దాగని మోసం.!

పార్వతీపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు ఆ ఊరిలో మంచి పేరుంది. వాళ్ల ఇంటి పక్కనే భీమయ్య ఉంటున్నాడు. ఒకరోజు రామయ్య కుటుంబంతో సహా పట్టణంలో ఉండే బంధువుల పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది.

Updated : 04 Nov 2023 05:15 IST

పార్వతీపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు ఆ ఊరిలో మంచి పేరుంది. వాళ్ల ఇంటి పక్కనే భీమయ్య ఉంటున్నాడు. ఒకరోజు రామయ్య కుటుంబంతో సహా పట్టణంలో ఉండే బంధువుల పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లోని బీరువాలో ఉన్న పది బంగారు నాణేలను ఒక పెట్టెలో పెట్టి, దానికి తాళం వేసి భీమయ్యకు ఇచ్చాడు. దాన్ని జాగ్రత్త చేయమనీ, ఊరి నుంచి తిరిగొచ్చాక తీసుకుంటానని చెప్పాడు. ‘మీరు నిశ్చింతగా వెళ్లి రండి. పెట్టెను భద్రంగా చూసుకుంటాం’ అని జవాబిచ్చాడు భీమయ్య.

మరుసటి రోజే ఆ పెట్టెలో ఏముందో చూడాలని భీమయ్యకు అనిపించింది. అందుకోసం తాళాలు తయారు చేసే వ్యక్తి వద్దకు పెట్టె తీసుకెళ్లి.. దాని తాళం చెవి  పోయిందని చెప్పి మరొకటి చేయించాడు. ఇంటికి తిరిగి వెళ్లగానే పెట్టెను తెరిచి చూశాడు. అందులో సూర్యుడి గుర్తు ఉన్న పది బంగారు నాణేలు కనిపించాయి. ఎలాగైనా వాటిని సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది భీమయ్యకు. వెంటనే వాటిని తీసేసుకొని, ఆ స్థానంలో పది రాగి నాణేలు పెట్టి మళ్లీ తాళం వేశాడు.

వారం రోజుల తర్వాత రామయ్య తిరిగొచ్చాడు. వచ్చీరాగానే భీమయ్య ఇంటికి వెళ్లి, పెట్టెను తీసుకొచ్చి తెరిచి చూశాడు. అందులో బంగారు నాణేలకు బదులు రాగివి చూసి కంగుతిన్నాడు. భీమయ్య తనని మోసం చేశాడని అర్థమైంది. వెళ్లి అడిగినా ఫలితం ఉండదనుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే కోటకు వెళ్లి మహారాజును కలిసి విషయం వివరించాడు. రాజు.. మంత్రికి చెప్పి న్యాయం జరిగేలా చూస్తానన్నాడు. ఒక వారం తర్వాత ‘వినండహో... సూర్యుడి గుర్తున్న పాత బంగారు నాణేలను కోటలోని కోశాగారానికి అప్పజెప్పాల్సి ఉంటుంది. అందుకు బదులుగా వేరేవి తీసుకెళ్లాలి. గడువు తర్వాత పాతవి చెల్లుబాటు కావు’ అని ఊరిలో దండోరా వేయించాడు మంత్రి.

అది విన్న భీమయ్య.. మరుసటి రోజే నాణేలను తీసుకెళ్లి కోశాగారంలో అందించాడు. అక్కడి అధికారి ‘ఈ నాణేలు నీకు ఎలా వచ్చాయో... వాటి తాలూకు కాగితాలు కూడా కావాలి?’ అన్నాడు. ‘కాగితాలా? అవి ఎక్కడో పోయాయి’ అని బదులిచ్చాడు భీమయ్య. ‘అయితే, పోయినట్లుగా కాగితం రాసివ్వు. రేపు వచ్చి కొత్త నాణేలు తీసుకెళ్లు’ అని అధికారి చెప్పడంతో.. అలాగే రాసిచ్చాడు. మరుసటి రోజు భీమయ్య ఆ అధికారిని కలిసి.. కొత్త నాణేలు ఇవ్వమని అడగడంతో, మహారాజు వద్దకు తీసుకెళ్లాడు. అప్పుడు ‘భీమయ్యా.. ఈ నాణేలు నీకు ఎలా వచ్చాయో చెబుతావా? లేకపోతే శిక్ష అనుభవిస్తావా?’ అన్నాడు రాజు.
భీమయ్య నీళ్లు నములుతూ ‘ప్రభూ.. రామయ్య నాకు బాకీ పడ్డాడు. దానికి బదులుగా ఈ నాణేలు ఇచ్చాడు’ అని సమాధానం చెప్పాడు. వెంటనే రామయ్యను పిలిపించిన రాజు.. ‘నువ్వు భీమయ్యకు బాకీ ఉన్నావా?’ అని ప్రశ్నించాడు. ‘మహారాజా.. ఈ పత్రాలు చూడండి. అంతా మీకే అర్థమవుతుంది’ అని జవాబిచ్చాడు.

బంగారు నాణేలకు సంబంధించిన పత్రాలవి. వాటిని భీమయ్యకు చూపించిన రాజు.. ‘ఇప్పటికైనా నిజం చెబుతావా? లేకపోతే భటులను పిలిచి చెరసాలలో బంధించమంటావా?’ అని కఠినంగా ప్రశ్నించాడు. ఇక చేసేదేం లేక.. జరిగినదంతా వివరించి, రామయ్యను మోసం చేసినట్లు అంగీకరించాడు.

‘నమ్మిన వారిని మోసం చేయడమే కాకుండా, మహారాజుకే అబద్ధాలు చెప్పావు. అందుకు నువ్వు రామయ్యకు ఇవ్వాల్సిన పది బంగారు నాణేలతోపాటు అదనంగా అయిదు పరిహారంగా చెల్లించు. అంతేకాదు.. నీలాంటి మోసకారులకు ఈ రాజ్యంలో చోటు లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని ఆదేశించాడు రాజు. ‘అయ్యా.. తప్పయిపోయింది. మరోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటా’ అని భీమయ్య కోరడంతో.. పరిహారం వరకు చెల్లించమన్నాడు. దాంతో రామయ్యకు మొత్తం పదిహేను నాణేలు ఇచ్చాడు భీమయ్య. అదనంగా వచ్చిన ఆ అయిదు నాణేలను గ్రామాధికారికి అందించి, అభివృద్ధి పనుల కోసం వినియోగించమన్నాడు. దండోరా వేయించి, భీమయ్య మోసం బయటపడేలా చేసిన మంత్రిని సత్కరించాడు రాజు.

 యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని