‘పాడమని నన్నడగవలెనా?’

అదొక చిట్టడవి. అందులో అన్ని రకాల జంతువులు, పక్షులు కలిసిమెలిసి హాయిగా జీవించేవి. ఆ అడవిలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా.. మిగతా జీవులన్నీ తప్పనిసరిగా ఒకదానికొకటి సహకరించుకునేవి.

Updated : 20 Oct 2023 05:13 IST

అదొక చిట్టడవి. అందులో అన్ని రకాల జంతువులు, పక్షులు కలిసిమెలిసి హాయిగా జీవించేవి. ఆ అడవిలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా.. మిగతా జీవులన్నీ తప్పనిసరిగా ఒకదానికొకటి సహకరించుకునేవి. చిలుకమ్మ తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ పలకరించేది. నెమలి నాట్యంతో అలరించేది. మధురం అనే కోకిల తన తియ్యటి పాటలతో అందరినీ మురిపించేది. అలా చిలుకమ్మ మాట, నెమలి ఆట, కోకిల పాట లేనిదే ఏ శుభకార్యమూ పూర్తి కాదు.

ఒక సాయంత్రం ‘మధురం’ ఉండే వేప చెట్టు మీదకు... ఎక్కడి నుంచో మరో కోకిల వచ్చి వాలింది. కొత్తగా వచ్చిన దాన్ని చూడగానే.. ‘ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేంటి?’ అని అడిగింది. ‘నా పేరు పరిమళం. మీ పక్క అడవిలోనే ఉంటాను. అక్కడి క్రూర జంతువులు పులి, సింహం వల్ల మనలాంటి చిన్న జీవుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది’ అని జవాబిచ్చింది. ‘అయితే, నువ్వు పాటలు పాడతావా?’ అని అడిగింది మధురం. ‘పాడమని నన్నడగవలెనా?’ అంటూ పరిమళం గొప్పలు పోయింది. ‘అలాగా.. అయితే ఒక పాట పాడు’ అని మధురం అడగ్గానే.. అదో పాట పాడేసింది. ‘నా కంటే బాగా పాడావు. నువ్వు ఇక్కడుంటే ఇక నన్నెవరూ పట్టించుకోరు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో’ కోపంగా అంది మధురం. ‘సాటి కోకిలవు కాబట్టి నన్నేదో ఆదరిస్తావనే నమ్మకంతో వెతుక్కుంటూ వచ్చాను. ఆశగా వచ్చిన నన్ను వెళ్లిపొమ్మని చెప్పకు’ అని ప్రాధేయపడిందది. ‘ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్లిపోవాల్సిందే..’ అని గట్టిగా కసిరింది మధురం. ఇక అక్కడ ఏమాత్రం ఉండలేక.. బాధగానే ఎగురుకుంటూ వెళ్లిపోయింది పరిమళం.

ఆరోజు అడవికి మంత్రయిన కుందేలు జన్మదినం. అలవాటులో భాగంగా చిలుకమ్మ, నెమలి కలసి బయలుదేరాయి. అక్కడ పాడేందుకు రమ్మంటూ దారిలోనే ఉన్న మధురం వద్దకు వెళ్లాయవి. ‘నేను పుట్టినరోజుకి వస్తాను కానీ పాడలేను. కొంచెం గొంతు నొప్పిగా ఉంది’ అని కారణం చెప్పిందది. ‘మంత్రి పుట్టినరోజుకు నీ పాట లేకుంటే ఏం బాగుంటుంది చెప్పు?’ అని అడిగింది నెమలి. ‘గొంతు బాగోకపోతే మధురం మాత్రం ఏం చేయగలదు? కార్యక్రమానికి వస్తే చాలులే..’ అంటూ మధురాన్ని సమర్థించింది చిలుకమ్మ. సరేనంటూ ఆ మూడూ కలిసి కుందేలు ఇంటికి వెళ్లాయి. అవి అక్కడికి చేరుకున్నాయో లేదో వెంటనే కోతి ఎదురొచ్చి.. ‘మీరొచ్చారు.. సందడి మొదలైంది. మీ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు’ అంది. ఇంతలో ‘రండి.. రండి..’ అంటూ జింక, జిరాఫీ వాటిని ఆనందంగా ఆహ్వానించాయి.

ముందుగా చిలుకమ్మ పలుకులతో అక్కడున్న అందరికీ సంతోషం వేసింది. నెమలి నాట్యంతో ఆ ఆనందం రెట్టింపైంది. ‘ఇప్పుడు మధురం పాడుతుంది’ అని కోతి అనగానే.. ‘గొంతు బాగోలేదు. నేను పాడలేను’ అందది దీనంగా. ‘అయ్యో..’ అన్నాయా జీవులన్నీ. ‘మధురం గొంతు బాగుంటే.. మనం ఇంతలా అడగక్కర్లేదు. దానికి పాడే పరిస్థితి లేనప్పుడు బలవంతం చేయవద్దు’ అంది జింక. ఈలోగా ‘పాట లేదని బాధ పడకండి. పాట పాడి మనల్ని అందరినీ ఆనందపరచడానికి పరిమళం అనే కోకిల మన ముందుకొచ్చింది’ అని కోతి అనగానే.. మధురంతో సహా అక్కడున్న జీవులన్నీ ఆశ్చర్యపోయాయి. అప్పుడే అక్కడికి వస్తున్న పరిమళం వైపు ఆశ్చర్యంగా చూశాయి. దాన్ని వేదికపైకి తీసుకెళ్లింది కోతి. ‘పక్క అడవిలో నుంచి వచ్చాను’ అంటూ దాని వివరాలు చెప్పి, పరిచయం చేసుకుంది.

అన్నీ పాడమనడంతో.. అది చక్కగా ప్రారంభించింది. పరిమళం వైపు వింతగా చూస్తున్న మధురం వద్దకు కోతి వచ్చింది. ‘ప్రతిభకు ప్రోత్సాహం తోడైతేనే అది రాణిస్తుంది. అసూయతోడైతే ప్రగతి అక్కడితో ఆగిపోతుంది. పరిమళాన్ని నువ్వు వెళ్లిపొమ్మన్నప్పుడు, నేనక్కడే చెట్టు పైన ఉన్నాను. నీ మాటలన్నీ విన్నాను. బాధగా ఎగిరిపోతున్న పరిమళాన్ని నేను ఆదరించాను. ప్రతిభ అనేది ఏ ఒక్కరి సొంతమూ కాదు. ఏ ఒక్కరితోనూ ఆగిపోదు. స్వచ్ఛమైన నదీ ప్రవాహంలా ప్రతిభ ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పరిమళాన్ని ప్రోత్సహించు. నీలో అసూయ లేదని నిరూపించుకో’ అంది కోతి. ఆ మాటలతో మధురంలో మార్పు వచ్చింది. ‘నా కంటే గొప్పగా పాడావు’ అంటూ అందరి ముందూ పరిమళాన్ని మెచ్చుకుంది. మధురం తనను మెచ్చుకున్నందుకు.. దాని వైపు ఆప్యాయంగా చూసింది పరిమళం. అందుకు కారణమైన కోతికి ధన్యవాదాలు తెలిపిందది.  
కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని