అలా అతికింది.. ఇలా ఊడింది!

మైత్రేయ వనంలో ఏనుగులదే ఆధిపత్యం. ఆ అడవి గజరాజు ఐరా ఏలుబడిలో ఉంది. దానికి ఒక్కగానొక్క సంతానం గణపతి. అందరూ ముద్దుగా ‘గణ’ అని పిలుస్తారు.

Updated : 17 Oct 2023 05:47 IST

మైత్రేయ వనంలో ఏనుగులదే ఆధిపత్యం. ఆ అడవి గజరాజు ఐరా ఏలుబడిలో ఉంది. దానికి ఒక్కగానొక్క సంతానం గణపతి. అందరూ ముద్దుగా ‘గణ’ అని పిలుస్తారు. గజరాజు బిడ్డ కావటంతో గారాబంగా పెరిగింది. అడవిలో గణ ఆడిందే ఆట.. పాడిందే పాట. అందరినీ తన వారిగా భావిస్తుంది. మిగతా ఏనుగులతో సఖ్యతగా ఉంటుంది. అందరితో ఆడుకోవటం.. సరదాగా గడపటం గణ నైజం. ఎవరినీ నొప్పించదు. గజరాజు బిడ్డనని అహం ప్రదర్శించదు. గున్న ఏనుగులు సైతం గణతో ఆడేందుకు ఇష్టపడతాయి. గజరాజు బిడ్డకంటే గణగానే అందరితో కలిసిపోతుంది.

గణకు అప్పుడే వస్తున్న తన దంతాలంటే బాగా ఇష్టం. వాటిని చాలా జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉంటుంది. వాటిని ప్రతిరోజు అద్దంలో చూసుకుని మురిసిపోతుంది. దంతాలకు కాస్త మట్టి అంటినా వెంటనే శుభ్రం చేసుకునేది. వాటిని ఎవరు ముట్టుకోవాలని చూసినా.. గణకు నచ్చదు. అలాంటి సందర్భాల్లో ఒంటికాలిపై లేస్తుంది. ఒకరోజు గణ గున్న ఏనుగులను ఒక చోట చేర్చింది. అవి కారణం అడిగాయి. సమీపంలో పెద్ద చెరువు ఉందని.. సరదాగా స్నానాలకు పోదామని కోరింది. గున్న ఏనుగులకు వెళ్దామని ఉన్నా, పెద్ద ఏనుగులు అభ్యంతరం చెబుతాయని మిన్నకున్నాయి.

గణ మళ్లీ అడిగింది. అవి అసలు విషయం వివరించాయి. ఎవరికీ చెప్పకుండా పోదామని గణ అంది. గున్న ఏనుగులు గణ మాట కాదనలేక సరేనన్నాయి. ఒకరోజు గణ తోటి గున్నలతో కలిసి చెరువులో స్నానానికి బయలుదేరింది. అక్కడ గున్నలన్నీ జలకాలాడాయి. ఒకదాని మీద ఒకటి తొండాలతో నీళ్లు జల్లుకున్నాయి. సరదాగా ఆడుకున్నాయి. చీకటి పడటంతో గున్నలన్నీ అయిష్టంగానే చెరువులో నుంచి బయటకు వచ్చాయి. మెల్లగా ఇంటి దారి పట్టాయి. గణ చీకట్లో గంతులేస్తూ నడవసాగింది. చీకట్లో దారి కనపడటం లేదు. అయినా గణ గంతులు వేయడం మానలేదు. మిత్రులు వద్దన్నా వినలేదు. ఇలా చీకట్లో గంతులేస్తూ ఓ చెట్టును ఢీకొంది. అది పెద్ద చెట్టు కావటంతో గుణ కిందపడింది. బాధతో ఘీంకరించింది. మిగతా గున్నలకు చీకట్లో ఏం జరిగిందో అర్థం కాలేదు. నెమ్మదిగా గణ దగ్గరకు చేరుకున్నాయి. మిగిలినవన్నీ గణను మెల్లగా నిలబెట్టాయి.

‘గణా! నువ్వు గజరాజు గారాలపట్టివి. నీకు ఏమన్నా చెప్పాలంటే మాకు భయం. చీకట్లో ఆ గంతులేంటి? నీకేదైనా జరిగితే గజరాజుకు ఏమని సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా చెప్పు, నీకేం జరిగిందో!’ అన్నాయి. మీరేం కంగారు పడకండి. చీకట్లో పొరపాటున చెట్టును ఢీకొన్నాను. దాంతో కింద పడ్డాను. అంతకుమించి ఇంకేం కాలేదు’ అంది గణ. గున్నలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి.

కిందపడి లేచిన గణ తన తొండంతో ఒంటికి అంటిన దుమ్మును దులుపుకోసాగింది. ఇంతలో దాని తొండం దంతాల దగ్గరకు వచ్చింది. తొండానికి ఒక దంతం తగలటం లేదు. చెట్టును ఢీకొన్న సందర్భంలో అది విరిగిందని గ్రహించింది. గణకు దంతాలంటే ఎంత ప్రేమో చెప్పనక్కరలేదు. దానికి చాలా బాధనిపించింది. ఏడుపు తన్నుకొచ్చింది. జరిగిన విషయం మిత్రులతో పంచుకుంది. గున్నలు గణను ఓదార్చాయి. విరిగి కింద పడిన దంతాన్ని తొండంతో తీసుకుందది. ఇంతలో ఓ గున్న గణకు దంతాలంటే ఎంతిష్టమో తెలుసుకుంది. గున్నలను అక్కడే ఉండమని చెప్పి చీకట్లోనే ఎక్కడికో వెళ్లింది. ఓ చెట్టు జిగురును సేకరించింది. తెచ్చిన జిగురును గణకు చూపించింది. విరిగిన దంతాన్ని తీసుకుని జిగురు రాసింది. ఆ తర్వాత దాన్ని గణ దంతానికి అతికించింది. విరిగిన దంతం అతుక్కోవటంతో గణ ఆనందపడింది. మిగతావి కూడా హర్షం వ్యక్తం చేశాయి. చీకట్లో శ్రమించి జిగురు తెచ్చిన మిత్రుడికి కృతజ్ఞతలు చెప్పింది. అన్నీ సంతోషంతో ఇళ్లకు వెళ్లిపోయాయి.  
గణ.. తన దంతం విరిగిన విషయం గజరాజుకు చెప్పలేదు. అమ్మ పెట్టిన ఆహారం తిని పడుకుంది. ఉదయాన్నే నిద్రలేచింది. అద్దంలో మొహం చూసుకున్నది. విరిగిన దంతం వెక్కిరిస్తోంది. దాని కోసం పడుకున్న ప్రదేశంలో వెతకసాగింది. ఎక్కడా కనపడలేదు. గణకు ఏడుపు తన్నుకొస్తోంది. ఇంతలో గజరాజు గణ దగ్గరకు వచ్చింది. ఐరాను చూడగానే గణ సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది.

‘దేని కోసం వెతుకున్నావు?’ అని ప్రశ్నించింది గజరాజు. సమాధానం ఇవ్వలేదు గణ. ‘దీని కోసమేనా!’ అంటూ విరిగిన దంతం చూపించింది. గణ సిగ్గుతో గజరాజు వద్దకు వెళ్లింది. పొరపాటున చెట్టును ఢీకొనటంతో దంతం విరిగిందని చెప్పింది. దాన్ని జిగురుతో అతికించినా ఊడిపోయిందని వివరించింది. దానికి గజరాజు నవ్వింది. గణను దగ్గరకు తీసుకుని... ‘జిగురుతో దంతాలను ఒక్కటి చేయలేమని చెప్పింది. ఒకవేళ తాత్కాలికంగా అతుక్కున్నా, మళ్లీ ఊడిపోతుందని వాస్తవాన్ని వివరించింది. ‘పెద్దలకు చెప్పకుండా మీరు ఎక్కడకూ వెళ్లకూడదు. వెళ్లినా అనుమతి తీసుకోవాలి. ఒక్కోసారి చిన్న సంఘటనలే పెద్దవవుతాయి. చీకటి పడే వేళకు ఇళ్లకు చేరుకోవాలి. ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అయినా ఇప్పుడేం జరిగిందని బాధ పడుతున్నావు. మన ఏనుగులకు దంతాలు విరుగుతుంటాయి. మళ్లీ వస్తుంటాయి’ అంది.
ఆ మాట మళ్లీ చెప్పమని గజరాజును ముద్దుగా అడిగింది గణ. ‘అవును.. మనకు అప్పుడప్పుడు దంతాలు విరుగుతాయి.. మళ్లీ వస్తాయి. దాని కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నాలుగైదు నెలల్లో నీ దంతం మళ్లీ పెరుగుతుంది’ అని చెప్పింది గజరాజు. ఆ విషయం మిత్రులకు చెప్పాలని సంతోషంగా బయలుదేరింది గణ.  

తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని