తోటలోని ఇల్లే నచ్చింది!

వేణు ఆరో తరగతి చదువుతున్నాడు. తనకు జ్వరం రావడంతో నాలుగు రోజులపాటు స్కూలుకు వెళ్లలేకపోయాడు. ఆ తర్వాత స్కూలుకు వెళితే అన్ని సబ్జెక్టుల్లో చాలా తరగతులు జరిగాయని తెలిసింది. వాటికి సంబంధించిన నోట్స్‌ ఇవ్వమని రవి, గోకుల్‌ను అడిగాడు. ‘సారీ వేణు.. ఇంటికి ఇవ్వను. లంచ్‌ టైమ్‌లో ఇస్తాను’ అని రవి, ‘నేను కూడా రెండ్రోజులు రాలేదు’ అని గోకుల్‌ సమాధానమిచ్చారు.

Updated : 09 Nov 2023 05:23 IST

వేణు ఆరో తరగతి చదువుతున్నాడు. తనకు జ్వరం రావడంతో నాలుగు రోజులపాటు స్కూలుకు వెళ్లలేకపోయాడు. ఆ తర్వాత స్కూలుకు వెళితే అన్ని సబ్జెక్టుల్లో చాలా తరగతులు జరిగాయని తెలిసింది. వాటికి సంబంధించిన నోట్స్‌ ఇవ్వమని రవి, గోకుల్‌ను అడిగాడు. ‘సారీ వేణు.. ఇంటికి ఇవ్వను. లంచ్‌ టైమ్‌లో ఇస్తాను’ అని రవి, ‘నేను కూడా రెండ్రోజులు రాలేదు’ అని గోకుల్‌ సమాధానమిచ్చారు. ‘అది నాలుగు రోజుల నోట్స్‌ కదా.. పూర్తిగా రాసుకోవడానికి లంచ్‌ సమయం ఎలా సరిపోతుంది? మరో నాలుగు రోజుల్లో పరీక్షలు కూడా ఉన్నాయి కదా!’ అన్నాడు వేణు.

తరగతిలో అంతగా మాట్లాడని రాజు అదంతా విన్నాడు. వెంటనే వేణుని దగ్గరకు పిలిచి ‘నోట్స్‌ నేను ఇస్తాను. కానీ, అవి ఇంటి దగ్గర ఉన్నాయి. రేపు తీసుకొస్తాను’ అన్నాడు. ‘రేపటి వరకూ ఎందుకు.. నేనే ఈరోజు మీ ఇంటికి వచ్చి తీసుకుంటా’ అని బదులిచ్చాడు వేణు. ‘మా ఇంటికి వస్తావా?’ అని ఆశ్చర్యంగా అడిగాడు రాజు. ‘ఏం.. రాకూడదా?’ అన్నాడు వేణు. ‘అలా అని కాదు. మా ఇల్లు మీ అందరిలా పెద్ద భవనం కాదు.. తోటలో ఒక మూలకు ఉండే రెండు గదుల చిన్న ఇల్లు అంతే..’ అని దిగాలుగా చెప్పాడు.

‘ఏం ఫర్వాలేదు. అందరి ఇళ్లూ ఒకేలా ఉండాలని లేదు కదా? అయినా స్నేహానికీ, ఇళ్లకీ సంబంధం ఏంటి?’ పెద్దమనసుతో అన్నాడు వేణు. ‘సరే.. అయితే ఈరోజు సాయంత్రం ఇద్దరం కలిసే మా ఇంటికి వెళ్దాం’ అని కాస్త అయిష్టంగానే అన్నాడు రాజు. సాయంత్రం బడి గంట మోగగానే ఇద్దరూ కలిసి బయలుదేరారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడవసాగారు. ఇంతలో ఒక పెద్ద భవంతి వచ్చింది. దాని వెనకనున్న తోటలోనే రాజు వాళ్లు ఉండేది. చిన్న ఇల్లే అయినా, చాలా బాగుంది.

ఇంటి చుట్టూ చెట్లు.. వాటిపై స్వేచ్ఛగా తిరుగుతున్న ఉడుతలు, సీతాకోకచిలుకలు. రంగురంగుల పూలు, కూరగాయల మొక్కలూ ఉన్నాయి. వాటిపైన రకరకాల పక్షులు సందడి చేస్తున్నాయి. ఆ పచ్చదనాన్ని చూస్తే వేణుకి ఒక్కసారిగా సినిమాల్లోని దృశ్యాలు గుర్తుకొచ్చాయి. ఆ చోటు తనకి చాలా బాగా నచ్చేసింది. తోటలోని ప్రతి అంశాన్ని ఆశ్చర్యంగా చూస్తూ.. ఎంచక్కా మొత్తం తిరిగేస్తున్నాడు.
ఇంతలో రాజు వచ్చి ‘ఏంటి వేణు.. అలా చూస్తున్నావు?’ అని అడిగాడు. ‘ఇక్కడ చాలా బాగుంది. మా అపార్ట్‌మెంట్‌ అయితే ఒక జైలులా అనిపిస్తుంది. మొక్కలు, స్వచ్ఛమైన గాలి అనే మాటే ఉండదు. కార్లు, బైకుల శబ్దాలు తప్ప చూద్దామన్నా పక్షులు కనిపించవు.. వాటి కిలకిలలు అసలే వినిపించవు’ అని బదులిచ్చాడు. ఆ మాటలకు రాజు ఆశ్చర్యపోయాడు. ఇన్ని రోజులు తనతోపాటు చదువుతున్న వాళ్లంతా పెద్ద ఇళ్లలో ఉంటారు. వారికి తమ రెండు గదుల ఇల్లు నచ్చదనుకున్నాడు. అందుకే పెద్దగా ఎవరితోనూ కలవకపోయేవాడు. కానీ, వేణు రాకతో తను ఇన్నాళ్లు అనుకున్నది తప్పని తెలిసింది. స్నేహితుడు తమ ఇల్లు నచ్చిందనడంతో చాలా ఆనందించాడు. ఇకపై ఇంటి విషయంలో తనను తాను తక్కువ చేసుకోవాల్సిన పని లేదని మనసులోనే సంబరపడ్డాడు.  

‘మా ఇల్లు నీకు నచ్చుతుందో లేదో అనుకొని చాలా కంగారుపడ్డాను. ఈ మాత్రం ఇల్లు ఉండడమే మా అదృష్టం. మా అమ్మానాన్నలు కూలీ పనులు చేస్తుంటారు. ఏ రోజు సంపాదన ఆరోజు ఖర్చులకే సరిపోతుంది’ అని చెప్పాడు రాజు. ‘అయ్యో.. నువ్వేం బాధపడకు. ఇల్లు చిన్నగా ఉంటే ఏమైంది. ఇక్కడే ప్రశాంతంగా ఉంది. హాయిగా చెట్ల కింద కూర్చుని చదువుకోవచ్చు.. ఎంచక్కా ఆడుకోవచ్చు’ అన్నాడు వేణు. ఇంతలో రాజు వాళ్లమ్మ వేణుకు జామకాయలు తెచ్చి ఇచ్చింది. ‘నువ్వు కూడా మీ ఇంటి ఆవరణలో కొన్ని మొక్కలు పెంచుకోవచ్చు.. కుండీలు కొన్నాక నాతో చెప్పు. పూల మొక్కలు తెచ్చిస్తా. ఆకుకూరలు కూడా పెంచుకోవచ్చు. అలాగే గ్రిల్‌ ఉంటే దానికి పాకే తీగ రకాలనూ వేసుకోవచ్చు’ అని సలహా ఇచ్చాడు.

‘అలాగే.. సెలవులు ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. మనిద్దరం కలిసి ఎంచక్కా ఈ చెట్ల కిందే ఆడుకుందాం’ అని ఉత్సాహంగా అన్నాడు వేణు. ఆ మాటలు రాజుకు మరింత సంతోషాన్నిచ్చాయి. ఇక మిత్రుడి నోట్స్‌ తీసుకుని, అక్కడి విషయాలన్నీ అమ్మానాన్నలకు చెప్పాలని ఆనందంగా ఇంటికి బయలుదేరాడు వేణు.

జె.శ్యామల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు