికది నచ్చేదికాదు. కవులందరినీ కాకుండా ఉత్తమ గుణగణాలు కలిగిన వారిని మాత్రమే సన్మానించాలని అనుకునే వాడు. ఒకరోజు అదే విషయాన్ని మహారాజుతో విన్నవించాడు. మహారాజు సమ్మతించి వారిని గుర్తించే అధికారం మంత్రికి అప్పగించాడు. మరుసటి మాసం కవులకు ఒక్కొక్కరికి నూరు బంగారు నాణేలు బహుమతిగా ఇస్తున్నట్టు ఆయన ప్రకటించాడు. అంత మొత్తంలో బంగారు నాణేలు బహుమతిగా రావడం కవులు ఊహించలేదు.

రాంభట్టు కవి ఇంట్లో భార్య బంగారునాణేల సంచిని తీసుకొని లెక్కించింది. ఒక నాణెం ఎక్కువ రావడంతో ఎగిరి గంతులు వేసింది. గమనించిన రాంభట్టు ఆమె చేతిలో నుంచి నాణేల సంచిని తీసుకున్నాడు! ఆ మరునాడు రాజసభలో.. ‘మహారాజా! మీరు నూరు బంగారు నాణేల బహుమతి అని ఇచ్చారు. కానీ నాకు ఒక నాణెం ఎక్కువగా వచ్చింది. దయచేసి తీసుకోండి’ అంటూ నాణేన్ని తిరిగి ఇచ్చాడు. ‘చూశారా మహారాజా! రాంభట్టు కవి నిజాయతీ! కవుల్లో ఉత్తముడు. కవులందరికీ ఒక నాణెం ఎక్కువగానే ఇచ్చాం. కానీ ఎవరూ తిరిగి ఇవ్వలేదు’ అనగానే సభలోని మిగతా కవులు సిగ్గుతో తలలు దించుకున్నారు. ఆ రోజు నుంచి రాంభట్టు కవి సభకు రాగానే సభలోని వారంతా నిలబడి శిరస్సు వంచి నమస్కరించేవారు. అదీ నిజాయతీకి ఉన్న మహత్తు. మనకు బిరుదులు, సన్మానాలతో లభించే గౌరవం కంటే.. నిజాయతీతో మన్ననలను పొందడం ఎక్కువ సంతృప్తినిస్తుంది. మీరు బ్యాంకులో చూశారుగా..’’ అనగానే పిల్లలిద్దరు చప్పట్లు కొట్టారు.

‘అయితే మీకు కూడా బ్యాంకులో ఇలానే డబ్బులు ఎక్కువ వచ్చాయా... తాతయ్యా?’ అని ప్రశ్నించారు. వారి సూక్ష్మబుద్ధికి రామయ్య ఆశ్చర్యపోయాడు. ‘అవును.. గత వారం బ్యాంకులో యాభైవేలు కావాలని చెక్కు ఇచ్చాను. నాకు అయిదువందల నోట్ల సీల్డ్‌ కట్ట ఇచ్చారు. నేను ఇంటికి వెళ్లి లెక్కించాను. ఒక నోటు ఎక్కువగా ఉంది. తర్వాత మళ్లీ బ్యాంకుకు వెళ్లి బండిల్‌ తిరిగి ఇస్తూ ఒకటి ఎక్కువ ఉందని చెప్పాను. వారు మెషీన్‌ మీద లెక్కించి నిర్ధారించుకున్నారు. నా నిజాయతీని గమనించి బ్యాంకు సిబ్బంది అంతా నిలబడి నమస్కరించారు. ఈ రోజు చూశారుగా.. ఇదంతా.. దాని ఫలితమే. మీరు కూడా నిజాయతీతో మెలిగితే సంఘంలో గౌరవం లభిస్తుంది. అది మనకు వచ్చిన అవార్డులకన్నా మిన్న’ అనగానే పిల్లలు తామూ జీవితంలో నిజాయతీగా నడుచుకుంటామని ప్రమాణం చేశారు.

చెన్నూరి సుదర్శన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని