తప్పు తెలిసొచ్చింది!

సిరిపురానికి చెందిన రంగయ్య ఉల్లిగడ్డల వ్యాపారి. రోజూ రెండు బస్తాల నిండుగా సరకును గాడిదపైన వేసుకుని చుట్టుపక్కల ఊళ్లకు వెళ్లి అమ్మేవాడు.

Published : 05 Nov 2023 00:08 IST

సిరిపురానికి చెందిన రంగయ్య ఉల్లిగడ్డల వ్యాపారి. రోజూ రెండు బస్తాల నిండుగా సరకును గాడిదపైన వేసుకుని చుట్టుపక్కల ఊళ్లకు వెళ్లి అమ్మేవాడు. ఒకసారి ఓ గ్రామంలోని రచ్చబండ వద్ద ఉల్లిగడ్డలను దింపి, గాడిదను గడ్డి తినేందుకు వదిలి పెట్టాడు. అప్పటికే అక్కడ గడ్డి మేస్తున్న మరో గాడిద దాన్ని చూసి.. ‘మిత్రమా.. ఎవరు నువ్వు? నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదే?’ అని అడిగింది. ‘మాది పొరుగూరు. అదిగో ఆ కనిపిస్తున్నాయనే మా యజమాని’ అని ఉల్లిగడ్డలు అమ్ముతున్న వ్యక్తిని చూపించింది.

‘మరి నువ్వో?’ అని తిరిగి ప్రశ్నించిందది. ‘రోజూ ఉదయాన్నే రెండు దుస్తుల మూటలను రేవు దగ్గర దించి, ఇక్కడికి వచ్చి సాయంత్రం వరకు హాయిగా గడ్డి మేస్తుంటాను’ అని జవాబిచ్చింది. ‘ఆహా.. నీది ఎంత తేలికైన పని. ఉదయాన్నే రెండు మూటలు తీసుకురావడం, సాయంత్రం మళ్లీ తీసుకెళ్లడం.. మా యజమాని అయితే నాతో చేయించని పని లేదు. బరువుగా ఉండే ఉల్లిగడ్డల మూటలను నామీద వేసి, ఊరూరా తిప్పుతుంటాడు. నా గురించి ఏమాత్రం పట్టించుకోడు. శ్రమ ఎక్కువ, విశ్రాంతి తక్కువ.. చాలా కష్టంగా ఉంది. పని తప్పించుకునేందుకు ఏదైనా సలహా ఇవ్వవా?’ అని అడిగిందది.

‘ఈరోజు సాయంత్రం ఇంటికెళ్లేటప్పుడు కుంటుతూ నడువు. అది చూసి యజమాని నీకు రేపు విశ్రాంతి ఇస్తాడు’ అని ఓ ఉపాయం చెప్పింది. అది చెప్పినట్లే.. రాత్రికి ఇంటికి వెళ్లే సమయంలో కుంటుతూ నడవసాగింది. అదిచూసిన రంగయ్య.. దానికి కాలు నొప్పి ఉందనుకొని, ఇంటి ముందున్న చెట్టు కింద కట్టేశాడు. ఎదురుగా కాస్తంత పచ్చి గడ్డి వేసి, తాగడానికి నీళ్లు పెట్టాడు. తక్కువ బరువున్న సరకుతో వ్యాపారానికి వెళ్లిపోయాడు.

తన ఉపాయం ఫలించిందనుకొని సంబరపడిన గాడిద.. అప్పటి నుంచి వారంలో రెండు రోజులు అలాగే చేయసాగింది. దాంతో విసుగు చెందిన రంగయ్య.. దాన్ని సంతకు తీసుకెళ్లి పాత సామగ్రి కొనే సోమయ్యకు అమ్మేశాడు. మరుసటి రోజు నుంచే దానికి పని చెప్పడం మొదలుపెట్టాడతను. అలా రెండు రోజులు బాగానే సాగింది. మూడో రోజు మాత్రం తనకు అలవాటైన పథకం అమలు చేసింది. కాలికి దెబ్బ తగిలినట్లు కుంటుతూ నడవసాగింది. ఒకట్రెండుసార్లు దానికి విశ్రాంతి ఇచ్చిన సోమయ్య, పదే పదే అలాగే చేస్తుండటంతో వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు.

గాడిదను పరీక్షించిన వైద్యుడు.. కొన్ని మందులు రాసిచ్చాడు. అయినా అది అలాగే కుంటుతూ నడుస్తుండటంతో వాత నొప్పులు అనుకున్నాడు సోమయ్య. ఇక లాభం లేదనుకొని, ఊరిలోని కొలిమి దగ్గరకు తీసుకెళ్లాడు. విషయం చెప్పి.. దాని కాలి మీద రెండు వాతలు పెట్టించాడు. ఆ బాధకు తట్టుకోలేని గాడిద.. ఓండ్ర పెడుతూ పరుగు అందుకుంది. అది చూసిన యజమాని.. దెబ్బకు నొప్పి ఎగిరిపోయిందనుకొని ఆనందించాడు. చాలా దూరం పరిగెత్తిన గాడిద, ఓ చెట్టు కింద కూర్చొని.. ‘రంగయ్యే కాస్త నయం. ఈ సోమయ్య మరీ రాక్షసుడిలా ఉన్నాడు.. ఏకంగా వాతలే పెట్టించాడు. పని తప్పించుకుందామని చూస్తే, అసలుకే మోసం వచ్చింది’ అనుకుంటూ బాధపడింది. ఎలాగోలా సాయంత్రానికి ఇంటికి చేరుకుందది. ఆరోజు నుంచి పనికి భయపడకుండా.. యజమాని చెప్పినట్లు నడుచుకోసాగింది.  

బెల్లంకొండ నాగేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని