కుండ మీద కుండ!

శ్రీరామాపురంలోని కృష్ణుడి గుడికి చాలా పేరుంది. ఒకరోజు ఆ ఆలయం వద్ద బడి పిల్లలకు సరదాగా ఉట్టికొట్టే పోటీలు నిర్వహించారు. చాలామంది రాధాకృష్ణుల వేషాలు వేసుకుని అక్కడికి వచ్చి చేరారు.

Updated : 08 Nov 2023 06:43 IST

శ్రీరామాపురంలోని కృష్ణుడి గుడికి చాలా పేరుంది. ఒకరోజు ఆ ఆలయం వద్ద బడి పిల్లలకు సరదాగా ఉట్టికొట్టే పోటీలు నిర్వహించారు. చాలామంది రాధాకృష్ణుల వేషాలు వేసుకుని అక్కడికి వచ్చి చేరారు. అక్కడ అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఆ ఊరిలోని బడిలో పదో తరగతి చదివే దర్శివ్‌ కూడా అమ్మ వెంట పోటీలకు వెళ్లాడు. ఎలాగైనా ఆరోజు తానే ఉట్టి కొట్టాలని గట్టిగా అనుకున్నాడు.

కార్యక్రమ నిర్వాహకులు పాలు, పెరుగు, పసుపు కొమ్ములు వేసిన ఉట్టిని బాగా ఎత్తులో కట్టారు. వారిలో ఒకరేమో ఊరిస్తూ పైకీ కిందకూ ఉట్టిని లాగుతూ ఉన్నారు. పిల్లలంతా వరసలో ఒక్కొక్కరిగా వెళ్లి, ఉట్టి కొట్టడానికి వీర ప్రయత్నాలు చేయసాగారు. కానీ, వారెవ్వరికీ సాధ్యం కాలేదు. దర్శివ్‌ వంతు రానే వచ్చింది. అతడి మెడలో పూలమాల వేసి, కర్ర చేతికి ఇచ్చారు. అందరూ చప్పట్లు కొడుతుండగా నాగవిహారి బృందం కుర్రాళ్లు వచ్చి ఉట్టి కింద పిరమిడ్‌ ఆకారంలో కూర్చున్నారు.

చుట్టూ ఉన్నవాళ్లు నీళ్లు కొడుతుండగా.. కూర్చున్న వారి మీద ఎక్కి ఉట్టి కొట్టడానికి కర్ర పైకి ఎత్తాడు దర్శివ్‌. సర్రున ఉట్టి పైకి వెళ్లింది. అక్కడున్న వారందరూ ‘హ.. హ.. హ’ అని నవ్వేశారు. రెండోసారి.. మూడోసారి.. ప్రయత్నించినా ఉట్టి పగల్లేదు. నాలుగోసారి వాటం చూసి కర్రతో కొట్టాడు. ఉట్టి పగలడంతో అందులోని పాలు, పెరుగు, పసుపు కొమ్ములన్నీ దర్శివ్‌ మీద, కింద నిల్చున్న నాగవిహారి బృందం మీద పడ్డాయి. పిల్లలందరూ ‘భలే భలే’ అంటూ చప్పట్లు కొట్టారు. రంగురంగుల పూలు చల్లారు. చాలామంది దర్శివ్‌ దగ్గరికి వచ్చి అభినందనలు తెలిపారు. గెలుపు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడతను.

కార్యక్రమం ముగిశాక.. దర్శివ్‌ తమను పలకరించి, సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతాడని నాగవిహారి బృంద సభ్యులు ఆశించారు. కానీ, అతడలా చేయలేదు. వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇంతలో పక్కనుంచి వాళ్లమ్మ, బృందం వాళ్లకు కృతజ్ఞతలు తెలపమని చెప్పింది. దాంతో దర్శివ్‌ కాస్త గర్వంగా.. ‘ఇందులో వారి గొప్ప ఏముంది? అంతా నా ప్రతిభే కదా. లేనిపోని మెప్పులు వారికి ఆపాదించి, నన్ను తక్కువ చేయొద్దు. నిజంగా వాళ్ల ప్రతిభే ఉంటే, నాకన్నా ముందు ఉట్టి కొట్టాలని చూసిన వారు గెలిచి ఉండాలి కదా.. వీరి మీదే కదా వాళ్లు కూడా ఎక్కి ప్రయత్నించింది’ అని బదులిచ్చాడు. తర్వాత అమ్మ చేయి పట్టుకొని ఇంటికి బయలుదేరాడు.

మరుసటి రోజు వెంకటాపురం గ్రామస్థులు కూడా వారి ఊళ్లోని కృష్ణుడి గుడి వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ ఊరిలో పోటీలు ఎలా జరుగుతాయో చూద్దామని అమ్మని తోడు తీసుకొని వెళ్లాడు దర్శివ్‌. అక్కడ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాకపోవడంతో అమ్మతో పాటు గుడి ఆవరణలో కూర్చొని కబుర్లు చెప్పసాగాడు. ఉట్టి కోసమని అక్కడే మూలన చిన్న చిన్న మట్టి కుండలను ఒకదాని మీద ఒకటి పేర్చి ఉంచారు. ఆ వీధి చివరే కొందరు క్రికెట్‌ ఆడుతున్నారు. ఇంతలో బంతి రివ్వున వచ్చి.. గుడి ప్రాంగణంలో పేర్చిన కుండల్లో కింది దానికి తగిలింది. అంతే.. పెద్ద శబ్దంతో పైనున్న కుండలన్నీ కిందపడి పగిలిపోయాయి. వాటిని చూసిన దర్శివ్‌ ‘అయ్యో’ అన్నాడు.

పక్కనే ఉన్న వాళ్లమ్మ ‘చూశావా బాబూ.. కింది కుండను కొడితే పైనున్నవి కూడా ముక్కలయ్యాయి. కింది కుండ బలంగా ఉంటేనే పైకుండలు నిలవగలవు. ఎప్పుడైనా మన కింద ఉండేవాళ్లు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. అన్ని పనులూ మనం ఒక్కరమే చేసుకోవడం అసాధ్యం. అందరూ కలిసిమెలిసి ఉంటూ.. ఐకమత్యంతో పనిచేస్తేనే విజయం సాధ్యం. అందుకే నిన్న నాగవిహారి బృందానికి ధన్యవాదాలు చెప్పమన్నాను’ అని వివరించింది. ‘రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు’ అని దర్శివ్‌కు అర్థమైంది. అప్పుడే పోటీల కోసమని అక్కడికి వచ్చిన నాగవిహారి బృందం దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరాడు. ఇంతలో నిర్వాహకులు కొత్త కుండలు తీసుకొచ్చి కార్యక్రమం ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందించారు.

ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని