నక్క, తోడేలు.. మధ్యలో ఎలుగు!

ఒక అడవిలో నక్క, తోడేలు ఉండేవి. అవి రెండూ చాలా స్నేహంగా జీవించేవి. ఆ అడవిని ఆనుకొని ఉండే గ్రామాలకు ప్రతిరోజూ వెళ్లి, దొంగతనంగా ఆహారాన్ని సంపాదించడం మొదట్నుంచి వాటికి అలవాటు.

Published : 07 Nov 2023 01:31 IST

క అడవిలో నక్క, తోడేలు ఉండేవి. అవి రెండూ చాలా స్నేహంగా జీవించేవి. ఆ అడవిని ఆనుకొని ఉండే గ్రామాలకు ప్రతిరోజూ వెళ్లి, దొంగతనంగా ఆహారాన్ని సంపాదించడం మొదట్నుంచి వాటికి అలవాటు. ఎంత తరిమినా, అవి మళ్లీ ఊళ్లలోకి వెళ్తూనే ఉండేవి. కోళ్లు, కుందేళ్లు, పక్షుల సంఖ్య నానాటికీ తగ్గిపోసాగింది. నక్క, తోడేలు దొంగతనాలకు విసిగిపోయిన ప్రజలు, ఎలాగైనా వాటిని బంధించాలని అనుకున్నారు. ఒకరోజు అవి ఊళ్లోకి వచ్చినట్టు పసిగట్టి, వాటిని తరుముకుంటూ అడవి లోపలి వరకూ వెళ్లిపోయారు. వాళ్లు ఎంతకూ వదిలేలా కనిపించకపోవడంతో, ఏం చేయాలో అర్థం కాక.. తెలివిగా మృగరాజు గుహ వైపు వెళ్లాయవి. వాటి అలికిడి విన్న సింహం.. గుహ నుంచి బయటకు వచ్చింది. కనుచూపు మేరలో కొందరు ప్రజలు ఆయుధాలతో కనిపించారు. అది వెంటనే గర్జించడంతో, ఆ శబ్దానికి భయపడి వారంతా వచ్చిన దారినే పారిపోయారు. అది చూసిన నక్క, తోడేలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. ఇకనుంచి ఏదైనా ఆపద ముంచుకొస్తే, గుహ వైపు వస్తే చాలనుకొని లోలోపలే సంబరపడ్డాయి.

మరుసటి రోజే జంతువులన్నింటితో సమావేశం ఏర్పాటు చేసింది మృగరాజు. ‘అడవి మన ఆవాసం. అడవి బతికితేనే మనం బతుకుతాం. ఆహారం కోసమో, ఇంకేదైనా కారణం చేతనో అడవి దాటితే, మానవులు మన నివాసాలపై దాడికి దిగుతారు. ఇకనుంచి మీరెవరూ గ్రామాల వైపు వెళ్లవద్దు’ అంటూ హెచ్చరించింది. ఆ మాటతో నక్క, తోడేలు గతుక్కుమన్నాయి. ‘మనుషులు మనకంటే తెలివైన వాళ్లా? నేను ఎత్తు వేశానంటే తిరుగే ఉండదు’ అంటూ తోడేలుతో గొప్పగా చెప్పుకొంది నక్క. ‘నిజమే కావచ్చు.. దొరకనంత వరకు మనం దొరలమే.. కానీ, ఒక్కసారి దొరికామా? రెంటికీ చెడతాం. ఇటు అడవిలో మృగరాజు ఉండనివ్వదు. అటు మానవుల మధ్య బతకలేం’ అంటూ అనుమానం వ్యక్తం చేసింది తోడేలు. ‘నా తెలివి మీద నీకు నమ్మకం లేదా? మృగరాజు నమ్మినబంటు ఎలుగును బుట్టలో వేసుకుంటే మన పని సులువవుతుంది’ అంటూ ధైర్యాన్ని నూరిపోసింది నక్క.

సమావేశం నుంచి నెమ్మదిగా తన నివాసానికి వెళ్తున్న ఎలుగుబంటిని ఓ చెట్టు నీడన ఆపాయవి. ‘ఎలుగు మిత్రమా.. తోడేలు బావకు చెరకు గడలు తినాలని చాలా కోరికగా ఉందట. కానీ, మేలైన తీపి రుచి మాకు అంతగా తెలియదు. అందుకే వచ్చి నిన్ను కలిశాం’ అంది నక్క. అవునంటూ మాట కలిపింది తోడేలు. ఆ మాటలకు ఎలుగుబంటి నవ్వి.. ఈసారి దొరికితే కచ్చితంగా తీసుకొచ్చి ఇస్తానులే అంది. ‘మన ఎలుగు మిత్రుడి మాటకు తిరుగులేదు. ముందు మనం ఈ దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్దాం. చెరకు తోటలు ఎక్కడున్నాయో వెతికి, ఎలుగుకు సమాచారం ఇద్దాం’ అంది నక్క. ‘అలాగే.. అంతలా ముచ్చటపడుతున్నారు కదా.. సరే మీరు ముందు వెళ్లండి. నేను నెమ్మదిగా మీ వెనక వస్తాను’ అంటూ భరోసా ఇచ్చింది ఎలుగు. ఆ మాటకు ఎగిరి గంతేశాయవి. ఆ నెపంతో పనిలో పనిగా కోడి, గొర్రె పిల్లను దొంగతనంగా తెచ్చుకోవాలనేది వాటి ఎత్తుగడ.

క్షణం ఆలస్యం చేయకుండా సరిహద్దు గ్రామం వైపు నడక ప్రారంభించాయవి. కొంతదూరం వెళ్లాక, దారిలో ఆకులు కుప్పలా పోసి ఉన్నాయి. ‘తోడేలు మిత్రమా.. మన పనులు ముగించుకుని మరలా ఇక్కడే కలుద్దాం. ఎలుగు మిత్రునికి చెరకు గడల తోటలు కనిపించలేదని అబద్ధం చెప్పేద్దాం’ అంటూ దాని జిత్తులమారితనాన్ని ప్రదర్శించింది నక్క. అలాగేనంటూ తలూపింది తోడేలు. ఆ ఎండుటాకుల కుప్ప దాటబోతుండగా.. దడేల్‌మని పడిపోయాయి. ఆ దెబ్బకు కుయ్యో మొర్రో అన్నాయి. ఏం జరిగిందో వాటికి అర్థం కాలేదు. కాస్త తేరుకున్నాక చుట్టూ చూశాయి. అప్పటికి కానీ గ్రామస్థులు తవ్విన గోతిలో పడినట్లు వాటికి అర్థం కాలేదు. ‘ఇప్పుడు మనల్ని రక్షించేదెవరు?’ అంటూ ఆందోళనతో అడిగింది నక్క. ‘ఏమో అనుకున్నాం కానీ, మానవులు మనకన్నా తెలివైన వాళ్లే..’ అంటూ మూలుగుతూ నక్కను దెప్పిపొడిచింది తోడేలు.

‘తెలివితేటల గురించి తర్వాత చర్చించుకుందాం. తెల్లవారే వరకూ ఇందులోనే ఉంటే, మనుషుల చేతిలో మనకు చావు తప్పదు. ఎలుగుకి మన గురించి తెలిసేలా అరుద్దాం’ అంది నక్క. సరేనంటూ ఆ రెండూ గట్టిగా అరవసాగాయి. ఆ కేకలు విన్న ఎలుగు.. అంతటా వెతుక్కుంటూ గొయ్యి వద్దకు వచ్చింది. అందులో పడిపోయిన వాటిని చూసి.. ‘అయ్యో..’ అంది. ముందు వాటిని బయటపడేసే మార్గం చూడమని ప్రాధేయపడ్డాయవి. అంతలో ఎలుగు బుర్రలో ఓ ఆలోచన మెరిసింది. గోతి పక్కనే ఉన్న వెదురు పొదల్లోంచి ఒకదాన్ని.. గోతిలోకి వంచింది. ‘మిత్రులారా.. ఆ కొనను గట్టిగా పట్టుకోండి’ అని చెప్పింది. అలాగే చేశాయవి. ఇంతలో నక్కకి ఎలా బయటపడగలమనే సందేహం వచ్చింది. అది అడిగేలోపు వెదురుకర్రను విడిచిపెట్టింది ఎలుగు. అంతే.. ఒక్కదెబ్బకు నక్క, తోడేలు గాల్లో ఎగురుకుంటూ మృగరాజు గుహ ముందు పడ్డాయి. అక్కడే ఉన్న సింహం ‘గాల్లో ఎగిరే విద్య నేర్చుకున్నారా?’ అంటూ ప్రశ్నించింది. ‘నిజం చెబితే ప్రాణాలకే ముప్పు’ అని గ్రహించిన ఆ రెండూ.. బాధపడుతూ అవునన్నట్లు తలూపాయి. ఇంకా అక్కడే ఉంటే, మరో ప్రశ్న అడుగుతుందేమోనని.. నెమ్మదిగా జారుకున్నాయి.

బి.వి.పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని