కొండయ్య ప్రయాణం!

కొండగడప గ్రామంలో నివసించే కొండయ్య, ఒకసారి పక్క ఊరైన పల్లెగూడెంలోని బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్లాల్సి వచ్చింది. కానీ మధ్యలో ఓ అడవిని దాటాల్సి రావడంతో భయం భయంగానే ప్రయాణానికి సిద్ధమయ్యాడు. భార్య సీతాలక్ష్మి, కొండయ్యకు సంచిని అందిస్తూ... ‘ఏమయ్యా, అడవి గుండా వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్త! ఏవైనా జంతువుల అలికిడి వినిపిస్తే నీకు చెట్టు ఎక్కడం వచ్చు కదా...! గబ గబా చెట్టెక్కు’ అంటూ సలహా ఇచ్చింది.

Published : 30 Oct 2023 00:03 IST

కొండగడప గ్రామంలో నివసించే కొండయ్య, ఒకసారి పక్క ఊరైన పల్లెగూడెంలోని బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్లాల్సి వచ్చింది. కానీ మధ్యలో ఓ అడవిని దాటాల్సి రావడంతో భయం భయంగానే ప్రయాణానికి సిద్ధమయ్యాడు. భార్య సీతాలక్ష్మి, కొండయ్యకు సంచిని అందిస్తూ... ‘ఏమయ్యా, అడవి గుండా వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్త! ఏవైనా జంతువుల అలికిడి వినిపిస్తే నీకు చెట్టు ఎక్కడం వచ్చు కదా...! గబ గబా చెట్టెక్కు’ అంటూ సలహా ఇచ్చింది.

‘సర్లే...నాకు అన్నీ తెలుసు. అయినా నేనేమీ పిరికివాణ్ని కాదు’ అంటూ సంచిని అందుకుని ప్రయాణం మొదలుపెట్టాడు కొండయ్య. భార్య ముందు భయపడితే పరువు పోతుందని.. మేకపోతు గాంభీర్యంలా ఇంట్లో ధైర్యంగా ఉన్నాడు. కానీ ఇంటి నుంచి బయటకు వచ్చాక వణుకు మొదలైంది. అడవిలోకి నడక సాగిస్తూ... ‘దేవుడా... ఏ జంతువు కూడా నా జోలికి రాకుండా చూడు. తిరిగి వచ్చాక నీకో కొబ్బరికాయ కొడతా...’ అంటూ మనసులోనే అనుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

ఇంతలోనే కాస్త దూరంగా ఏదో అలికిడైంది. వెంటనే భార్య మాట గుర్తొచ్చి క్షణం కూడా ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న చెట్టు ఎక్కేశాడు. తర్వాత కిందికి చూసిన కొండయ్య నవ్వుకున్నాడు. ఆ తర్వాత తన ధైర్యంపై తనకే జాలి వేసి, కిందకు దిగాడు. కొండయ్యను చూసిన కుందేళ్లు మాత్రం భయంతో పరుగులు పెట్టాయి.

కొండయ్య హడావిడిగా చెట్టు ఎక్కడంతో దుస్తులు అక్కడక్కడా చిరిగిపోయాయి. దీంతో... ‘అయ్యో.. కొత్త బట్టలు కాస్తా చిరిగిపోయి, అసహ్యంగా తయారయ్యాయి’ అని చాలా బాధపడ్డాడు. కాసేపటికి తిరిగి ప్రయాణం ప్రారంభించాడు. అలా కొద్ది దూరం వెళ్లాడో, లేదో ఓ పెద్దపులి ఎదురైంది. కొండయ్యకు పై ప్రాణాలు పైనే పోయాయి. భయంతో గజగజ వణికాడు. చెమటతో తడిసి ముద్దైన కొండయ్యను తేరిపార చూస్తూ అది తనదారిన తాను వెళ్లిపోయింది.

కొద్దిసేపటి దాకా తేరుకోలేకపోయాడు కొండయ్య. ఇక ప్రాణాలు దక్కవు అనుకున్న తను ఇంకా ప్రాణాలతో ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది. అలా కొద్ది దూరం వెళ్లాడో లేదో.. ఈసారి ఓ సింహం ఎదురైంది. ఇప్పుడిక ప్రాణం పోవడం ఖాయమని గట్టిగా కళ్లు మూసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత చూస్తే సింహం తన దారిన తాను పోతూ కనిపించింది. కొండయ్య మరింత ఆశ్చర్యపోయాడు.
‘అరే.. ఏమైంది!? ఎందుకు జంతువులు నన్ను చూసి ఏమీ చేయకుండా వెళ్లిపోతున్నాయి! ఏమిటీ వింత!?’ అని తనలో తానే ప్రశ్నల వర్షం కురిపించుకుంటూ, ముందుకు నడక సాగించాడు.

ఇంకాస్త ముందుకు వెళ్లగానే ఎలుగుబంట్లు ఎదురయ్యాయి. ఈసారి పెద్దగా భయం వేయలేదు కానీ, ఎందుకైనా మంచిది అని దారికి కాస్త పక్కన నిలబడ్డాడు. ఎలుగుబంట్లు కొండయ్యను పట్టించుకోకుండా వాటి దారిన అవి వెళ్లిపోయాయి. కొండయ్య గుండెపై చెయ్యి వేసుకుని.... ‘హమ్మయ్య...’ అని నిట్టూర్చి తిరిగి బయలుదేరాడు. తనను చూసి జంతువులు భయపడుతున్నాయి అనుకున్నాడు కొండయ్య. దీంతో కొండంత ధైర్యం వచ్చింది.

దర్జాగా ఈల వేసుకుంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న కొండయ్యకు ఈసారి ఏనుగుల గుంపు ఎదురైంది. హుషారుగా వాటికి దగ్గరగా వెళ్లి...  ఓ ఏనుగు తొండంపై చేయి వేసి... ‘ఏంటీ.. విశేషాలు. మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? నాతో పాటు పల్లెగూడేనికి వస్తారా!? మంచి భోజనం పెట్టిస్తా...’ అంటూ నవ్వుతూ అడిగాడు. అసలే కోపంగా ఉన్న ఏనుగులకు కొండయ్య చేసిన పని మరింత చిరాకు తెప్పించింది. దీంతో గట్టిగా ఘీంకరించి కొండయ్యపై దాడి చేయబోయాయి. చివరి నిమిషంలో ప్రమాదాన్ని పసిగట్టిన కొండయ్య కాళ్లకు పని చెప్పాడు. దాదాపు అడవి చివరిదాకా వెంబడించిన ఏనుగులు తిరిగి వెనక్కి వెళ్లాయి. పరుగెత్తి పరుగెత్తీ అలిసిపోయిన కొండయ్య ఓ చెట్టు కింద కూర్చుని రొప్పుతున్నాడు. ఇదంతా గమనించిన ఓ కోతి కిందకు దిగింది. ‘ఎందుకు అలా భయపడుతున్నావు’ అని అడిగింది. జరిగిన విషయం కొండయ్య చెప్పగానే కోతి కిచకిచమని నవ్వింది.

‘ఈ రోజు అడవిలో పండగ జరిగింది. అడవికి రాజు అయిన సింహం మాంసాహార జంతువులను అన్నింటినీ విందుకు పిలిచింది. అందుకే అవన్నీ కడుపు నిండా భోజనం చేసి వస్తున్నాయి. ఆకలిగా లేకపోతే మా అడవిలోని జంతువులు వేటాడవు. అందుకే బతికిపోయావు. ఇక ఏనుగుల మంద అంటావా... అవి ఆహారాన్వేషణకు బయలుదేరితే నువ్వేమో, వాటితో పరాచికాలు ఆడావు. మరి వాటికి కోపం రాదా...!’ అంది కోతి.

అప్పటికి కానీ, అసలు విషయం అర్థం కాలేదు కొండయ్యకు. ‘వామ్మో.. ఈ రోజు నా అదృష్టం బాగుంది. లేకపోతే ఈ పాటికే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం, ఒంటరిగా అడవిని దాటకూడదు’ అనుకుని, వేగంగా అడవి నుంచి బయటపడ్డాడు కొండయ్య.  

వడ్డేపల్లి వెంకటేష్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని