అసలు దొంగ దొరికిందోచ్‌!

పార్వతీపురం శివారు ప్రాంతంలో ఒక పెద్ద చెట్టు ఉంది. దానిపైన చిలుక, కాకి, కొంగతోపాటు మరికొన్ని పక్షులు కూడా గూళ్లు కట్టుకొని నివసిస్తున్నాయి.

Updated : 27 Oct 2023 04:04 IST

పార్వతీపురం శివారు ప్రాంతంలో ఒక పెద్ద చెట్టు ఉంది. దానిపైన చిలుక, కాకి, కొంగతోపాటు మరికొన్ని పక్షులు కూడా గూళ్లు కట్టుకొని నివసిస్తున్నాయి. అక్కడకు కొత్తగా ఒక గుడ్లగూబ వచ్చి చేరింది. దాని రాకను ఆ చెట్టు మీద నివసించే పక్షులన్నీ వ్యతిరేకించాయి. ‘నేను పగటి పూట చూడలేను. ఆ సమయంలో చెట్టు తొర్రలోనే తలదాచుకుంటాను. మీకు ఎటువంటి అపకారం తలపెట్టను. నన్ను నమ్మండి’ అంటూ ప్రాధేయపడింది. దాంతో మిగతా పక్షులన్నీ సరేనన్నాయి.
ఓ రోజు కాకి, పక్కనున్న ఊళ్లోంచి ఒక నేతి గిన్నెను తీసుకొచ్చి చెట్టుపైన పెట్టింది. అది చూసిన చిలుక.. ‘ఏంటది?’ అంటూ ప్రశ్నించింది. ‘అద్దాల భవంతి పక్కనే ఉన్న ఇంటి కిటికీలో ఇది కనిపించింది. చూసేందుకు బాగుంది కదా అని ముక్కున కరచుకొని తీసుకొచ్చా’ అని జవాబిచ్చింది. ‘అలాగని చెప్పి నీకు నచ్చిన ప్రతిదీ తీసుకొచ్చేస్తావా?’ అని అడిగింది కొంగ. అవునంటూ నవ్వింది కాకి. ‘వస్తువును నువ్వు ఎత్తుకురావడంతో ఆ ఇంటి యజమానులు ఎంత బాధ పడుతుంటారో ఒకసారి ఆలోచించు..’ అంది చిలుక. ‘నేనేమీ ఇంట్లోకెళ్లి దొంగిలించుకు రాలేదు కదా.. బయటనే పెట్టి ఉంటే తెచ్చా’ అని కోపంగా అంది కాకి. ‘ఇలాగే మొన్న ఒక వెండి చెంచాను తీసుకొస్తుండగా.. నిన్ను కొందరు గ్రామస్థులు తరమడం మేమంతా చూడలేదనుకున్నావా?’ అంటూ కోపగించుకుంది చిలుక. ‘సర్లే.. పెద్ద చెప్పొచ్చావు’ అంటూ దాన్ని హెచ్చరించింది కాకి.

ఇదంతా చెట్టు తొర్రలోంచి వింటున్న గుడ్లగూబ.. అది ఎదురుచూస్తున్న సమయమొచ్చిందని లోలోపల సంతోషించింది. ‘ఏదైనా వస్తు సేకరణ అనేది మంచి అలవాటు. కాకికి ఆ అలవాటు ఉన్నందుకు మనమంతా మెచ్చుకోవాలి. ఇక మానవుల సంగతంటారా? వాళ్లు కోకిల అరుపులను స్వాగతిస్తారు. అదే పక్షి జాతికి చెందిన నా అరుపులను మాత్రం అసహ్యించుకుంటారు’ అంటూ కాకిని వెనకేసుకొచ్చింది గుడ్లగూబ. దాంతో కాకికి కొండంత బలం వచ్చింది. అందరి వైపు గర్వంగా చూసింది. ‘గుడ్లగూబా.. ఎవరి హద్దుల్లో వాళ్లుంటే మంచిది. కాకిని సమర్థిస్తూ కోరి దాన్ని కష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నావు. దొంగబుద్ధి అనేది చాలా ప్రమాదకరం. ముందు అల్లరికో, సరదాకో చేసినా.. కొన్నాళ్లకు అదే అలవాటుగా మారుతుంది. అందరి ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది’ అంటూ హితబోధ చేసింది చిలుక.

‘మిత్రుని గొప్పతనం అంగీకరించలేని మీకన్నా, నన్ను అర్థం చేసుకున్న గుడ్లగూబే నాకు వెయ్యి రెట్లు నయమనిపిస్తుంది’ అంటూ మిగిలిన పక్షులను ఈసడించుకుంది కాకి. ‘మిత్రమా..’ అంటూ ఆత్మీయంగా దాని దగ్గరకు వెళ్లింది గుడ్లగూబ. ‘పగటి సమయంలో నీకు చూపు కనిపించదు, కాబట్టి రేపటి నుంచి నాకు దొరికిన ఆహారంలో కొంత భాగం నీ తొర్రలో వేస్తాను’ అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చెప్పింది కాకి. సరేనంది గుడ్లగూబ. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు పిచ్చుక గూట్లోని గుడ్లు మాయమయ్యాయి. ఎలా మాయమయ్యాయో తెలియక.. అది ఏడవసాగింది. చిలుక వచ్చి దాన్ని ఓదార్చింది. ‘ఈ ఘాతుకానికి పాల్పడిందెవరు?’ అంటూ గట్టిగా కేకలేసిందది. ‘ఇంకెవరు? ఆ దొంగబుద్ధి కాకిదే కదా.. అదే అయ్యుంటుంది’ అంటూ మిగతా పక్షులు నిందలేశాయి.

తొర్రలోంచి ఈ తతంగమంతా వింటున్న గుడ్లగూబ తల బయటకు పెట్టి.. ‘నిన్న రాత్రి కాకి.. పిచ్చుక గూటివైపు వెళ్లడం నేను చూశాను’ అంది. ఎంతో నమ్మిన గుడ్లగూబ అలా చెప్పడంతో కాకి అవాక్కైంది. పిచ్చుక గుడ్లు తినలేదని అది నెత్తీనోరూ బాదుకున్నా ఏ ఒక్కటీ వినలేదు. అన్నీ కలిసి కాకిపైన దాడికి సిద్ధమయ్యాయి. చిలుక వాటిని వారించింది. ‘గుడ్లగూబకు రాత్రిపూట బాగానే కనిపిస్తుంది కదా.. పిచ్చుక గూటిలోకి కాకి వెళ్లడాన్ని అది చూసే ఉంటుంది. కాబట్టి అది చెప్పేదే నిజం’ అంది కొంగ.

‘అసలు కాకుల ఆహార అలవాట్లు మీకు తెలుసా? చీకటి పడ్డాక.. ఆహారం తినని జీవి ఈ భూమి మీద కాకి ఒక్కటే! అటువంటి కాకి ఈ పని చేసిందంటే నేను నమ్మను. గతంలో అది చేసిన చిన్న చిన్న దొంగతనాలను బట్టి దానిపైన నిందలు వేయడం సరికాదు. నాకు తెలిసి గుడ్లగూబే గుడ్లను మింగేసి, కాకి పైన ఆ నిందను వేస్తుందని నాకు అనిపిస్తోంది. ఒకసారి నీ పొడవు మెడను దాని తొర్రలో పెట్టి, గుడ్డు పెంకులు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించి చూడు’ అంటూ కొంగను పురమాయించింది చిలుక. అలాగేనంటూ ఆ తొర్రలో తలపెట్టి మొత్తం వెతికింది. దానికి ఒక మూలన గుడ్డు పెంకులు కనిపించాయి.

‘రాత్రివేళ పిచ్చుక ఆదమరచి నిద్రపోతున్న సమయంలో.. గుడ్లగూబే చాకచక్యంగా గుడ్లు దొంగిలించిందన్న నా అనుమానం నిజమైంది’ అంది చిలుక. తనపైన వేసిన నింద నిజం కాదని రుజువు చేసినందుకు చిలుకకు కృతజ్ఞతలు చెప్పింది కాకి. వెంటనే తొర్రలో దాక్కున్న గుడ్లగూబను ముక్కుతో బయటకు లాగేసిన కొంగ.. చెట్టు నుంచి దూరంగా విసిరేసింది. చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా.. ప్రాణాలు దక్కితే చాలనుకొని అక్కడి నుంచి జారుకుందది.

బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు