గులాబీ పువ్వు ఏమైంది?

చంద్రగిరికి జయంతుడు రాజు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు సూర్యకళ. ఆమె చెలికత్తె మల్లిక. కోటకు ఆనుకొని ఉన్న పూల తోట అంటే యువరాణికి ఎంతో ఇష్టం. అందులో దేశ విదేశాల నుంచి తెప్పించిన అనేక రకాల మొక్కలు ఉన్నాయి. యువరాణి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గంట పాటు చెలికత్తెతో కలిసి ఆ తోటలో విహరించేది.

Published : 28 Oct 2023 01:26 IST

చంద్రగిరికి జయంతుడు రాజు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు సూర్యకళ. ఆమె చెలికత్తె మల్లిక. కోటకు ఆనుకొని ఉన్న పూల తోట అంటే యువరాణికి ఎంతో ఇష్టం. అందులో దేశ విదేశాల నుంచి తెప్పించిన అనేక రకాల మొక్కలు ఉన్నాయి. యువరాణి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గంట పాటు చెలికత్తెతో కలిసి ఆ తోటలో విహరించేది. ఆ తోటకు కాపలాదారు శివయ్య. వారు ఆ తోటలోనే ఉన్న ఇంట్లో ఉంటున్నారు. సీతాపురంలో అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటున్న వాళ్లమ్మాయి సీత, సెలవులు కావడంతో అమ్మానాన్నలను చూడాలనుకుంది. తనను తీసుకొచ్చేందుకు ఒక ఎద్దుల బండిని పంపించాడు శివయ్య.

బండిలో వస్తుండగా దారి పక్కన ఒక కుక్క మూలుగుతూ కనిపించింది. ‘తాతా.. బండిని కాస్త పక్కకు ఆపవా?’ అడిగింది సీత. ఇద్దరూ బండి దిగి.. ఆ కుక్క వద్దకు వెళ్లారు. దాని కాలికి గాయమై రక్తం కారుతోంది. తాత తలపాగాను తీసి.. సీతకు ఇచ్చాడు. దాన్ని కుక్క కాలికి కట్టుగా కట్టిందామె. ‘తాతా.. ఈ పరిస్థితిలో కుక్కను ఇక్కడ వదలబుద్ధి కావడం లేదు’ అందామె. ‘అలాగేనమ్మా..’ అని ఆ కుక్కను ఎత్తుకుని బండి ఎక్కించాడు తాత. ఇంటికెళ్లాక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు వైద్యుడిని పిలిపించి చికిత్స చేయించారు. వారంలోనే కుక్క కోలుకుంది. ఆ తర్వాత నుంచి కుక్కకు, సీతకు మంచి స్నేహం ఏర్పడింది. తోటలో విహరించే ఒక చిలుక కూడా కుక్కకు దగ్గరైంది.

ఒకరోజు చెలికత్తె మల్లిక.. సీతను చూసింది. యువరాణి కంటే ఆమె ఎంతో అందంగా ఉంది. ఒక వారం తరువాత ‘యువరాణీ.. ఆ తోటమాలి కూతురు సీతకు బాగా పొగరు అనుకుంటా. కనీసం మిమ్మల్ని చూడడానికి కూడా బయటకు రావడం లేదు. అందంగా ఉంటుందని గర్వం కాబోలు’ అంది మల్లిక. ‘పోనీలే ఆమె అందంతో మనకు పనేంటి?’ అని సమాధానమిచ్చిందామె. కానీ, అది తనకు నచ్చలేదు. ఒకసారి సూర్యగిరి రాజు ఒక గులాబీ మొక్కను యువరాణికి కానుకగా పంపించాడు. ‘ఆ మొక్కకు పక్షం రోజులకో పువ్వు పూస్తుంది. అది మరో పక్షం రోజుల పాటు వాడిపోకుండా ఉంటుంది. అంతేకాదు.. ఎంతో సువాసన వస్తుంది’ అని దాని విశిష్టతను ఒక లేఖ రూపంలో వివరించాడాయన. సరేనంటూ కృతజ్ఞతలు తెలుపుతూ బదులుగా మరో లేఖను పంపిందామె.

కొద్దిరోజులకు ‘యువరాణీ.. సూర్యగిరి రాజు పంపించిన గులాబీ మొక్క మొదటిసారి పూసింది. చూద్దాం పదండి’ అని తీసుకెళ్లి చూపించింది మల్లిక. ‘అబ్బా.. చాలా అందంగా ఉంది.. సువాసన కూడా వస్తోంది.. ఇంతవరకు ఇలాంటి పుష్పాన్ని చూడలేదు’ అంది యువరాణి. మరుసటి రోజు చూస్తే, ఆ గులాబీ పువ్వు మాయమైంది. విషయాన్ని యువరాణికి తెలిపి, ఇదంతా ఆ సీత పనేనని కల్పించి చెప్పింది మల్లిక. యువరాణి ఆగ్రహంతో తండ్రి దగ్గరికెళ్లి మొత్తం వివరించింది. ఎలాంటి విచారణ చేయకుండానే సీతను చెరసాలలో పెట్టించాడు రాజు. ‘మహారాజా.. నా కూతురుకి ఏమీ తెలియదు’ అని శివయ్య ఎంత వేడుకున్నా లాభం లేకపోయింది.
సీతను చెరసాలలో పెట్టిన విషయం కుక్క, చిలుకకు తెలిసింది. ‘ఇది ఎవరో కావాలని చేశారు. ఈ తోటకు యువరాణి, మల్లిక తప్ప ఇంకెవ్వరూ రారు. వచ్చినా పని చేసుకొని వెళ్లిపోతారు. నాకు ఆ మల్లిక మీదే అనుమానంగా ఉంది’ అంది చిలుక. ‘మనం ఒక పని చేద్దాం.. మల్లిక కొలువు నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వెంబడించి ఆమె ఇల్లు ఎక్కడో కనిపెడదాం’ అంది కుక్క. చిలుక సరేనంది. మల్లిక కోట దాటి వెళుతుండగా.. అవి రెండూ ఆమెను వెంబడించాయి. కొద్ది దూరంలో ఉన్న ఇంట్లోకి వెళ్లిందామె. కుక్క ఆ ఇంటి గేటు బయటే ఒక పక్కగా కూర్చుంది. చిలుక మెల్లగా ఆ ఇంటి పెరట్లోని జామ చెట్టు మీద వాలింది. ఇంట్లోంచి మాటలు వినబడగానే కిటికీ పక్కన దాక్కుని వినసాగిందది.

‘మల్లికా.. నువ్వు తెచ్చిన గులాబీ పువ్వు సువాసన ఇల్లంతా వస్తోంది’ అని వాళ్లమ్మ అంది. ‘ఆ పువ్వును యువరాణి నాకు కానుకగా ఇచ్చింది. ఈ విషయం ఎవ్వరితోనూ అనకు’ అందామె. చిలుక రివ్వున ఎగిరి కుక్క వద్దకు వెళ్లి మొత్తం చెప్పింది. ‘శివయ్యకు చెప్పి ఇక్కడకు తీసుకురా.. వీళ్లు ఎక్కడికీ వెళ్లకుండా నేను చూసుకుంటాను’ అంది కుక్క. చిలుక వెళ్లి, శివయ్యకు విషయం చెప్పి రాజు గారిని వెంటనే కలవమంది. కోటకు వెళ్లి విషయాన్ని రాజుకు వివరించాడాయన. సరేనని.. నలుగురు భటులను పంపి, మల్లికతోపాటు ఆ గులాబీ పువ్వును కూడా తీసుకురమ్మన్నాడు రాజు. భటులు వెళ్లి, ఇంటి తలుపు తట్టగానే గడియ తీసింది మల్లిక. వారిని చూసి ఆమెతోపాటు తల్లిదండ్రులు కూడా బిత్తరపోయారు.

భటులు ఇంట్లోకి వెళ్లి, ఆ పువ్వును స్వాధీనం చేసుకొని మల్లికను కోటకు రమ్మని చెప్పారు. యువరాణి సమక్షంలో ‘మల్లికా.. నువ్వు గులాబీ పువ్వును దొంగిలించి ఆ నేరాన్ని సీత మీదకు ఎందుకు నెట్టావు?’ అని రాజు గద్దించి అడిగాడు. సీత మీద అసూయతోనే ఆ పని చేశానని నేరం ఒప్పుకొందామె. ‘అయితే.. నీకు ఆరు నెలలు కారాగార శిక్ష విధిస్తున్నాను’ అని మల్లికను చెరసాలలో పెట్టి, సీతను విడుదల చేయించాడు. ‘సీతా.. నన్ను క్షమించమ్మా.. ఎటువంటి విచారణ చేయకుండానే నిన్ను చెరసాలో పెట్టించాను. చదువు పూర్తి అవ్వగానే మన కోటలోనే నీకు కొలువు ఇస్తాను’ అన్నాడు రాజు. ‘ధన్యవాదాలు మహారాజా’ అంది సీత. గులాబీ పువ్వు దొంగతనం గుట్టు విప్పిన కుక్క, చిలుకను సీతతోపాటు ఆమె తల్లిదండ్రులూ ఆప్యాయతతో చేరదీశారు.

యు.విజయశేఖర రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని