సిరి మారింది.. మారాం మానింది!

‘ఈ స్కూల్‌ డ్రెస్సు నాకొద్దు. మొన్న కొన్న కొత్త గౌను వేసుకుంటాను’ ఏడుస్తూ అంది సిరి. ‘స్కూలుకు యూనిఫాం మాత్రమే వేసుకోవాలి. వేరే దుస్తులు వేసుకోకూడదు’ అని అమ్మ చెప్పింది.

Updated : 23 Oct 2023 03:33 IST

‘ఈ స్కూల్‌ డ్రెస్సు నాకొద్దు. మొన్న కొన్న కొత్త గౌను వేసుకుంటాను’ ఏడుస్తూ అంది సిరి. ‘స్కూలుకు యూనిఫాం మాత్రమే వేసుకోవాలి. వేరే దుస్తులు వేసుకోకూడదు’ అని అమ్మ చెప్పింది. ‘ఎందుకు వేసుకోకూడదు? రోజూ ఒకటే డ్రెస్సు నాకొద్దు’ అని సిరి అంది. ‘విసిగించకు. నిన్నే టీచర్‌ కోప్పడతారు’ అని అమ్మ అంది. ‘వర్షం వస్తే బూట్లు తడిశాయని చెప్పులు వేసుకుంటాగా. అప్పుడు నువ్వు ఆ సంగతి డైరీలో రాస్తుంటావు. ఇప్పుడు కూడా స్కూల్‌ డ్రెస్సు ఆరలేదని డైరీలో రాసివ్వు. అప్పుడు నన్ను ఏమీ అనరు’ అని మొండిగా అంది సిరి.

‘అలా అబద్ధాలు రాయకూడదు సిరీ! కావాలంటే ఇంటికి రాగానే నీకు ఇష్టమైన డ్రెస్సు వేసుకుందువుగానీ. మా మంచి సిరి కదూ! సాయంత్రం షికారుకు తీసుకువెళతా, సరేనా!’ అని అమ్మ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. షికారు అనేమాట వినగానే సిరికి తెగ హుషారు వచ్చేసింది. ‘నేనడిగింది కొనివ్వాలి మరి’ అని పెంకిగా అడిగింది సిరి. ‘అలాగేలే...’ అని అంది అమ్మ గడియారం వైపు చూస్తూ. సిరి స్కూలు డ్రెస్సు తొడుక్కుని, బూట్లు వేసుకుంటుండగా బస్సు హారన్‌ వినిపించింది. ‘సిరీ! త్వరగా స్కూలు బ్యాగు తీసుకో’ అంది. ఆ వెంటనే అమ్మ గబగబా సిరిని బస్సు ఎక్కించి, లంచ్‌ బ్యాగు అందించింది. సిరి కిటికీ పక్క సీట్లో కూర్చుని, బై.. బై.. చెబుతుండగా బస్సు కదిలింది. ‘హమ్మయ్య, ఈ రోజు గడిచింది. రోజూ స్కూల్‌ డ్రెస్సు వద్దని పేచీయే. నాలుగో తరగతికి వచ్చింది. ఎప్పుడు అర్థం చేసుకుంటుందో... ఏమో!’ అనుకుంటూ ఇంట్లోకి నడిచింది అమ్మ.

ఆ రోజు క్లాసులో విద్య అనే అమ్మాయి చుట్టూ పదిమంది పిల్లలు చేరారు. ‘విద్యా! మూడు రోజుల్లో నీ పుట్టిన రోజు వస్తోందిగా. చక్కగా కొత్త డ్రెస్సు వేసుకు రావచ్చు’ అంది సిరి. ‘మాకు ఏం చాక్లెట్లు ఇస్తావు’ అని ఇంకో గడుగ్గాయి అడిగింది. ‘మా నాన్న ఊరెళ్లారు. మా తమ్ముడికి జ్వరంగా ఉంది. దాంతో మా అమ్మకు.. నాకు కొత్త డ్రెస్సు కొనడానికి కుదరలేదు. పుట్టినరోజు కూడా స్కూల్‌ డ్రెస్సు మాత్రమే వేసుకుని రావాలని రూల్‌ ఉంటే ఎంత బాగుండేదో’ అంది విద్య. వెంటనే సిరి అందుకుని.. ‘చాల్లే...! ఆ ఒక్కరోజు కూడా వేరే డ్రెస్సు వద్దంటావేమిటి? మీ అమ్మను ఆన్‌లైన్‌లో అయినా తెప్పించమను’ అంది. అంతలో టీచర్‌ వస్తున్న అలికిడి కావడంతో అంతా ఎవరి స్థానాలకు వారు వెళ్లిపోయారు.

ఇంటికి చేరేసరికి పెద్దమ్మ కూతురు దివ్య కనిపించడంతో.... ‘అక్కా!’ అని ఆనందంగా, ఆశ్చర్యంగా అంది సిరి. ‘సిరీ..! వచ్చావా! మీ అమ్మ, నీ గురించే చెబుతోంది’ అని దివ్య నవ్వుతూ అంది. ‘పెద్దమ్మ ఏదీ?’ అని అడిగింది సిరి. ‘మా అమ్మ వేరే పని మీద వెళ్లింది. ఇక్కడికి వచ్చి నన్ను తీసుకెళతానంది. అందుకే స్కూలు నుంచి ఇటే వచ్చేశా’ అంది దివ్య. ‘అందుకేనా స్కూల్‌ డ్రెస్సులో ఉన్నావు’ అంది సిరి. ‘మళ్లీ స్కూల్‌ డ్రెస్సు అని మొదలుపెట్టావా?’ అని నవ్వుతూ అని, ‘ముందు కాళ్లు, చేతులు కడుక్కుని, డ్రెస్‌ మార్చుకుని రా’ అంది అమ్మ. సిరి సరేనంటూ లోపలకు వెళ్లి, అయిదు నిమిషాల్లో మళ్లీ దివ్య దగ్గరకు వచ్చింది.

‘స్కూల్‌ డ్రెస్సు అంటే నాకు చిరాకు’ అంది సిరి. ‘చిరాకు ఎందుకు?’ అని అడిగింది దివ్య. ‘రోజూ అందరూ ఒకే రకం దుస్తులు వేసుకుంటే ఏం బాగుంటుంది. నాకు రకరకాల డ్రెస్సులు ఉన్నాయి. అవి వేసుకోకుండా ఈ స్కూల్‌ డ్రెస్సు నియమం ఒకటి’ అంది కోపంగా. దివ్య చిరునవ్వు నవ్వి... ‘సిరీ! ఒక్కసారి నేను చెప్పినట్లు ఆలోచించు. స్కూల్‌ డ్రెస్సు ఉండడం వల్ల, నువ్వు ఫలానా స్కూలు విద్యార్థివని చెప్పకుండానే గుర్తు పడతారు. మీ స్కూలు పిల్లలందరికీ అదొక గుర్తు అన్నమాట. ఒకే రకం డ్రెస్సు వేసుకోవడం వల్ల అందరం ఒకటే. అంతా సమానమే అనే భావన కలుగుతుంది. పిల్లలంతా కలిసిమెలిసి ఉండడానికి అది తెలియకుండానే తోడ్పడుతుందన్నమాట. పైగా అందరి అమ్మానాన్నల దగ్గర రకరకాల డ్రెస్సులు కొనడానికి బోలెడన్ని డబ్బులు ఉండవు కదా. డబ్బు ఉన్నవాళ్లు కొత్త కొత్త డ్రెస్సులు వేసుకు వస్తే, డబ్బులేని వాళ్లు తమ దుస్తులు బాగాలేవని బాధపడతారు కదా! అందువల్ల స్కూల్‌ డ్రెస్సు ఉంటే పిల్లల మధ్య గొప్ప, పేద తేడాల సమస్య రాదు. నాకైతే మా స్కూల్‌ డ్రెస్సు అంటే చాలా ఇష్టం. నేనిప్పుడు పదో తరగతి కదా. ఈ సంవత్సరం అయిపోతే స్కూల్‌ డ్రెస్సు వేసుకునే అవకాశం లేదని నాకు బాధగా ఉంది. అందుకే పదో తరగతి తర్వాత ఈ స్కూల్‌ డ్రెస్సు వేసుకోకపోయినా, కొంతకాలం గుర్తుగా దాచుకోవాలనుకుంటున్నాను’ అని చెప్పింది. సిరి వెంటనే... ‘నువ్వు చెప్పింది నిజమే. నేను ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. ఇప్పుడు నా స్కూల్‌ డ్రెస్సు నాక్కూడా ఎంతో బాగుందనిపిస్తోంది’ అంది. ఆ మాటలు విన్న అమ్మ ఎంతో ఆనందించింది.

జె.శ్యామల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని