కొండముచ్చు సలహా!

అనగనగా ఓ ఊరు. ఆ ఊరిలో కోతుల బాధ ఎక్కువ. వాటి అల్లరి పనులు భరించలేని ఆ ఊరి జమీందారు అడవి నుంచి ఒక కొండముచ్చును తెప్పించాడు. కొండముచ్చు అంటే కోతి జాతే. కానీ.. వాటి మూతి నల్లగా, తోక చాలా పొడవుగా ఉంటుంది. అంతే కాదు.. అవి కాస్త తెలివైనవి కూడా. దానికోసం ప్రత్యేకంగా ఓ బోనును తయారు చేయించాడా జమీందారు. దాన్ని ఆ బోనులో పెట్టి జామకాయలు, అరటి పండ్లు, కొబ్బరి చిప్పలు, పెరుగన్నం పెట్టేవాడు.

Updated : 02 Nov 2023 01:04 IST

నగనగా ఓ ఊరు. ఆ ఊరిలో కోతుల బాధ ఎక్కువ. వాటి అల్లరి పనులు భరించలేని ఆ ఊరి జమీందారు అడవి నుంచి ఒక కొండముచ్చును తెప్పించాడు. కొండముచ్చు అంటే కోతి జాతే. కానీ.. వాటి మూతి నల్లగా, తోక చాలా పొడవుగా ఉంటుంది. అంతే కాదు.. అవి కాస్త తెలివైనవి కూడా. దానికోసం ప్రత్యేకంగా ఓ బోనును తయారు చేయించాడా జమీందారు. దాన్ని ఆ బోనులో పెట్టి జామకాయలు, అరటి పండ్లు, కొబ్బరి చిప్పలు, పెరుగన్నం పెట్టేవాడు. స్వతహాగా ఆయన మంచి భోజనప్రియుడు కావడంతో తీసుకునే ఆహార పరిమాణం ఎక్కువైంది. దాంతో బరువు పెరిగిపోయాడు. శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ప్రతి చిన్న పనికీ పనివాళ్లపైనే ఆధారపడాల్సి వచ్చేది.

ఒకరోజు వంట చేసే వ్యక్తి వచ్చి, జమీందారు ముందు రకరకాల తినుబండారాలను పెట్టి వెళ్లిపోయాడు. అతడిని పరిశీలనగా చూసి.. ‘నా దగ్గర పనిచేసే వ్యక్తి.. సంపూర్ణ ఆరోగ్యంతో, చక్కటి శారీరక దారుఢ్యంతో చలాకీగా ఉన్నాడు. నాకు ఎంతో డబ్బుంది. అయినా, నా శరీరమెందుకు ఇలా తయారైంది?’ అని బాధపడ్డాడు. కాసేపు అదే ఆలోచనతో అటూఇటూ తిరిగాక, పక్కనే ఉన్న వాలు కుర్చీలో చతికిలబడ్డాడు. అప్పుడు ఆయన దృష్టి గోడకి వేలాడదీసి ఉన్న తన ఆరడుగుల చిత్రపటంపైన పడింది. ‘ఎంత అందంగా ఉన్నాను నేను.. చక్కటి శరీర సౌష్ఠవంతో హుందాగా నిల్చొని ఉన్న అందులోని నాకు, ఇప్పటి నాకు ఎంత తేడా ఉంది’ అని మనసులోనే అనుకున్నాడు.

వెంటనే కుర్చీలోంచి లేచి ఎదురుగా ఉన్న పెద్ద అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. తనపైన తనకే కాస్త ఏవగింపు కలిగింది. బోనులోంచి కొండముచ్చు ఇదంతా గమనించసాగింది. జమీందారు పక్కనే ఉన్న అరటిపండ్ల గెలలోంచి నాలుగు తెంచి దానికి అందించాడు. ‘అయ్యా.. అడవిలో చెట్ల కొమ్మలపై ఎక్కుతూ, ఊగుతూ, దూకుతూ గడిపే నన్ను తీసుకొచ్చి ఈ బోనులో బంధించారు. మీరు ప్రేమతో అందించే ఫలాలు తింటూ పనిలేక నా శరీరం పెరిగిపోయింది. ఇలాగే కొంతకాలం సాగితే నేను చెట్లు కూడా ఎక్కలేనేమో అనిపిస్తుంది’ అని వాపోయింది కొండముచ్చు.

ఆ మాటలకు జమీందారు ఆశ్చర్యంగా కొండముచ్చు వైపు చూశాడు. ‘అయ్యా.. అడవి నుంచి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నాజుగ్గా ఉండేదాన్ని.. ఇప్పుడు చూడండి ఎలా లావైపోయానో.. కేవలం తిని కూర్చోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. బోనులోంచి కాలు బయట పెట్టకుండా మీరే నాకన్నీ సమకూరుస్తున్నారు. కూర్చొని కూర్చొని నాకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేలా ఉన్నాయి. పని లేని జీవనం వ్యర్థమని మా అడవి జంతువులకు బాగా తెలుసు’ అందది. అవునన్నట్లు తలూపాడు జమీందారు.

‘అడవిలో ఏ జంతువూ ఖాళీగా ఉండదు. ఆహారం కోసం ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాయి. ఉదయం లేచింది మొదలు చీకటి పడేవరకూ కష్టపడుతూనే ఉంటాయి. మాకు ఇలా ఏ పనీ లేకుండా ఉండటం అలవాటు లేదు. మీ అలవాట్లతో నేనూ బరువు పెరిగి, ఇలా తయారయ్యా’ అంది. అప్పుడు పరిశీలనగా చూసి, దాని శరీరంలో వచ్చిన మార్పును గమనించాడు జమీందారు. తనదీ, కొండముచ్చుదీ ఒకే సమస్య అని గ్రహించాడాయన. మరుక్షణమే కొండముచ్చును బోనులోంచి విడుదల చేశాడు. అది నెమ్మదిగా బయటకు కదిలింది. కొద్దిదూరం నడిచి ఆయాసంతో ఆగి, వెనక్కి తిరిగి చూసింది.

‘కోతుల సమస్య పరిష్కారం కోసం నిన్ను అడవి నుంచి ఇక్కడికి తీసుకొచ్చా. కానీ, అంతకుమించిన నా సమస్యకు సమాధానం దొరికింది. నా తప్పు తెలుసుకున్నాను. శారీరక శ్రమ లేని ఏ జీవీ సుఖంగా ఉండలేదు. వివిధ అనారోగ్య సమస్యలతో అల్లాడిపోవాల్సిందేనని తెలియజెప్పావు’ అన్నాడు జమీందారు దానివైపు చూస్తూ. సిబ్బందిని పిలిపించి, ఆ కొండముచ్చును జాగ్రత్తగా అడవిలో వదిలిపెట్టమని చెప్పాడు. అప్పటి నుంచి ఉదయాన్నే నిద్ర లేవగానే వ్యాయామం చేయడం ప్రారంభించాడు. సిబ్బంది అవసరం లేకుండా.. తన పని తానే చేసుకోసాగాడు. కొద్దిరోజుల్లోనే బరువు తగ్గడంతో జమీందారు మనసు తేలికపడింది.

పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని