నక్క అక్కసు...!

సుందరవనంలో జిత్తు అనే పేరున్న నక్కకు తానే గొప్పదాన్ననే గర్వం పెరిగింది. దీంతో అది ఇతర జంతువులు ఎన్ని మంచి పనులు చేసినా, వాటిని అభినందించేది కాదు. అన్నింటిలోకి తానే గొప్పదాన్నని అందరికీ చెప్పేది.

Updated : 19 Oct 2023 06:51 IST

సుందరవనంలో జిత్తు అనే పేరున్న నక్కకు తానే గొప్పదాన్ననే గర్వం పెరిగింది. దీంతో అది ఇతర జంతువులు ఎన్ని మంచి పనులు చేసినా, వాటిని అభినందించేది కాదు. అన్నింటిలోకి తానే గొప్పదాన్నని అందరికీ చెప్పేది. ఒకసారి అడవిలో పక్షులు, జంతువులన్నీ సమావేశమయ్యాయి. అప్పుడు ఒక ఏనుగు లేచి.. ‘గానంలో పికం అనే పేరు గల కోకిల చాలా గొప్పది. దానికి సన్మానం చేయాలి’ అని అంది. జంతువులన్నీ తలూపాయి.

అప్పుడే అక్కడికి వచ్చిన నక్క ఇది విని ఆ జంతువులతో... ‘నేనే దానికన్నా చక్కగా పాడుతాను. దాని గొప్పతనం ఏముంది?’ అని అంది. అప్పుడు ఒక కుందేలు లేచి, మయూరం అనే నెమలిని చూపి.. ‘ఇది అద్భుతంగా నాట్యం చేస్తుంది’ అంది. అప్పుడు నక్క తన మూతి వంకరగా తిప్పుతూ.... ‘నాకు వచ్చినంత నాట్యం ఈ నెమలికి రానేరాదు’ అంది.

అలాగే ఒక ఎలుగుబంటి లేచి... ‘చిలుక పలుకులు ముద్దు ముద్దుగా ఉంటాయి కదూ!’ అని ఇతర జంతువులు, పక్షులతో అంది. అప్పుడు ఆ నక్క... ‘ఆ చిలుకలు నా కన్నా ముద్దు ముద్దుగా మాట్లాడతాయా’ అని అంది. ఈ సంగతిని జంతువులన్నీ కలిసి వెళ్లి మృగరాజు కేసరికి చెప్పాయి. అప్పుడు సింహం పాటల పోటీలను ఏర్పాటు చేసింది. పికం అందరికన్నా చాలా చక్కగా పాడింది. అందులో జిత్తు తన ప్రతిభ చూపుదామని గట్టిగా పాడబోయింది. అది విన్న జంతువులు, పక్షులు నవ్వాయి. సింహం వాటిని వారించింది.

అలాగే మరోసారి సింహం, నాట్యం పోటీలు ఏర్పాటు చేసింది. అందులో మయూరం చాలా బాగా నాట్యం చేసింది. నక్క కూడా దాంతోపాటు అందులో పాల్గొంది. అలవాటు లేని పని కావడంతో దానికి ఒక కాలు పట్టేసి... ‘అమ్మా!..’ అంటూ కూలబడింది. దాన్ని చూసి తిరిగి అన్ని జంతువులూ నవ్వాయి. సింహం వాటిని మళ్లీ వారించింది. ఆ తర్వాత ఒకరోజు కేసరితో పాటు జంతువులు, పక్షులు అన్నీ సమావేశమయ్యాయి. అన్నింటి ముందు కీరం అనే ఒక రామచిలుక ముద్దు ముద్దుగా మాట్లాడింది. దాని మాటలకు సింహం ఎంతో ఆనందించింది. రామచిలుక మాట్లాడినట్లు అక్కడే ఉన్న ఆ నక్క మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ, దాని కర్ణకఠోర గొంతు వల్ల సాధ్యం కాలేదు. అది అలా మాట్లాడేసరికి అక్కడ ఉన్న జంతువులన్నీ నవ్వాయి. ఎంత యత్నించినా నక్కకు, చిలుకలా మాట్లాడటం రాలేదు. అప్పుడు సింహంతో పాటు మిగతా జంతువులు, పక్షులు నక్కను ఇక మాట్లాడవద్దని, ఆపమని అన్నాయి.  
  ఒకసారి సింహం కురంగం అనే ఒక లేడిని పిలిచి, పొరుగు అడవిలోని పరుగు పందెంలో విజయం సాధించినందుకు ప్రశంసలతో ముంచెత్తింది. అది విజేతగా నిలిచి తమ అడవికి పేరు తెచ్చినందుకు అభినందించింది. తర్వాత దాన్ని దసరా వేడుకల్లో ఘనంగా సన్మానిస్తానని చెప్పింది.

ఈ సంగతి, ఇతర జంతువుల ద్వారా తెలుసుకున్న నక్క మిగతా జంతువుల ముందు.. ‘దీని గొప్పతనం ఏముంది? నేను దీనికన్నా వేగంగా పరిగెడతాను. నన్ను పంపిస్తే నేను కూడా విజేతను అయ్యేదాణ్ని’ అని అంది. అది విన్న జంతువులు వెళ్లి సింహంతో చెప్పాయి. అప్పుడు సింహం నక్కను పిలిపించి.. ‘ఓ జిత్తూ! ఆ లేడి పొరుగు అడవిలో జరిగిన పరుగు పందెంలో విజేతగా నిలిచి మన అడవికి పేరు తెచ్చింది. దాన్ని అభినందించకపోగా, అవమానిస్తూ మాట్లాడతావా! నువ్వు అలా పరిగెత్తగలవా!’ అని అడిగింది.

అప్పుడు నక్క... ‘మృగరాజా! ఆ లేళ్లకు, నాకు పరుగు పందెం పెట్టండి. మీకే తెలుస్తుంది’ అని అంది. సరేనన్న మృగరాజు లేళ్లు, జిత్తుకు పరుగు పందెం ఏర్పాటు చేసింది. లేళ్లన్నీ నక్కతో పాటు పరిగెత్తడానికి సిద్ధమయ్యాయి. ఎలుగుబంటి సైగ చేయగానే అవన్నీ పరిగెత్తాయి. నక్కేమో లేళ్ల మధ్యలో చిక్కుకొని, కింద పడిపోయింది. అది ఆగమన్నా ఆగకుండా, లేళ్లన్నీ దాన్ని తొక్కుతూ, దాని మీద నుంచి వేగంగా పరిగెత్తాయి. చివరకు నక్క గాయాలపాలైంది. కురంగం ప్రథమ స్థానం పొందింది.

అది చూసిన సింహం... ‘నక్కా! నేను నీకు చెప్పలేదా! అనవసరంగా ఈ లేళ్ల కన్నా వేగంగా పరిగెత్తుతానని అన్నావు. ఇప్పుడేమైంది. అందరిలో నగుబాటు అవడమే కాకుండా, గాయాలపాలయ్యావు. ఎవరి గొప్పతనం వారికే ఉంటుంది. నువ్వు లేని గొప్పలు చెప్పుకొన్నావు. ఒకరికే ప్రత్యేకించిన పనులు మరొకరు చేయరాదు. నేను చెబితే నువ్వు వినలేదు’ అని అంది. అప్పుడు నక్క ఏమీ మాట్లాడలేదు.

తర్వాత సింహం కల్పించుకొని... ‘ఈ నక్కకు ఇతరులను అభినందించడం ఇష్టం లేదు. దీనికి అసూయ ఉంది. అందువల్లనే దీనికి ఎవరి దగ్గర కూడా మంచి పేరు లేదు. ఈ జిత్తులమారికి ఇతరులను మోసం చేయడం తప్ప, ఏదీ రాదు. మనకు ఆ కళలు, నైపుణ్యాలు రాకున్నా చూసి ఆనందించి, అవి ప్రదర్శించిన వారిని అభినందించాలి. అప్పుడే ఆ కళలు, వారిని ప్రోత్సహించినట్లు అవుతుంది. అటువంటి కళలు, నైపుణ్యాలు వారికి దేవుడు ఇచ్చిన వరాలు. అంతేకానీ నేనే గొప్ప అని విర్రవీగుతూ, ఇతరులను అభినందించకుండా ఉంటే మనల్ని కూడా ఎవరూ గౌరవించరు. మనకు ఎవరూ విలువనీయరు. మనం అందరిలో చులకన అవుతాం’ అని అంది. దాని మాటలకు నక్కలో గర్వం తొలగిపోయింది. అప్పటి నుంచి... అది నేనే గొప్ప అనకుండా ఇతరుల గొప్పతనాన్ని అంగీకరించి, వాటిని అభినందించడం ప్రారంభించింది.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని