నేను మృగరాజునైతే..!

అనగనగా ఒక అడవి. ఆ అడవికి మృగరాజు సింహం. బాలు అనే ఎలుగుబంటి మంత్రిగా ఉండేది. వయసు పైబడటంతో దాన్ని మంత్రిగా తప్పించి, చంపకమనే నక్కను మంత్రిగా నియమించింది.

Published : 29 Oct 2023 00:17 IST

అనగనగా ఒక అడవి. ఆ అడవికి మృగరాజు సింహం. బాలు అనే ఎలుగుబంటి మంత్రిగా ఉండేది. వయసు పైబడటంతో దాన్ని మంత్రిగా తప్పించి, చంపకమనే నక్కను మంత్రిగా నియమించింది. ఎలుగుబంటి మంత్రిగా ఉన్నప్పుడు జంతువుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, మృగరాజుకు తగిన సలహాలు ఇస్తుండేది. కానీ, చంపకం మంత్రయ్యాక పరిస్థితులు మారిపోయాయి. మృగరాజు ‘అడవిని సందర్శిద్దాం’ అని నక్కతో అన్నప్పుడల్లా.. ‘మీరు అడవికి రాజు. ఈ ఎండలో బయటకు వెళ్లడమేంటి? అడవిలోని జంతువుల్నే ఇక్కడికి రప్పిద్దాం’ అని చెప్పేదది. వారంలో ఒకరోజు జంతువులనే మృగరాజు దగ్గరకు రప్పించేది. వాటితో అంతా బాగుందని చెప్పించేది నక్క. కానీ, జంతువుల సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయేవి. తరచూ విందులు ఏర్పాటు చేయిస్తూ, మృగరాజు తన మాటే వినేటట్లు చేసేది. అప్పుడప్పుడు ఆటల పోటీలూ నిర్వహించేది. వేరే జీవుల్లా అరవమని చెబుతూ వాటిని ఆట పట్టిస్తూ ఆనందించేది.

అది ఇక తట్టుకోలేక జంతువులన్నీ పాత మంత్రి ఎలుగుబంటిని కలిశాయి. తమ కష్టాలు, చంపకం వల్ల కలుగుతున్న ఇబ్బందులను మొరపెట్టుకున్నాయి. అప్పుడా ఎలుగు.. ‘ఈ సమస్య నేను పరిష్కరిస్తాను. నేను చెప్పినట్లు చేయండి’ అని తన దగ్గరికొచ్చిన జంతువులకు భరోసా ఇచ్చింది. సరేనని వెళ్లిపోయాయవి. ఒకరోజు మృగరాజుతో జంతువుల సమావేశం ఏర్పాటు చేసింది నక్క. దానికి పాత మంత్రి ఎలుగుబంటి కూడా వచ్చింది. అది సింహం వద్దకు వెళ్లి.. ‘మృగరాజా.. ఈ సమావేశంలో ఒక వినోద క్రీడ నిర్వహిద్దాం’ అని అడిగింది. సరేనంది సింహం. ఇంతలో చంపకం కలగజేసుకుని ‘ఇంతకీ ఆ ఆట పేరేంటి?’ అని అడిగింది. ‘నేను మృగరాజునైతే...?’ జవాబిచ్చింది ఎలుగు.

మృగరాజు ఆసక్తితో ‘ఈ ఆట నియమాలు ఏంటి?’ అని అడిగింది. ‘ప్రభూ.. ఇక్కడ ఈ ఆటలో పాల్గొనాలనుకున్న జంతువులు.. అవి మృగరాజు అయితే ఏం చేస్తాయో చెప్పడమే. అయితే మీరు వాటి మాటలకు కోపం తెచ్చుకోకూడదు’ అని వివరించిందా ఎలుగు. అలాగేనంటూ మాటిచ్చిందది. ఆట ప్రారంభమైంది. ఏనుగు అడుగు ముందుకేసి.. ‘నేను మృగరాజునైతే... రోజురోజుకీ తరిగిపోతున్న మన అటవీ ప్రాంతాన్ని రక్షించేందుకు అన్ని జంతువులతో కలిసి చక్కని ప్రణాళిక తయారు చేస్తాను’ అంది. ఆ తర్వాత జింక.. ‘నేను మృగరాజునైతే... అడవిలోని జీవుల దాహం తీర్చేందుకు కుంటలు తవ్విస్తాను’ అంది. తర్వాత ఒక కుందేలు వచ్చి.. ‘నేను మృగరాజునైతే... అడవిలో తిరుగుతూ జంతువుల కష్టసుఖాలు తెలుసుకుంటా. సుపరిపాలన అందిస్తాను’ అంది. ‘నేను మృగరాజునైతే... విందు వినోదాలతో కాలక్షేపం చేయకుండా జీవుల క్షేమమే ధ్యేయంగా పనిచేస్తాను’ అంది కోతి. దాని మాటలకు మృగరాజు ఒక్కసారి ఉలిక్కిపడింది.

ఇంతలో ఒక తోడేలు ముందుకొచ్చి ‘నేను మృగరాజునైతే... చంపకం వంటి మంత్రిని దూరంగా పెడతాను. నా సొంత ఆలోచనలతో అడవిలోని జంతువులను కన్నబిడ్డల్లా చూసుకుంటాను’ అని గట్టిగా చెప్పింది. అక్కడి జంతువులన్నీ ఒక్కసారిగా చప్పట్లు కొట్టాయి. దాంతో మృగరాజుకు తన పరిపాలన ఎలా ఉందో అర్థమైంది. రాజు ఎలా ఉండాలో, ఏ రకంగా పరిపాలన చేయాలో తెలియజేయడానికే ఎలుగుబంటి ‘నేను మృగరాజునైతే..’ ఆటను నిర్వహించిందనే విషయం సింహానికి బోధపడింది. ఎలుగుకు కృతజ్ఞతలు తెలిపింది. చంపకం వైపు తిరిగి ‘నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోయావు. ఈరోజు నుంచి నిన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నాను’ అంది.

మిగతా జంతువులను ఉద్దేశించి.. ‘నన్ను క్షమించండి.. నా సొంత ఆలోచనలను పక్కనపెట్టి, చంపకం చెప్పిందే నిజమని నమ్మాను. అదే చేశాను. దాంతో మీరందరూ ఇబ్బందులు పడ్డారు. తదుపరి మంత్రిగా ఎవరిని నియమించాలో మీరే చెప్పండి’ అని అడిగింది సింహం. ఇంతలో ఎలుగు కల్పించుకొని.. ‘ప్రభూ.. మంత్రిగా తోడేలును నియమించండి. మీకు పాలనలో చక్కని సలహాలు ఇవ్వగలదు’ అంది. జంతువులూ అందుకు ఆమోదం తెలిపాయి. నక్క కూడా ముందుకు వచ్చి ‘నా తప్పులను క్షమించండి. నన్ను కూడా మీలో ఒకరిగా భావించండి’ అంటూ పశ్చాత్తాపపడింది. అప్పటి నుంచి తోడేలు సలహాలతో అడవిని చక్కగా పాలించిందా సింహం.

మొర్రి గోపి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని