నమ్మకమే అసలు సిసలైన ధైర్యం!

కింజరవనం అటవీ ప్రాంతంలో పిల్ల కోతులు బాగా అల్లరి చేస్తూ ఉండేవి. అడవికి సమీపంలో ఉండే గ్రామాలకు వెళ్లి అక్కడ ఉన్న వారి వస్తువులను తీసుకుని వచ్చి, అడవిలో అన్నిచోట్ల వాటిని విసిరేస్తూ ఉండేవి! వాటి వల్ల అడవిలో ఉన్న జంతువులు తరచూ ఇబ్బంది పడేవి.

Updated : 25 Oct 2023 03:56 IST

కింజరవనం అటవీ ప్రాంతంలో పిల్ల కోతులు బాగా అల్లరి చేస్తూ ఉండేవి. అడవికి సమీపంలో ఉండే గ్రామాలకు వెళ్లి అక్కడ ఉన్న వారి వస్తువులను తీసుకుని వచ్చి, అడవిలో అన్నిచోట్ల వాటిని విసిరేస్తూ ఉండేవి! వాటి వల్ల అడవిలో ఉన్న జంతువులు తరచూ ఇబ్బంది పడేవి. ఒక్కొక్కసారి ప్రమాదాలకు కూడా గురవుతూ ఉండేవి. ఆ వనానికి ఒకవైపు కృష్ణాపురం, మరొకవైపు రాధాపురం అనే గ్రామాలు ఉండేవి. కృష్ణాపురం వారు రాధాపురం వెళ్లాలన్నా, రాధాపురం వారు కృష్ణాపురం వెళ్లాలన్నా అడవిని దాటాల్సిందే. లేదంటే చుట్టూ తిరిగి వెళ్లాలి. దానివల్ల చాలా సమయం వృథా అయ్యేది. అందుకని ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ అడవిని దాటి వెళ్లడానికే మొగ్గు చూపుతూ ఉండేవారు. అయితే ఆ అడవిలో ఉన్న సాధు జంతువులు మాత్రమే పగటిపూట కనిపించేవి. పులి, సింహం వంటి క్రూర మృగాలు రాత్రుల్లో సంచరించేవి. దానివల్ల వారు ఏ ఇబ్బందులూ లేకుండా పగటి పూట అడవిని దాటి వెళుతూ ఉండేవారు.

ఈ మధ్యకాలంలో ఆ అడవిలో దెయ్యాలు తిరుగుతున్నాయని బాగా ప్రచారం జరగడంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండసాగారు. దెయ్యాలు అడవిలో ఉన్నాయని.. వాటిని మేము చూశామని, చాలామంది చెప్పుకోవడంతో పగటిపూట కూడా అడవి దాటి వెళ్లడానికి జనాలు భయపడుతూ ఉండేవారు. కృష్ణాపురంలో ఉండే సోమయ్య అనే రైతు కొడుకు గోవిందు, పట్నం నుంచి చదువు పూర్తి చేసుకుని ఊరు వచ్చాడు. ఊర్లో జనాలందరూ దెయ్యాల గురించి చెప్పుకుంటూ భయపడుతూ ఉండటం చూసి కొంతమంది గ్రామస్థులతో... ‘మీరంతా దెయ్యాలు ఉన్నాయని భ్రమ పడుతున్నారు. ఈ రోజుల్లో దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి? అదంతా మనం మానసికంగా దెయ్యాలు ఉన్నాయి అనుకుని భయపడటమే’ అన్నాడు.. కానీ ఎవరూ అతని మాటలు వినలేదు.

‘సరే అయితే.. నేనే ఈ దెయ్యాల సంగతి ఏంటో తేలుస్తాను’ అన్నాడు. ఊళ్లో వారందరూ... ‘వద్దు బాబు వద్దూ... నువ్వు ఏదో చదువు పూర్తి చేసుకుని వచ్చిన వాడివి. పట్నం వెళ్లి ఏదైనా పని చూసుకో. ఇక్కడ ఇటువంటి సమస్యలు మామూలే’ అన్నారు. ‘కాదు కాదు.. దెయ్యం సంగతి ఏంటో నేను తేల్చుకునే.. పట్నం వెళ్తాను’ అన్నాడు గోవిందు. కొన్ని రోజులు గడిచాయి. అడవిలో దెయ్యాల అలజడి ఏమాత్రమూ తగ్గలేదు. తెల్లని కాంతితో దెయ్యాన్ని చూశామని కొందరు చెప్పడంతో, వారిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నాడు గోవిందు.

మరుసటి రోజు రాత్రి తను ఒక్కడే ఒక లాంతరు తీసుకొని అడవి బాట పట్టాడు. దాదాపు అడవి మధ్యలోనికి వెళ్లగానే దూరంగా... ఏదో వెలుతురు కనిపించింది. ఒక్కసారిగా నడిచేవాడు ఆగి, ఒక్క అడుగు వెనక్కి వేశాడు. మరొకసారి దాని వైపు తీక్షణంగా చూశాడు. ‘అది నిజంగా దెయ్యమేనా?’ అని మనసులో అనుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లాడు. అది ఒక చెట్టుపై నుంచి రావడంతో ఆ చెట్టుకేసి చూశాడు. పెద్ద మర్రిచెట్టు, దాని కొమ్మల నుంచి ఆ కాంతి వస్తోంది. ధైర్యంగానే ఆలస్యం చేయకుండా ఆ చెట్టును ఎక్కాడు. మరుసటి రోజు ఊరి వారందరినీ పిలిచి... ‘రాత్రి నేను అడవిలోకి వెళ్లి ఆ దెయ్యాన్ని చూశాను. దాన్ని ఈ మూటలో బంధించి పట్టుకొని వచ్చాను!’ అన్నాడు సంచిని చూపిస్తూ.

‘అమ్మో దెయ్యమా!?’ అంటూ అందరూ నాలుగు అడుగులు వెనక్కి వేశారు. ‘నేను దెయ్యాన్ని చూశాను. నేను దాన్ని పట్టుకున్నాను. అయినా నాకేమీ కానిది.. మీకు ఏమవుతుంది?! మీరు ఎందుకలా భయపడుతున్నారు?’ అన్నాడు గోవిందు. అందరూ మళ్లీ ముందుకు వచ్చారు. గుంపులో ఉన్న ఒక వ్యక్తి... ‘నేను ముందే చెప్పానా.. దెయ్యం ఉంది అని! అదిగో దాన్ని మన గోవిందు మంత్రం సహాయంతో బంధించి తీసుకొచ్చాడు’ అన్నాడు. ఆ మాటలు విని, గోవిందు ఒక్క నవ్వు నవ్వి... ‘మంత్రాలూ లేవు చింతకాయలు అసలే లేవు. నేను చెప్పేది మీరు వినకుండా.. మీ అంతట మీరు ఏవేవో ఊహించుకోకండి’ అని, గోవిందు మూటను విప్పడానికి ప్రయత్నం చేస్తుండగా... అక్కడ ఉన్న జనాలు అతణ్ని వద్దని వారించారు. ‘మీరు అసలు భయపడకండి. నేను చెప్పేది వినండి. ఆ తర్వాత మీరు మీ అభిప్రాయం చెప్పండి’ అంటూ తను ఆ మూటను విప్పడం ప్రారంభించాడు.

అందరూ ఆశ్చర్యంతో కూడిన భయంతో లోపలి నుంచి దెయ్యం ఎలా వస్తుంది.. ఎటు పోతుంది అంటూ చూడసాగారు. లోపల చెయ్యి పెట్టిన గోవిందు నిదానంగా చెయ్యిని బయటికి తీయసాగాడు. చివరిగా అతను చేతిలో ఉన్న దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ‘ఏమిటిది దెయ్యం కాదా అది అద్దంలాగుందే!?’ అన్నారు. ‘అవును ఇది ఒక అద్దమే. ఇది మన అడవిలో ఒక చెట్టు మీద పడి ఉంది. ఉదయం పూట సూర్యకాంతి, రాత్రి పూట చంద్రుని వెలుగు అద్దం మీద పడుతోంది. కాంతి పరావర్తనం వల్ల ఏర్పడిన తెల్లని వెలుతురును చూసి దెయ్యం అనుకొని మీరు భయపడసాగారు!’ అని చెప్పాడు. అప్పుడు జనాల్లో కొందరు... ‘అసలు ఆ చెట్టు మీదకు ఈ అద్దం ఎలా వెళ్లింది?’ అని అనుమానం వ్యక్తం చేశాడు. 

‘నిజమే ఆ అద్దం అక్కడ దాకా ఎలా వెళ్లింది? ఎవరు పెట్టారు?’ అంటూ అందరూ అనుకున్నారు. ‘మన ఊర్లోకి తరచుగా వచ్చే కోతులు, మన వస్తువుల్ని తీసుకుని వెళుతూ ఉండేవి. వాటి పనే అయ్యుంటుంది!’ అన్నారు గ్రామస్థుల్లో కొందరు. ‘నిజమే వాటి పనే అయ్యుంటుంది. ఆ కోతులు చేసిన పని వల్ల మనం దెయ్యాలు ఉన్నాయని భయపడి, చాలా ఇబ్బందులు పడ్డాం. గోవిందు లేకపోతే మనం ఈ అడవిలో దెయ్యాలు ఉన్నాయని, కొన్ని రోజులకు ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చేదేమో?’ అని అందరూ గోవిందుని అభినందించారు. గోవిందు గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘ఇప్పటికైనా మీరు ఈ మూఢనమ్మకాలను విడనాడండి. భయాన్ని వదిలి ధైర్యంగా బతకండి. మన బలహీనతే భయం. మన నమ్మకమే అసలు సిసలు ధైర్యం’ అనడంతో అందరూ సరేనని గోవిందుని మెచ్చుకుంటూ ఇంటి దారి పట్టారు. ఊరి వారందరూ తన కొడుకును అభినందనలతో ముంచెత్తడంతో ఆనందంలో మునిగిపోయాడు సోమయ్య.

ఏడుకొండలు కళ్లేపల్లి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని