తెలివి ఒక్కరి సొత్తేనా?

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ‘చంచల’ అనే పేరుగల నక్క ఉండేది. పేరుకు తగినట్లే అది జిత్తులమారిది. ఒకరోజు దానికి కుందేలు మాంసం తినాలని కోరిక కలిగింది. కానీ, ఎంత ప్రయత్నించినా అవి దాని చేతికి చిక్కడం లేదు. దాంతో ఆ నక్క కోరిక రోజురోజుకూ పెరిగిపోసాగింది. చివరికి పిల్ల కుందేలునైనా వేటాడాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయమే, కుందేళ్లు ఎక్కువగా తిరిగే చెట్టు కిందున్న గుబురు పొదల దగ్గర మాటువేసింది.

Updated : 22 Oct 2023 04:48 IST

నగనగా ఒక అడవి. ఆ అడవిలో ‘చంచల’ అనే పేరుగల నక్క ఉండేది. పేరుకు తగినట్లే అది జిత్తులమారిది. ఒకరోజు దానికి కుందేలు మాంసం తినాలని కోరిక కలిగింది. కానీ, ఎంత ప్రయత్నించినా అవి దాని చేతికి చిక్కడం లేదు. దాంతో ఆ నక్క కోరిక రోజురోజుకూ పెరిగిపోసాగింది. చివరికి పిల్ల కుందేలునైనా వేటాడాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయమే, కుందేళ్లు ఎక్కువగా తిరిగే చెట్టు కిందున్న గుబురు పొదల దగ్గర మాటువేసింది. అది అనుకున్నట్లే ఒక పిల్ల కుందేలు పొదల్లోంచి బయటకు వచ్చింది. చెట్టు కింద దిగులుగా కూర్చున్న నక్కను చూసి కాస్త దగ్గరకెళ్లింది.

‘నక్క బావా.. ఏం జరిగింది? ఎందుకలా దిగాలుగా ఉన్నావు?’ అని జాలిగా అడిగింది. ‘నీకెందుకు? నువ్వేమైనా ఆరుస్తావా.. తీరుస్తావా? పెద్దదానివైతే చెప్పేదాన్ని కానీ నువ్వేమో చిన్న కూనవి..’ అంది చిరాకు నటిస్తూ.. ‘ఎందుకు చెయ్యలేను? ఇంతకీ అసలేమైందో చెప్పు?’ అని మళ్లీ అడిగిందది పౌరుషంగా. ‘నా కాలిలో ముళ్లు దిగింది. తియ్యగలవా?’ అని అడిగింది వెటకారంగా. ‘ఓస్‌.. అంతేనా? ఎందుకు తియ్యలేను?’ అంటూ ఒక అడుగు ముందుకేసింది. ‘ఏ కాలు?’ అని అడిగింది. ఒకసారి కుడి కాలని, మరోసారి ఎడమ కాలని విసిగించింది నక్క. కానీ, లేని ముళ్లు దొరకదు కదా.. అయినా, ‘దొరికిందా?’ అని పిల్ల కుందేలుని అడిగింది నక్క. లేదని అడ్డంగా తలూపిందది.

‘ముందే చెప్పాను.. నీ వల్ల కాదని..’ అంది నక్క. ‘లేదు.. లేదు.. దొరుకుతుంది.. కాస్త ఓపిక పట్టు.. మళ్లీ చూస్తా’ అంది మరింత దగ్గరగా వచ్చి.. దాని ఉపాయం ఫలించబోతున్నందుకు లోలోపలే ఆనందించిందా నక్క. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక కోతి.. నక్కను, దానికి దగ్గరగా ఉన్న పిల్ల కుందేలును చూసింది. ప్రమాదాన్ని పసిగట్టి.. ఎలాగైనా కుందేలును రక్షించాలని వాటి దగ్గరకు వెళ్లింది. ‘ఏంటి పిల్ల కుందేలా.. ఇక్కడేం చేస్తున్నావు? ఇంటికెళ్లు..’ అంది కోతి. ‘వెళ్తుందిలే.. నా కాలిలో ముళ్లు దిగింది. కాస్త తీసిపెట్టి సాయం చేయమని నేనే దాన్ని అడిగా’ అని బదులిచ్చింది నక్క. ‘భలే దానివే.. నీకు మరే జంతువూ దొరకనట్టు ఈ బుజ్జి కూనే కనిపించిందా? అయినా, మృగరాజు ఇటే వస్తోంది.. పిల్ల జీవులతో పనులు చేయిస్తే సింహానికి నచ్చదని నీకు తెలుసు కదా..’ అని హెచ్చరించింది కోతి. అవునంది నక్క.

‘ఇలా చూసిందంటే మన పని అయిపోయినట్టే.. కావాలంటే నీ కాలికి గుచ్చుకున్న ముళ్లును నేను తీస్తానులే..’ అంది కోతి. ‘నిజమే.. మృగరాజు చూసిందంటే, మనం ఏం చెప్పినా వినిపించుకోదు. ప్రాణాలతో ఉంటే ఈరోజు కాకపోతే ఇంకోరోజైనా కుందేలు మాంసం తినొచ్చు’ అని మనసులోనే అనుకుంది నక్క. దాంతో వెంటనే ‘సరే నువ్వెళ్లు. మీ అమ్మ నీకోసం వెతుకుతుంటుంది. కోతి బావతో తీయించుకుంటానులే..’ అంది. తుర్రుమంటూ పొదల్లోకి వెళ్లిపోయిందా కుందేలు కూన. ‘కోతి బావా.. ఈ ముళ్లును తీసి నా బాధను తగ్గించవచ్చు కదా..’ అని అడిగింది నక్క. మనసులో మాత్రం.. ‘కుందేలు పోతే పోయింది. దానికంటే పెద్ద జంతువు కోతి దొరికింది. మృగరాజు ఇటు నుంచి వెళ్లిపోయాక దీని అంతు చూడాలి’ అనుకుందది.

ఇంతలో ‘ఉండు వస్తున్నా.. ముళ్లును ముళ్లుతోనే తీయాలంటారు కదా..’ అంటూ పెద్ద తుమ్మ ముళ్లును తీసుకొచ్చింది కోతి. ఏ కాలు అని అడుగుతూనే.. ఆ ముళ్లుతో నక్క రెండు కాళ్లనూ గీరి గీరి పెట్టిందది. ఇంతలో ‘మృగరాజు ఇంకా రాలేదేంటి?’ అని బాధగా అడిగింది. ‘ఇక్కడే ఉండు.. చెట్టెక్కి చూస్తాను’ అంటూ చిటారు కొమ్మను చేరిందా కోతి. అక్కడ ఓ పండు కోసుకుని తినసాగింది. ‘మృగరాజు జాడ కనిపించిందా?’ అని అడిగింది నక్క. ‘లేదు.. వేరే వైపు వెళ్లిపోయిందేమో..’ అంది నవ్వుతూ.. ‘సరే అయితే.. నువ్వు ఇటు
రా..’ అందది.

‘పిచ్చిదానా.. నువ్వు పిలవగానే రావటానికి నేనేమైనా కుందేలు పిల్లనా? నేను అబద్ధమాడిన సంగతి నీకింకా అర్థం కాలేదా? నిజంగా మృగరాజు కనిపిస్తే, దాని వెంటే వస్తాం కానీ ఇలా ముందే ఎలా రాగలం? తెలివి నీ ఒక్కదాని సొత్తేనా ఏంటి’ అంటూ గడుసుగా జవాబిచ్చిందా కోతి. ‘నోటిదాకొచ్చిన ఆహారం పోయింది.. గాయాలు మిగిలాయి’ అనుకుంటూ లోలోపలే ఏడ్చింది నక్క.  

ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని