‘లెక్క’జొన్న పొత్తు!!

ఆ ఊరి బడిలో రెండో తరగతి చదువుతున్నాడు రాజు. అప్పుడే బడి నుంచి ఇంటికి వచ్చి.. పుస్తకాల సంచిని బల్ల మీద పెట్టాడు. ‘ఆలస్యం చేయకుండా కాళ్లూ, చేతులూ శుభ్రంగా కడుక్కురా.. ఏదైనా తిందువు కానీ..’ అంది వాళ్లమ్మ కరుణ.

Updated : 18 Oct 2023 06:51 IST

ఆ ఊరి బడిలో రెండో తరగతి చదువుతున్నాడు రాజు. అప్పుడే బడి నుంచి ఇంటికి వచ్చి.. పుస్తకాల సంచిని బల్ల మీద పెట్టాడు. ‘ఆలస్యం చేయకుండా కాళ్లూ, చేతులూ శుభ్రంగా కడుక్కురా.. ఏదైనా తిందువు కానీ..’ అంది వాళ్లమ్మ కరుణ. రాజు పెరట్లోకి వెళ్లి.. కాళ్లూ, చేతులూ, ముఖం కడుక్కుని వచ్చి హాల్లో కూర్చున్నాడు. అప్పుడే కాల్చిన మొక్కజొన్న పొత్తును తీసుకొచ్చి ఇచ్చింది అమ్మ. ‘ముందు ఈ కంకి తిను. తర్వాత పాలు తీసుకొస్తాను. అవి తాగిన తర్వాత వెళ్లి ఆడుకోవచ్చు’ అంటూ వంటింట్లోకి వెళ్లిందామె. ‘సరేనమ్మా..’ అన్నాడు రాజు.
అయితే మొక్కజొన్న పొత్తు చేతిలోకి తీసుకుని తిందామనే సరికి, బడిలో టీచర్‌ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ముందురోజు ఉదయం విద్యార్థుల హాజరు వేస్తూ, గోవింద్‌ బడికి రాలేదన్న విషయాన్ని గమనించారు టీచర్‌. గోవింద్‌, రాజు ఒకటే తరగతి. ముందు రోజు కూడా గోవింద్‌ బడికి రానట్టుగా హాజరు పుస్తకంలో కనిపించింది. దాంతో ‘గోవింద్‌ నిన్న కూడా బడికి రాలేదు. ఎందుకు? ఎవరికైనా తెలుసా?’ అనడిగారు. తెలుసన్నట్లు చెయ్యి ఎత్తి నిలబడ్డాడు రవి. ‘ఎందుకు రాలేదు?’ అని టీచర్‌ మరోసారి అడగ్గానే.. ‘కడుపులో నొప్పిగా ఉండటంతో రాలేదట’ అన్నాడు. ‘అయ్యో.. ఎందుకు వచ్చిందో నొప్పి?’ అని మళ్లీ అడిగారు టీచర్‌.
దాంతో నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని కిసుక్కున నవ్వాడు రవి. ‘ఎందుకు నవ్వావు? మిత్రుడికి ఆరోగ్యం బాగాలేకపోతే నీకు నవ్వు వస్తుందా?’ అని కోప్పడ్డారు టీచర్‌. ‘అలా కాదు టీచర్‌.. నొప్పి ఎందుకు వచ్చిందో గుర్తుకొచ్చి నవ్వాను’ అని జవాబిచ్చాడు రవి. ‘ఎందుకు వచ్చిందట? సమస్యకు ఏదైనా పరిష్కారం తెలిస్తే చెప్పాలి కానీ, నవ్వకూడదు’ అంటూ సున్నితంగా మందలించారు టీచర్‌. ‘గోవింద్‌కి జామకాయలంటే చాలా ఇష్టం టీచర్‌. మొన్న సాయంత్రం వాళ్లింటికి ఎవరో బంధువులు వచ్చారట. వాళ్లు వస్తూ వస్తూ జామకాయలు తెచ్చారు. తనకు చాలా ఇష్టం కావడంతో అన్నీ ఒక్కడే తినేశాడట. అందుకే కడుపులో నొప్పి వచ్చిందట’ అని సమాధానమిచ్చాడు.
‘అసలు గోవింద్‌కి కడుపులో నొప్పి వచ్చిందని నీకెలా తెలుసు?’ అన్నారు టీచర్‌. ‘మేమంతా రోజూ సాయంత్రం కలిసే ఆడుకుంటాం టీచర్‌.. కానీ, నిన్న తను రాలేదు. కారణం ఏంటో తెలుసుకుందామని ఇంటికి వెళ్తే, వాళ్ల అమ్మ చెప్పారు’ అన్నాడు రవి. వెంటనే ‘ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా? ఇష్టమని ఏదీ అతిగా తినకూడదనీ.. ఎక్కువగా తింటే అరగక అలానే కడుపు నొప్పి వస్తుంది. ఏదైనా యంత్రాన్ని మరీ ఎక్కువగా వాడితే, వేడెక్కి అసలు పని చేయడమే ఆగిపోతుంది కదా..’ అన్నారు టీచర్‌. ‘అవును టీచర్‌’ అన్నారంతా. ‘మన పొట్ట కూడా అంతే. దాని శక్తి మేరకు ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. మనం తినగలిగిన దానికంటే ఎక్కువ తింటే.. ఇదిగో ఇలాగే అరగక కడుపులో నొప్పి వస్తుంది. కాబట్టి మీరంతా ఒక పని చెయ్యండి.. తినేటప్పుడు లెక్క పెట్టుకోండి. అప్పుడు ఏ సమస్యలూ రావు’ అన్నారు టీచర్‌.
అది గుర్తొచ్చిన రాజు.. మొక్కజొన్న పొత్తులో ఉన్న గింజల్ని లెక్కించటం మొదలు పెట్టాడు. ఎంతసేపు లెక్కపెట్టినా మర్చిపోయి, మళ్లీ మొదటికే రాసాగాడు. ఇంతలో వాళ్లమ్మ పాలు తీసుకుని వచ్చింది. కొడుకు మొక్కజొన్న పొత్తు తినకపోవటం చూసి.. కారణం అడిగింది. ఆ రోజు క్లాసులో జరిగిన సంగతి చెప్పాడు రాజు. అప్పుడు.. ‘నీకలా అర్థమైందా.. లెక్క పెట్టుకుని తినటం అంటే జామకాయలు, బత్తాయిలు, ఆపిల్స్‌లాంటివన్నమాట. అలాంటి పండ్లు ఒకటీ రెండూ తినాలి తప్ప.. అతిగా ఆరగించడం మంచిది కాదు. అయితే ఆ లెక్క మొక్కజొన్న పొత్తులు, దానిమ్మ గింజల్లాంటి వాటికి వర్తించదు. ఎన్ని గింజలని లెక్క పెడతాం? వీటిల్లో గింజలను కాకుండా మొత్తాన్ని ఒకటిగా అనుకోవాలి. అర్థమైందా?’ అని వివరించిందామె. ‘అలాగేనమ్మా..’ అంటూ సంతోషంగా మొక్కజొన్న పొత్తు తినేశాడు రాజు.

కన్నెగంటి అనసూయ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు